Monday, 2 November 2026

సీమాంధ్రలో సర్వం సిద్ధం


హైదరాబాద్‌, మే 3 (జనంసాక్షి) :

సీమాంధ్రలో సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్‌ తెలిపారు. శనివారం సచివాయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈనెల 7న సీమాంధ్రలో 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇంటింటికీ పోలింగ్‌ స్లిప్పులు పంపిణీ చేశామని, స్లిప్పులు అందని వారు పోలింగ్‌ కేంద్రాల వద్ద తీసుకోవచ్చని భన్వర్‌లాల్‌ తెలిపారు. సీమాంధ్రలో పోలింగ్‌ శాతం పెరుగుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఓటరు జాబితాలో పేరుంటే చాలు ఓటు వేసేందుకు అవకాశం ఉంటుందని భన్వర్‌లాల్‌ వెల్లడించారు. ఎన్నికల సందర్భంగా పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో దేశ్యాప్తంగా రూ.270 కోట్లు పట్టుకుంటే కేవలం రాష్ట్రంలోనే రూ.141 కోట్లు సీజ్‌ చేసినట్లు చెప్పారు. 5 లక్షల లీటర్ల మద్యాన్ని సీజ్‌ చేశామని, గోవా, కర్నాటక నుంచి మద్యం రవాణా అవుతోందన్నారు. మద్యం రవాణాపై విచారణకు ఆదేశించినట్లు భన్వర్‌లాల్‌ తెలిపారు. ఇక తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకు తుది పోలింగ్‌ శాతాన్ని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్‌ వెల్లడించారు. ఆయన ఇవాళ విూడియాతో మాట్లాడారు. 17 ఎంపీ స్థానాలకు 70.85 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఆయన చెప్పారు. హైదరాబాద్‌ లో తప్ప తెలంగాణ జిల్లాల్లో పోలింగ్‌ శాతం పెరిగినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ నెల 16న కౌంటింగ్‌కు పూర్తి ఏర్పాట్లు చేశామని చెప్పారు.తెలంగాణ ప్రాంతంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక పోలింగ్‌ శాతం భువనగిరి పార్లమెంట్‌ నియోజకవర్గంలో, అత్యల్ప పోలింగ్‌ మల్కాజిగిరి పార్లమెంట్‌ నియోజకవర్గంలో నమోదైనట్లు తెలిపారు. మొత్తం 17 నియోజకవర్గాల పరిధిలో కలిపి సగటున 70.85 శాతం పోలింగ్‌ నమోదైందని, అత్యల్పంగా మల్కాజిగిరిలో 51.19 శాతం, అత్యధికంగా భువనగిరి 81 శాతం పోలింగ్‌ నమోదైందని ఆయన వివరించారు. 80 శాతం పోలింగ్‌తో ఖమ్మం రెండో స్థానంలో నిలిచిందన్నారు. గత ఎన్నికలతో పోలిస్తే పార్లమెంట్‌ స్థానాల్లో 3 శాతం పోలింగ్‌ పెరిగిందని భన్వర్‌లాల్‌ చెప్పారు. ఇప్పటివరకు మన రాష్ట్రంలో ఎన్నికల సోదాల్లో రూ. 140 కోట్లు పట్టుబడ్డాయని, 5 లక్షల లీటర్ల మద్యం, 74 కేజీల బంగారం, 933 కేజీల వెండి స్వాధీనం చేసుకున్నామని ఆయన చెప్పారు. ఇది చాలా ఆందోళనకరమని, భారత ఎన్నికల కమిషన్‌ కూడా దీనిపై ఆందోళన వ్యక్తం చేసిందని అన్నారు. ఇక రెండోదశ పోలింగ్‌ అరకు, పాడేరు స్థానాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్‌ ఉంటుందని, అలాగే కురుపాం, పార్వతీపురం, సాలూరు, రంపచోడవరం, పెద్దకూరపాడు, వినుకొండ, గురజాల, మాచర్లలలో 7 నుంచి  సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ ఉంటుందని ఆయన చెప్పారు. మిగతా 165 స్థానాల్లో సాధారణంగానే 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ కొనసాగుతుందన్నారు. తెలంగాణలో పోలింగ్‌ తగ్గినా, అది కేవలం నగర ప్రాంతంలోనేనని, అందువల్ల సీమాంధ్రలో మరింత ఎక్కువ పోలింగ్‌ నమోదవుతుందని భావిస్తున్నామని భన్వర్‌లాల్‌ చెప్పారు. పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా పోలింగ్‌ శాతం చూస్తే ఆదిలాబాద్‌ – 73.49 శాతం, పెద్దపల్లి – 71.56 శాతం, కరీంనగర్‌ – 73.55 శాతం, నిజామాబాద్‌ – 71.51 శాతం, జహీరాబాద్‌ – 76 శాతం, మెదక్‌ – 77.92 శాతం, మల్కాజ్‌గిరి – 51.19 శాతం, సికింద్రాబాద్‌ – 53.28 శాతం, హైదరాబాద్‌ 52.52 శాతం, చేవెళ్ల – 60.08 శాతం, మహబూబ్‌నగర్‌ – 71.30 శాతం, నాగర్‌కర్నూల్‌ – 75 శాతం, నల్లగొండ – 79.01 శాతం, భువనగిరి – 80.99 శాతం, వరంగల్‌ – 76.46 శాతం, మహబూబాబాద్‌ – 80.58 శాతం, ఖమ్మం – 80 శాతం నమోదయ్యిందన్నారు. ఓటర్లను ఎలాంటి ప్రలోభాలకు గురిచేసినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *