Tuesday, 3 November 2026

ఛత్తీస్‌గఢ్‌లో పంజా విసిరిన మావోయిస్టులు


13 మంది మృతి
రాయ్‌పూర్‌, ఏప్రిల్‌ 12 (జనంసాక్షి) :
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు పంజా విసిరారు. వేర్వేరు ప్రాంతాల్లో వారు రెచ్చిపోయారు. ఈ దాడుల్లో మొత్తం 13 మంది జవాన్లు తమ
ప్రాణాలను కోల్పోయారు. విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు.. వివరాలిలా ఉన్నాయి. బీజాపూర్‌ జిల్లా కుంతల్నార్‌ సమీపంలోని అటవీ ప్రాంతంలో ఎన్నికల సామాగ్రితో వాహనంలో తిరిగి వస్తున్న సిబ్బందిపై శనివారం ఉదయం మందుపాతరతో దాడి చేశారు. 12 మందిలో ఆరుగురు అక్కడికక్కడే సంఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. పోలింగ్‌ సిబ్బందిలోని పలువురికి, పలువురు జవాన్లకు గాయాలయ్యాయి. వారందరిని ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉండగా 108 వాహనంలో ఎన్నికల సామాగ్రిని తరలిస్తుండగా ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పూర్‌ జిల్లా జి.రామ్‌ఘాట్‌ వద్ద మందుపాతరను పేల్చారు. ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మరో 10 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉండగా మావోయిస్టుల దాడులు జరగనున్నాయన్న ఇంటెలిజెన్స్‌ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు, పోలీసులు అనేక జాగ్రత్తలు తీసుకున్నారని, అయినప్పటికీ మావోయిస్టుల దాడులు కొనసాగడం పట్ల కొందరు అధికారులు కలవరం చెందుతున్నారు. మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *