Tuesday, 3 November 2026

నీకు డబ్బులిస్తానంటే ఎందుకు దాచావ్‌


20 మంది తెలంగాణ ద్రోహులకు టికెట్లిచ్చావ్‌ : పొన్నాల
హైదరాబాద్‌, ఏప్రిల్‌ 20 (జనంసాక్షి) :తెలంగాణ ఉద్యమాన్ని బంద్‌ చేసేందుకు కేవీపీ డబ్బులిస్తానంటే ఇన్నాళ్లు ఎందుకు దాచావంటూ టీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కేసీఆర్‌పై మండిపడ్డారు. విశ్వసనీయత లేని వ్యక్తి తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర్‌రావు అంటూ పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. ఆదివారం నగరంలో తెలంగాణ ఇంగ్లిష్‌ జర్నలిస్టుల ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్‌ ప్రెస్‌లో పొన్నాల మాట్లాడారు. ఉద్యమం సమయంలో ఫాంహౌస్‌లో విశ్రాంతి తీసు కుని ప్రత్యక్షంగా ఉద్యమంలో ఎన్నడూ పాల్గొనని కేసీఆర్‌ ఇప్పుడు తెలంగాణా తానే తె చ్చానని చెబుతున్నారని ఆయన మండిపడ్డారు. తెలంగాణా ఇచ్చే వరకు సోనియా గాంధీ దేవత అంటూ పొగిడి తన కుటుంబ సభ్యులతో కలిసి సోనియా నివాసానికి వెళ్లి ఇప్పుడు సోనియా బలి దేవత అంటూ మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. సొం త పార్టీలో నాయకులున్నా.. వారిని పక్కనబెట్టి కుటుంబ సభ్యులతో కలిసి సోనియాను ఏమి ఆశించి కలిశారో తెలంగాణా ప్రజలకు సమాధానం
చెప్పాలన్నారు. కేవలం ముఖ్యమంత్రి పదవి కోసం అడ్డమైన గడ్డి తింటున్నారని, తెలంగాణా ఇస్తే కాంగ్రెస్‌లో టిఆర్‌ఎస్‌ను విలీనం చేస్తానని బహిరంగంగా పలుమార్లు ప్రకటించిన కేసీఆర్‌ ఇప్పుడు ఎందుకు విలీనం చేయలేదో ప్రజలు అర్ధం చేసుకోవాలన్నారు. కెసిఆర్‌ అధికారంలోకి వస్తే దొరల పాలన, గడీల రాజ్యం మళ్లీ వస్తుందన్నారు. తెలంగాణా పునర్నిర్మాణం కాంగ్రెస్‌తోనే సాధ్యమవుతుందని, టీఆర్‌ఎస్‌ వల్ల ఏమీ కాదన్నారు. పార్లమెంటులో కేవలం ఇద్దరు సభ్యులున్న టీఆర్‌ఎస్‌ తెలంగాణ ఎలా తెచ్చిందని ప్రశ్నించారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లుపై చర్చ జరిగే సందర్భంలో కనీసం సవరణలకు కూడా ప్రతిపాదించకుండా మౌనంగా కూర్చున్న కేసీఆర్‌ను ప్రజలు గుర్తించారన్నారు. కెసిఆర్‌ తెలంగాణా ప్రజలను మభ్య పెట్టి మోసం చేసేందుకే ప్రయత్నిస్తున్నారని, ఆయన వల్ల ఏదీ కాదన్నారు. కూతుర్ని, అల్లుడ్ని, కొడుకును ప్రజా ప్రతినిధులుగా చేసి కుటుంబ పాలన తెచ్చి ప్రజలను మోసం చేస్తారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కెసిఆర్‌ నిజస్వరూపాన్ని బయట పెడతానని, ఆయన అధికారంలోకి వస్తే తెలంగాణ భ్రష్టు పడుతుందని, కీలక సమయంలో ప్రజలు అప్రమత్తంగా మెలగాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *