ఆవిర్భావ దినంపై పున: సమీక్షించండి


కేంద్రానికి హైకోర్టు సూచన
హైదరాబాద్‌, మే 6 (జనంసాక్షి) :తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినంపై పున: సమీక్షించాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర హైకోర్టు సూచించింది. శాసన సభ ఎన్నికల ఫలితాలు మే 16న వెలువడనున్న నేపథ్యంలో మే 16ను అపా యింటేడ్‌ డేగా పరిగణించాలన్న టీఆర్‌ఎస్‌ విజ్ఞప్తికి న్యాయస్థానం సానుకూ లంగా స్పందించింది. 17 తర్వాత ప్రభుత్వం ఏర్పాటవుతున్న తరుణంలో జూన్‌ 2 వరకు రాజ్యాంగ సంక్షోభం ఏర్పడుతుందన్న పిటిషనర్‌ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం.. ఈ విషయాన్ని త్వరగా తేల్చాలని కేంద్రానికి సూ చించింది. అపాయింటేడ్‌ డే జూన్‌2న కాకుండా మే 16వ తేదీగా ప్రకటిం చాలని కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ టీఆర్‌ఎస్‌ నేత జగదీశ్వర్‌రెడ్డి మంగ ళవారం హైకోర్టులో లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను జస్టిస్‌ ఆర్‌.సుభాష్‌రెడ్డి, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తి నేతృత్వంలోని ధర్మా సనం విచారించింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది రామచంద్రరావు వాద నలు వినిపించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ తేదీ జూన్‌ 2న కాకుండా మే 16వ తేదీగా ప్రకటించాలని కోరారు. మే 16న శాసనసభ ఎన్నికల ఫలితాలు వెల్లడవుతాయని, మే 17 నుంచి తెలంగాణలో
ప్రభుత్వం ఏర్పడుతుందని వివరించారు. ఫలితాలు వెలువడిన తర్వాత మే 17 నుంచి జూన్‌ 2 మధ్య కాలంలో రాజ్యాంగ సంక్షోభం ఏర్పడుతుందని తెలిపారు. ఏకకాలంలో ప్రభుత్వం, రాష్ట్రపతి పాలన కొనసాగజాలవని, అది రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్‌ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జూన్‌ 2న అపాయింటేడ్‌ డే ఎట్టి పరిస్థితుల్లో చెల్లుబాటు కాదని తెలిపారు. మే 16న ఎన్నికల ఫలితాలు వెల్లడవుతాయి. దాంతోనే రెండు రాష్ట్రాలు ఏర్పాటు జరిగినట్లు భావించాలని తెలిపారు. జూన్‌ 2 అపాయింటెడ్‌ డేగా ఉంటే రాజ్యాంగ సంక్షోభం తప్పదన్నారు. ఈ నేపథ్యంలో అపాయింటేడ్‌ డేను ముందుకు జరపాలని కేంద్రాన్ని ఆదేశించాలని కోరారు. పిటిషనర్‌ వాదనలతో ధర్మాసనం ఏకీభవించింది. రాజ్యాంగ సంక్షోభం వస్తుందన్న పిటిషనర్‌ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం ఈవిషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని పిటిషనర్‌కు సూచించింది. పిటిషనర్‌ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. ఎటువంటి ఆలస్యం చేయకుండా త్వరగా నిర్ణయం తీసుకోవాలని కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. అసెంబ్లీ రద్దు అంశాన్ని కూడా కేంద్రం పరిగణనలోకి తీసుకోవాలని సూచిస్తూ విచారణను ముగించింది.