Monday, 2 November 2026

నీ ఆరోపణలు నిరూపించు

రాజకీయాల నుంచి తప్పుకుంటా
మోడీకి అహ్మద్‌పటేల్‌ సవాల్‌
న్యూఢిల్లీ, మే 3 (జనంసాక్షి) :
బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని తాను కలిసినట్లు ఆయన చేసిన ఆరోపణలను నిరూపిస్తే కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేస్తానని, రాజకీయాల నుంచే తప్పుకుంటానని ఆ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ రాజకీయ సలహదారు అహ్మద్‌ పటేల్‌ సవాల్‌ విసిరారు. తాను మోడీ ఇంటికి/కార్యాలయానికి వెళ్లినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. ఈ విధంగా సవాల్‌ విసరడం ఈ వారంలో ఇది రెండోసారి. మోడీ ఇటీవల దూరదర్శన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. పటేల్‌ తన ఇంటికి, బీజేపీ కార్యాలయానికి వచ్చారని వ్యాఖ్యానించారు. పటేల్‌తో తనకు గతంలో సాన్నిహిత్యం ఉండేదని, బాబూభాయ్‌ అని పిలిచేవాడినని, చాలాసార్లు కలిసి భోజనం చేశామని తెలిపారు. అయితే, మోడీ వ్యాఖ్యలను పటేల్‌ కొట్టిపడేశారు. ఇదంతా పొలిటికల్‌ స్టంట్‌ అని, ఎన్నికలు ముగుస్తున్న తరుణంలో ఓటర్లను గందరగోళ పరిచేందుకే అలా మాట్లాడుతున్నారని విమర్శించారు. ‘నేను ఆయన (మోడీ) ఇంటిని కానీ, కార్యాలయాన్ని కానీ సందర్శించినట్లు నిరూపిస్తే, ఆయన నుంచి నేను ఎలాంటి సాయం పొందినట్లైనా రుజువు చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా’ అని పటేల్‌ వ్యాఖ్యానించారు. 1980లలో ఒక్కసారి మాత్రం మోడీ ఇంటికి వెళ్లానని, ఆయనతో కలిసి భోజనం చేశానని చెప్పారు. మోడీ ఇటీవల దూరదర్శన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ వివాదాస్పదమైంది. కొన్ని భాగాలను మార్చి ప్రసారం చేసినట్లు బీజేపీ ఆరోపించింది. ఈ మేరకు 54 నిమిషాల నిడివి గల పూర్తి ఇంటర్వ్యూ భాగాన్ని విడుదల చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *