నిప్పంటుకున్న వోల్వో
కర్ణాటక, గౌహతిల్లో ఘోరం
బెంగళూర్/గౌహతి, ఏప్రిల్ 16 (జనంసాక్షి)
ఒకే రోజు రెండు భారీ ప్రమాదాలు చోటు చేసు కున్నాయి. కర్ణాటకలో ఓ వోల్వో బస్సుకు నిప్పం టుకోగా,
గౌహతిలో రైలు పట్టాలు తప్పింది. కర్ణాటకలో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళుతున్న బస్సు బోల్తా పడటంతో వెంటనే మంటలు చెలరేగాయి. మంటల్లో ఆరుగురు సజీవదహనం కాగా, 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని బాధితులను సమీప ఆస్పత్రికి తరలించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఎన్‌టీఆర్ ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేటు బస్సు 30 మంది ప్రయాణికులతో దావణగెరె నుంచి బెంగళూరుకు బయలుదేరింది. తెల్లవారుజామున హిరియూరు తాలూకా నేటికుర్తి వద్దకు రాగానే బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. వెంటనే బస్సులో మంటలు చెలరేగాయి. గాఢనిద్రలో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా ఉలికి పాటుకు గురై హాహాకారాలు చేశారు. దూకేవారు దూకి, బస్సులోని వారిని సాధ్యమైనంత మేరకు బయటకు లాగారు. ఈ ఘటనలో బస్సు పూర్తిగా దగ్ధమైంది. మంటల్లో చిక్కుకున్న ఆరుగురు ప్రయాణికులు దుర్మరణం చెందారు. సమాచారం అందిన వెంటనే హిరుయూరు నుంచి అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పారు. బస్సు అతివేగంగా వెళ్లడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై కర్ణాటక ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
అస్సోంలోని మోరిగాన్ వద్ద బుధవారం తెల్లవారుజామున రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 50మందికి గాయపడగా వారిలో 15మంది ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. స్థానికుల, పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. దిమాపూర్-కామఖ్య బీజీ ఎక్స్‌ప్రెస్ రైలు (15666) ఆజూరి స్టేషన్‌కు సమీపంలోని మోరిగాన్ వద్ద బుధవారం తెల్లవారుజామున 2.05 గంటలకు మూడు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో 50మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో 15మంది ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో గౌహతిలోని మెడికల్ కళాశాల ఆసుపత్రికి తరలించారు. స్వల్ప గాయాలకు గురైన వారిని మోరిగాన్‌లోని సివిల్ ఆసుపత్రికి తరలించినట్టు నార్త్‌ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే అధికారులు తెలిపారు. రైల్వే సీనియర్ అధికారులు, రెస్క్యూ టీమ్ రంగంలోకి దిగి బోగీలను తొలగిస్తున్నారు. పలు రైళ్ల రాకపోకలను మళ్లించారు. ఇదిలాఉండగా బోగీలు పట్టాలు తప్పడంపై అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.




