
క్యూలో వచ్చి ఓటు వేయండి
చిరుకు చేదు అనుభవం
ఓటర్ల అభ్యంతరంతో క్యూలో నిలబడి ఓటేసిన చిరంజీవి
హైదరాబాద్, ఏప్రిల్ 30 (జనంసాక్షి) :
కేంద్ర మంత్రి, ఏపీ పీసీసీ ప్రచార కమిటీ సారథి చిరంజీవికి చేదు అనుభవం ఎదురైంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో జరుగుతున్న తొలి సార్వత్రిక ఎన్నికల్లో ఓటరు అంతే చైతన్యం ప్రదర్శించాడు. క్యూలో కాకుండా నేరుగా పోలింగ్ కేంద్రంలోకి వెళ్లడానికి ప్రయత్నించిన చిరంజీవిని వారించి క్యూలోకి వచ్చేలా చేశాడు. భాయ్ సాబ్ ఇది తెలంగాణ రాష్ట్రం అంటూ చిరంజీవికి ఓటర్ తేల్చిచెప్పాడు. చిరంజీవి జూబ్లీహిల్స్ క్లబ్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు వేసేందుకు తన భార్య సురేఖ, కుమారుడు రాంచరణ్ తదితరులతో కలిసి బుధవారం ఇక్కడకు వచ్చారు. వేసేందుకు వచ్చిన చిరు నేరుగా పోలింగ్ కేంద్రంలోకి వెళ్లేందుకు యత్నించగా.. పలువురు ఓటర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఆయన తిరిగి వచ్చి క్యూలో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నారు. కారు దిగిన ఆయన క్యూలో నిలబడకుండా నేరుగా పోలింగ్ కేంద్రంలోకి వెళ్లేందుకు యత్నించారు. అయితే, అప్పటికే క్యూలో నిలబడి ఉన్న ఓ వ్యక్తి అభ్యంతరం వ్యక్తం చేశారు. తామంతా గంట నుంచి ఇక్కడ క్యూలో ఉన్నామని, లైన్లో రావాలని కార్తీక్ అనే ఎన్ఆర్ఐ చిరుకు సూచించారు. ఓటు వేసేందుకు గంటకు పైగా ఇక్కడ నిలుచున్నామని, ఇలా వచ్చి అలా ఓటు వేసి వెళ్లిపోతే తామంతా ఏం కావాలని ప్రశ్నించారు. ఆయనకు మద్దతుగా పలువురు ఓటర్లు కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో చిరు, గన్మెన్లు ఏదో సర్దిచెప్పబోతుండగా, అప్పటికే అక్కడ మీడియా మొత్తం మోహరించింది. మీడియా దృష్టి మొత్తం తన విూదే పడిందని గుర్తించిన చిరంజీవి ఓటర్లను శాంతపరిచి క్యూలో నిలబడ్డారు. తన వంతు వచ్చిన తర్వాత ఓటు వేసి వెనుదిరిగారు.
ఓటు వేసేందుకు నేరుగా పోలింగ్ కేంద్రంలోకి వెళ్లలేదని చిరంజీవి తెలిపారు. ఓటరు జాబితాలో తన పేరు ఉందో లేదో అధికారులను అడిగి తెలుసుకోవడానికే వెళ్లానని చెప్పారు. క్యూ వెళ్లకుండా నేరుగా పోలింగ్ కేంద్రంలోకి వెళ్లేందుకు యత్నించగా ఓటర్లు అభ్యంతరం వ్యక్తం చేయడంపై చిరు వివరణ ఇచ్చారు. తాను నిబంధనలు ఉల్లంఘించలేదన్నారు. ఇంతకు ముందు తన ఓటు ఓబుల్‌రెడ్డి పబ్లిక్ స్కూల్లో ఉండేదని, ఇప్పుడు జూబ్లీహిల్స్ క్లబ్‌కు మారినందుకు సరిచూసుకోవడానికి వెళ్లానన్నారు.
చిరు అంటే గౌరవమే కానీ..
చిరంజీవి అంటే తనకెంతో గౌరవం ఉందని, అయితే, ఆయన ఒక్కరే కాకుండా మొత్తం కుటుంబ సభ్యులందరినీ వెంట తీసుకెళ్లడంతోనే తాను ప్రశ్నించాల్సి వచ్చిందని కార్తీక్ తెలిపారు. తన నివాసం కూడా జూబ్లీహిల్స్లోనే ఉందని, చిరంజీవి వీఐపీ అయితే తాను కూడా వీఐపీనే అవుతానన్నారు. చిరుకు ఏమైనా ప్రత్యేక సదుపాయాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. రాజకీయ నాయకుడిగా చిరు అంటే తనకు గౌరవమేనని ఆయన ఒక్కరు వచ్చి ఉంటే తాను అభ్యంతరం చెప్పేవాడిని కాదన్నారు.
భాయ్ సాబ్ ఇది తెలంగాణ రాష్ట్రం




