థర్డ్ ఫ్రంట్‌కు నో చాన్స్ : రాహుల్
ఊహాగానాలకు తెరదించిన యువనేత
న్యూఢిల్లీ, మే 3 (జనంసాక్షి) :
ఢిల్లీ ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సంఖ్యా బలం సాధించి తీరుతామని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ తేల్చిచెప్పారు. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ యూపీఏ సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు తాము తృతీయ కూటమికి మద్దతు ఇస్తామన్న వార్తలు కల్పితాలేనని ఆయన కొట్టిపడేశారు. తాము థర్డ్ ఫ్రంట్‌కు మద్దతిచ్చే ప్రసక్తే లేదని, యూపీఏనే మూడోసారి అధికారాన్ని దక్కించుకుంటుందని ఆయన తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని అమేథి నియోజకవర్గంలో శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించిన రాహుల్ థర్డ్ ఫ్రంట్‌కు కాంగ్రెస్ మద్దతుపై సాగుతున్న ఊహాగానాలకు తెరదించుతూ ట్వీట్ చేశారు. తృతీయ ఫ్రంట్‌కు మద్దతుపై కాంగ్రెస్, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ వ్యాఖ్యలను ఆయన కొట్టిపారేశారు. రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ ఇటీవల కేరళలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో థర్డ్ ఫ్రంట్‌కు మద్దతిస్తామని పేర్కొన్నారు. ఆ తర్వాత కేంద్ర మంత్రులు, పార్టీ సీనియర్ నేతలు సల్మాన్ ఖుర్షీద్, జైరామ్ రమేశ్ కూడా ఈ వాదనను తెరపైకి తీసుకువచ్చారు. పార్టీలో కొందరు ముఖ్యులు థర్డ్ ఫ్రంట్‌కు మద్దతు అంశాన్ని తెరపైకి తీసుకురాగా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ దీనిని తిరస్కరించారు. అలాంటి పరిస్థితి వస్తే కాంగ్రెస్ అధినేత్రి, వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంటారని ఆయన బదులిచ్చారు. తృతీయ కూటమికి మద్దతుపై కాంగ్రెస్‌లో ఎలాంటి బేధాభిప్రాయాలు లేవని అహ్మద్ పటేల్ వివరించారు. అహ్మద్ పటేల్ వాదనను బలపరుస్తూ రాహుల్‌గాంధీ ట్విట్టర్‌లో ఊహాగానాలకు తెరదించారు. యూపీఏ మూడో సారి ప్రజల విశ్వాసంతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇటీవల ఆయన మీడియాతో మాట్లాడినప్పుడు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. మోడీ హవా పేరుతో ఒకవర్గం మీడియా సాగిస్తున్నది బూటకపు ప్రచారమని ఆయన కొట్టిపడేశారు.





