
1.22 లక్షల మందితో బందోబస్తు
ప్రలోభాలపై మూడో కన్ను
: డీజీపీ ప్రసాదరావు
హైదరాబాద్, మే 6 (జనంసాక్షి) :
సీమాంధ్రలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు డీజీపీ బయ్యారపు ప్ర సాదరావు తెలిపారు. ఎన్నికల క్రతువును ప్రశాం తంగా ముగించేందుకు భారీగా బలగాలను మోహరించామన్నారు. నక్సల్ ప్రభావిత ప్రాంతల్లో అన్ని రకాల భద్రత ఏర్పాటు చేశామని ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన కోరారు. మంగళవారం డీజీపీ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ఏర్పాట్లను వివరించారు. సున్నిత, సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించామని చెప్పారు. రాష్ట్ర బలగాలతో పాటు కేంద్ర బలగాలను కూడా ఎన్నికల ప్రక్రియలో మోహరించామన్నారు. ఎన్నికల బందోబస్తుకు 1.22 లక్షల మంది పోలీసు సిబ్బందిని వినియోగిస్తున్నామని చెప్పారు. 72 వేల మంది సివిల్ పోలీసులతో పాటు 284 కంపెనీల కేంద్ర బలగాలు, 49 కంపెనీల ఏపీఎస్పీ బలగాలను మోహరించామన్నారు. ఎన్నికల కోసం నాలుగు హెలికాప్టర్లను సిద్ధం చేశారని, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలతో పాటు అవసరమైన చోట హెలికాప్టర్లను ఉపయోగిస్తామన్నారు. ఇప్పటివరకు రూ.131 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. 90 కిలోల బంగారం, 825 కిలోల వెండితో పాటు 33.16 లక్షల మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఎన్నికల నేపథ్యంలో డబ్బు, మద్యం, నజరానాలపై ప్రత్యేక దృష్టి సారించామని, ప్రలోభాలు గురి చేసే వారిపై గట్టి నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు. అభ్యర్థులతో పాటు పార్టీ నేతలపై దృష్టి సారించామని, షాడో టీంలు పంపకాలపై నిఘా పెట్టాయని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేశామన్నారు. ఇప్పటివరకు మొత్తం 5,938 కేసులు నమోదయ్యాయని, 29,675 ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులు నమోదు చేశామని తెలిపారు. తూర్పు గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి భద్రత ఉంటుందని డీజీపీ తెలిపారు. సమస్యాత్మక, సున్నితమైన కేంద్రాల వద్ద ప్రత్యేక బలగాలతో భద్రత ఏర్పాటు చేశామన్నారు. సీమాంధ్రలో ఎన్నికలు అడ్డుకోవడానికి కొన్ని మావోయిస్టు బృందాలు రంగంలోకి దిగాయని డీజీపీ చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో రోడ్లను ధ్వంసం చేసి ఎన్నికలను అడ్డుకోవాలని చూస్తున్నారని తెలిపారు. విశాఖ రూరల్ ప్రాంతాల్లో మావోయిస్టు బృందాలను గుర్తించామని, ఇప్పటికే కొంత మందిని అదుపులోకి తీసుకున్నామన్నారు. మావోయిస్టులను ఆగడాలను అడ్డుకొనేందుకు కౌంటర్ టీమ్లను ఏర్పాటు చేశామని చెప్పారు.
మావోయిస్టుల కదలికలపై నిఘా




