
న్యూఢిల్లీ, ఏప్రిల్ 21 (జనంసాక్షి) :
ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన తాత్కాలింగా రద్దు చేసి ఆ వెంటనే మళ్లీ విధించాలంటూ రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నర సింహన్ ఢిల్లీలో మంత్రాంగం నడుపుతున్నాడు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందడాన్ని నిరసిస్తూ అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రాజీనామా చేయడంతో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అనివార్యమైంది. రాష్ట్ర పతి పాలనకు పార్లమెంట్ ఆమోదం
తప్పనిసరి కావడం, ప్రస్తుతం పార్లమెంట్‌ను సమావేశ పరిచే అవకాశం లేకపోవడంతో తాత్కాలింగా ప్రెసిడెంట్ రూల్ ఎత్తివేసి మళ్లీ విధించే యోచనలో కేంద్రం ప్రభుత్వం ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఉనికిలోకి వచ్చే అపాయింటెడ్ డే జూన్ 2 ఉండటంతో మరో రెండు నెలలు ఇక్కడ రాష్ట్రపతి పాలన అనివార్యమైంది. ఫిబ్రవరి 19న కిరణ్‌కుమార్‌రెడ్డి రాజీనామా చేయగా రాష్ట్రంలో మార్చి 1న రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. రెండు నెలల గడవు ఈనెల 30న ముగియనుంది. ఈనేపథ్యంలో ఇరు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు అధికారాన్ని చేపట్టే వరకు రాష్ట్రపతి పాలనను పొడిగించడానికి కేంద్రం కసరత్తు చేస్తోంది. ఒకానొక దశలో ఆరధ్రప్రదేశ్ అసెంబ్లీని రద్దు చేయాలని సిఫార్సు చేసేందుకు సిద్ధపడిన గవర్నర్ మళ్లీ ఎందుకో వెనక్కి తగ్గారు. రాజ్యాంగంలోని 356 అధికరణానికి లోబడి రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసే నోటిఫికేషన్ కాల వ్యవధి రెండు నెలలే కావడంతో గడువు ముగియగానే దానిని ఒక నిబంధన ప్రకారం తొలగించి, మరో నిబంధన ప్రకారం మళ్లీ విధించవచ్చని కేంద్ర హోం మంత్రిత్వశాఖ వర్గాలు వెల్లడించాయి. గవర్నర్ హోం మంత్రిత్వ శాఖ అధికారులతో టచ్‌లో ఉంటూ రాష్ట్రపతి పాలన పొడిగింపుపై సంప్రదింపులు జరుపుతున్నారు.
రాష్ట్రపతి పాలన రాద్దు చేసి మళ్లీ విధించాలి




