Tuesday, 3 November 2026

ఇంటర్‌ మొదటి సంవత్సరం ఫలితాలు విడుదల


బాలికలదే హవా

55.84 శాతం ఉత్తీర్ణత

ఫలితాలు విడుదల చేసిన గవర్నర్‌ సలహాదారు సలావుద్దీన్‌ అహ్మద్‌
హైదరాబాద్‌, ఏప్రిల్‌ 28 (జనంసాక్షి) :
ఇంటర మొదటి సంవత్సరం ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. 55.84 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. బాలుర కంటే బాలికలే పైచేయి సాధించారు. బాలికల ఉత్తీర్ణతా శాతం 60.52 కాగా, బాలురది 51.37శాతం. ఈ ఏడాది కూడా ఇంటర్‌ మొదటి సంవత్సరం ఫలితాల్లో బాలికలే ముందంజలో ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 8.68 లక్షల మంది విద్యార్థులు ఇంటర్‌ తొలి ఏడాది పరీక్షలు రాశారు. వారిలో 4.55 లక్షల మంది ఉత్తీర్ణులయ్యారు. ఫలితాల్లో 74 శాతంతో కృష్ణా జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. 38 శాతంతో ఆదిలాబాద్‌ చివరి స్థానంలో ఉంది. చదువుల తల్లి బాసర జ్ఞాన సరస్వతి నెలకొన్న ఆదిలాబాద్‌ జిల్లా ఫలితాలు నిరాశపరిచాయి. అయితే బాలికలు మాత్రం టాప్‌గేర్‌లో ఉన్నారు. ఇంటర్మీడియెట్‌ మొదటి సంవత్సరం ఫలితాలు సోమవారం విడుదల అయ్యాయి. గవర్నర్‌ నరసింహన్‌ సలహాదారు సలావుద్దీన్‌ అహ్మద్‌ నాంపల్లి ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు ఫలితాల సీడీని విడుదల చేశారు. అలాగే ఈసారి ఫలితాల గ్రేడులతో పాటు మార్కులను కూడా అందుబాటులో ఉంచారు. విద్యార్థులు ఫలితాలను బీఎస్‌ఎన్‌ఎల్‌ ల్యాండ్‌ లైన్‌ ద్వారా 1100కు, ఇతర ల్యాండ్‌ లైన్‌, మొబైల్‌ ద్వారా 1800-425-1110 నంబర్లకు ఫోన్‌ చేసి ఫలితాలను తెలుసుకోవచ్చు. ఈసారి ఇంటర్‌ ప్రథమ సంవత్సరం పరీక్షకు జనరల్‌లో 8,68,744 మంది హాజరుకాగా, వృత్తివిద్యా కోర్సుల్లో 59710 మంది హాజరయ్యారు. వీరిలో ఏ గ్రేడ్‌లో జనరల్‌- 231764(47.78శాతం), వృత్తి విద్య- 13016(50.71శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. అలాగే బీ గ్రేడ్‌లో జనరల్‌- 144336(29.76శాతం), వృత్తివిద్య- 11684(45.52శాతం), సీ గ్రేడ్‌లో జనరల్‌- 75263(15.52శాతం), వృత్తివిద్య- 920(3.58శాతం), డీ గ్రేడ్‌లో జనరల్‌- 33706(6.95శాతం), వృత్తివిద్య- 46(0.18శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తం ఉత్తీర్ణతా శాతం జనరల్‌- 55.84శాతం(485069), వృత్తివిద్య- 42.98శాతం(25666). వృత్తివిద్య కోర్సుల్లో బాలికల ఉత్తీర్ణత శాతం 50.03 కాగా, బాలురు 38.69 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. పరీక్షల్లో అవకతవకలకు పాల్పడి డిబార్‌ అయిన వారు జనరల్‌-80, వృత్తివిద్య- 13 మంది. జనరల్‌లో 13 మంది, వృతివిద్యలో 16 మంది ఫలితాలను విత్‌హెల్డ్‌లో వుంచారు. ఇంటర్‌ ప్రథమ సంవత్సర జవాబపత్రాల పునర్‌ ముల్యాంకనం, మార్కుల రీకౌంటింగ్‌ కావాల్సిన విద్యార్థులు మే 6లోపు దరఖాస్తు చేసుకోవాలని ఇంటర్‌బోర్డు కార్యదర్శి రామ్‌ శంకర్‌ నాయక్‌ తెలిపారు. రీకౌంటింగ్‌కు రూ.100, జవాబు పత్రం మూల్యంకనం కోసం రూ. 600లను విూసేవా లేదా ఏపీలైన్‌ కేంద్రాల ద్వారా ఇంటర్‌బోర్డుకు చెల్లించాలని ఆయన కోరారు. తమ దరఖాస్తులో ఏ స్జబెక్టు కోసం రుసుం చెల్లిస్తున్నారో తప్పనిసరిగా పేర్కొనాలని తెలిపారు. విద్యార్థులు తమ చిరునామా, ఫోన్‌నెంబర్‌ను విధిగా పేర్కొనాలని సూచించారు. పునర్‌మూల్యాంకనం విధానంలో విద్యార్థి జవాబపత్రాన్ని జిరాక్స్‌ తీసి అతని చిరునామాకు పంపిస్తామన్నారు. పునర్‌మూల్యాంకనం కోసం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి మే 6 వరకు గడువున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు చెల్లించిన రుసుంను తిరిగి ఇవ్వబడదని తన ప్రకటనలో వెల్లడించారు. ఇంటర్‌ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో గతంతో పోలిస్తే ఒక్కశాతం మాత్రమే పెరుగుదల కన్పించింది. మొత్తం 55.84 శాతం ఉత్తీర్ణులవగా, గత ఏడాదికన్నా 1.24 శాతం పెరుగుదల నమోదైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *