Tuesday, 3 November 2026

కీలకంగా మారిన టీ జాక్‌ మద్దతు


టీడీపీ బీజేపీకి నో
సంప్రదిస్తున్న కాంగ్రెస్‌, అతి విశ్వాసంలో టీఆర్‌ఎస్‌
హైదరాబాద్‌, ఏప్రిల్‌ 12 (జనంసాక్షి) :
ఈ నెల 30న తెలంగాణలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ పడుతున్న పార్టీలకు టీ జేఏసీ మద్దతు కీలకం కానుంది. టీ జేఏసీలో టీఆర్‌ఎస్‌, బీజేపీ, న్యూ డెమోక్రసీ పార్టీలుండగా, తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ పార్టీ కూడా జేఏసీ మద్దతు కోరుతుంది. తెలం గాణ ఇచ్చిన పార్టీగా తమకు మద్దతి వ్వాలని, సోనియాగాంధీ
నాయకత్వాన్ని బలపర్చాలని టీ కాంగ్రెస్‌ నేతలు జేఏసీ ప్రతినిధులను కోరుతున్నారు. కాగా టీ జేఏసీ తమకు మద్దతిచ్చి తీరుతుందనే అతివిశ్వాసంతో టీఆర్‌ఎస్‌ ముందుకు సాగుతోంది. అయితే జేఏసీ మద్దతు ఎవరికో ఏప్రిల్‌ 14న ప్రకటించనుందని సమాచారం. తెలంగాణలో ఎవరికి మద్దతివ్వాలో టీ జేఏసీ ఇంకా తేల్చుకోలేదు. అయితే టీడీపీ-బీజేపీలకు మద్దతు ఇవ్వకూడదనే విషయంపై జేఏసీ ఇప్పటికే ఒక్క నిర్ణయనికి వచ్చిందని తెలుస్తోంది. తెలంగాణ ప్రాంత ప్రయోజనాలను దెబ్బతిసే విధంగా వ్వవహరించిన టీడీపీతో బీజేపీ దోస్తీని టీజేఏసీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని టీజేఏసీ వర్గాలు చెబుతున్నాయి. అయితే టీఆర్‌ఎస్‌ కాంగ్రెస్‌ల విషయంలోనూ సంపూర్ణ మద్దతు ఇవ్వకూడదన్న వాదన నానాటికీ బలపడుతోంది. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌, తెచ్చిన టీఆర్‌ఎస్‌ విషయంలో ఎలా వ్యవహరించాలన్న విషయం పై జేఏసీలో తీవ్ర చర్చ జరుగుతోంది. మొదట పూర్తిగా టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇవ్వాలనే భావించినా, తరువాత కాంగ్రెస్‌ పలువురు టీజేఏసీ నేతలకు టికెట్‌ ఇవ్వడంతో టీజేఏసీ పునరాలోచనలో పడింది. ఏప్రిల్‌ 14న జరిగే సమావేశంలో అసెంబ్లీలో ఎన్నికలో ఒక పార్టీకి, పార్లమెంట్‌ ఎన్నికలో ఒక పార్టీకి మద్దతు ఇచ్చే అవకాశం కూడా ఉంది. అసెంబ్లీకి టీఆర్‌ఎస్‌, పార్లమెంట్‌కు కాంగ్రెస్‌కి మద్దతు ఇచ్చే అంశాన్నీ పార్టీ పరిశీలిస్తోంది. జేఏసీ నేతలు ఏ పార్టీ నుంచి పోటీ చేసినా వారికి మద్దతివ్వాలా వద్దా అన్న అంశం కూడా పరిశీలనలో ఉందని తెలుస్తోంది. అయితే వ్యక్తుల వారీగా మద్దతు ఇచ్చే అంశాని కూడా పరిశీలిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *