Monday, 2 November 2026

పార్టీ వ్య‌వ‌హారాల‌కు కిష‌న్‌రెడ్డి దూరం

(జ‌నంసాక్షి):ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్న సామేతను బీజేపీ సీనియర్లు నిజం చేశారు..టీడీపీతో పొత్తు విషయంలో పార్టీతో విబేధించిన కిషన్ రెడ్డిని ఆ పార్టీ సీనియర్లు పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంచుతున్నారు.  ప్రచార రధాలపై కిషన్ రెడ్డి పోటోలు లేకుండానే జనాల్లోకి వెళ్తున్నారు.. ఈ మధ్యనే పోత్తు కుదుర్చుకున్న చంద్రబాబు ఫోటోను మాత్రం ప్రచార రధాలపై ఘనంగా ముద్రించారు.కిషన్ రెడ్డి సలహాను అధిష్టాన పెద్దలు ఏమాత్రం ఆలకించలేదు. చివరికి మనసు పడిన సికింద్రాబాద్ సీటు దక్కకుండా పోవటంతో అంబర్ పేట సీటుతో సరిపెట్టుకోవాల్సిన వచ్చింది. ఇంతకీ తెలంగాణ బీజేపీలో ఎవరిది పై చేయి? చక్రం తిప్పడంలో  కిషన్‌ రెడ్డి సక్సెస్‌ అయ్యారా?  తన అనుచరులకు టికెట్లు ఇప్పించుకోవడంలో ఆయన ఆ మేరకు విజయం సాధించారు?

కుదిరితే తెలంగాణకు సీఎం కావాలి….కుదరకపోతే ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి కావాలి. ఇది  టీబీజేపీ అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి ఆలోచన ఇది. తెలంగాణ ఉద్యమం మొదలైనప్పటి నుంచి తెలంగాణలో వెంకయ్య నాయుడు కాకుండా కిషన్‌ రెడ్డి బీజేపీకి కేంద్ర బిందువయ్యారు. తెలంగాణ ఏర్పడిన  తర్వాత పార్టీ వ్యవహారాలు మొత్తం  అంతా కిషన్‌ రెడ్డి చేతికే వస్తాయని ఊహించిన ఆపార్టీ నేతలు ఆయన్ని నమ్ముకోవడం మొదలుపెట్టారు.

అయితే తాజా పరిణామాలతో  పరిస్థితి తలకిందులవడంతో కిషన్‌ రెడ్డిని నమ్ముకున్న వారికి చిప్పే గతైంది. కిషన్‌ను నమ్మి బీజేపీలోకి వచ్చిన సంకినేని వెంకటేశ్వరరావు,  పటాన్‌చెరు అంజిరెడ్డి, సికింద్రాబాద్‌ ఆలుగడ్డ శ్రీనివాస్‌కు మొండి చేయి దక్కింది.  పార్టీని నమ్ముకున్న నారాయణపేట నేత రతన్‌ పాండురెడ్డి, మక్తల్‌ కొండయ్య కూడా పోటీ చేయలేని పరిస్థితి ఏర్పడింది.

వీరు  కిషన్‌ రెడ్డి వర్గంగా ముద్రపడ్డవారే. ఇక సీనియర్లు ఇంద్రసేనా రెడ్డి, దత్తాత్రేయ, విద్యాసాగర్‌ రావుకు టికెట్‌ రాకుండా చేద్దామని ప్రయత్నించిన కిషన్‌ రెడ్డి తాను కోరుకున్న సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ టికెట్‌ తెచ్చుకోలేక… తనను నమ్ముకున్న వారికి టికెట్లు ఇప్పించుకోలేక రెంటికి చెడ్డ రేవడిలా మారారు.

సికింద్రాబాద్ లోక్ సభ నుంచి పోటీ చేస్తున్న బీజేపీ నేత బండారు దత్తాత్రేయ ఎన్నికల ప్రచార రధాలను బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రారంభించారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాలున్నాయి. ఇందుకోసం ఏడు వాహనాలను సిధ్దం చేశారు. అయితే అన్ని వాహనాలపై నరేంద్ర మోడీ, దత్తాత్రేయ పోటోలతో పాటు పార్టీ సీనియర్ నేతలు వాజ్ పేయి, అద్వానీ, చంద్రబాబు ఫోటోలు మాత్రమే వున్నాయి ఏ ఒక్క వాహనంపై కూడా కిషన్ రెడ్డి ఫోటో ముద్రించలేదు.

మరోవైపు టీడీపీతో పొత్తు వద్దన్న తన మాటకు పార్టీ విలువివ్వలేదని కిషన్ రెడ్డి పార్టీ కార్యకలపాలకు దూరంగా ఉంటున్నారు. ఇక సికింద్రాబాద్ లోక్ సభ పరిధిలో బండారు దత్తాత్రేయ ఏర్పాటు చేసిన మీటింగ్ కు కూడా కిషన్ రెడ్డి సమయానికి రాలేదు. దీంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాకుండానే మీటింగ్ ను పూర్తి చేశారు దత్తాత్రేయ. ఆలస్యంగా మీటింగ్ కు వచ్చిన కిషన్ రెడ్డి కార్యకర్తలను ముక్తసరిగా పలకరించి వెళ్ళి పోయారు. అయితే కిషన్ రెడ్డి వ్యవహారం మరింత ముదరకముందే ఏదోఒక పరిష్కారం ఆలోచించాలని పార్టీలో మిగతా సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *