Tuesday, 3 November 2026

ఉన్నతాధికారుల విచారణకు అనుమతి అక్కర్లేదు : సుప్రీం


న్యూఢిల్లీ, మే 6 (జనంసాక్షి) :
ఉన్నత స్థాయి అధికారులకు రక్షణ అవసరం లేదని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. పై స్థాయి అధికారుల విచారణకు ప్రభుత్వ అనుమతి అవసరం లేదని స్పష్టం చేసింది. సంయుక్త కార్యదర్శుల కన్నా పై స్థాయి అధికారుల విచారణకు అనుమతి అవసరం లేదని, అధికారుల విచారణకు ప్రభుత్వ అనుమతి కావాలన్న నిబంధన రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు పేర్కొంది. అవినీతి కేసుల్లో అందరూ అధికారులను సమానంగా చూడాలని న్యాయస్థానం సూచించింది. ఢిల్లీ స్పెషల్‌ పోలీస్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ యాక్ట్‌ సెక్షన్‌ 6 ఏ ప్రకారం ఉన్నతాధికారుల అవినీతిపై సీబీఐ విచారణకు ప్రభుత్వ అనుమతి అవసరం లేదని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం స్పష్టం చేసింది. తప్పు చేసిన వారు ఎవరైనా సరే ఒకే తరహాలో చూడాలని న్యాయస్థానం తెలిపింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారుల విచారణకు కేంద్ర ప్రభుత్వ అనుమతి అవసరం లేదని జస్టిస్‌ ఆర్‌ఎం లోధా, ఏకే పట్నాయక్‌, ఎస్‌కే ముఖోపాధ్యాయ, దీపక్‌ మిశ్రా, ఇబ్రహీం ఖలీఫుల్లాలతో కూడిన ధర్మాసనం తేల్చి చెప్పింది. సీనియర్లు, జూనియర్లు అన్న భేదం చూపడం సరికాదని, ఇది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. సంయుక్త కార్యదర్శి, ఆ పై ఉన్నతాధికారుల సీబీఐ విచారణకు ప్రభుత్వ అనుమతి కావాలనడం రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14కు విరుద్ధమని పేర్కొంది. ‘ఈ నిబంధన (ప్రభుత్వ అనుమతి) సరికాదు. అవినీతి అధికారులకు ఇది రక్షణ కల్పిస్తుంది’ అని చీఫ్‌ జస్టిస్‌ లోధా పేర్కొన్నారు. కేంద్రంలో పని చేసే సంయుక్త కార్యదర్శి, ఆ పై అధికారులకు విచారణ నుంచి రక్షణ కల్పించడం, రాష్ట్రంలో పని చేసే ఆ స్థాయి అధికారులకు రక్షణ లేకపోవడాన్ని ఈ సందర్భంగా ధర్మాసనం ఎత్తిచూపింది. ఇలాంటి తారతమ్యాలు అంగీకరించబోమని తెలిపింది. తప్పు చేసిన వారెవరైనా సమానంగా చూడాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. అవినీతి జాతి శత్రువని, అవినీతి తగ్గించాల్సిన బాధ్యత సీబీఐపై ఉందని తెలిపింది. తీవ్ర అభియోగాలు ఎదుర్కొంటున్న అధికారులపై సీబీఐ ప్రాథమిక దర్యాప్తు నిర్వహించవచ్చని పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *