Tuesday, 3 November 2026

ఔను! మాది అదే మాట


ఆప్షన్లు ఉండరాదు
కేసీఆర్‌తో గొంతు కలిపిన టీ కాంగ్రెస్‌ ఎంపీలు
హైదరాబాద్‌, మే 9 (జనంసాక్షి) :
స్థానికత ఆధారంగానే ఉద్యోగుల పంపకాలు జరగాలని తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ ఎంపీలు డిమాండ్‌ చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు ప్రభుత్వ కార్యాలయాలు వేర్వేరుగా ఏ ర్పాటు చేయాలని కోరారు. అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరారు. ఎంపీ వివేక్‌ నివాసంలో తెలంగాణ ప్రాంత ఎంపీలు పొన్నం ప్రభాకర్‌, గుత్తా సుఖేందర్‌రెడ్డి, రాజయ్య తదితరులు శుక్రవారం సమావేశమయ్యారు. రాష్ట్ర విభజన, ఉద్యోగుల పంపకాలు, తాజా పరిణామాలు, పోలింగ్‌ సరళితో పాటు భవిష్యత్‌ తెలంగాణ అభివృద్ధికి తీసుకోవాల్సిన అంశాలపై చర్చించారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న తరహాలోనే తెలంగాణ రాష్ట్ర సత్వర అభివృద్ధికి కూడా కృషి చేయాలని ఎంపీలు నిర్ణయించారు. తెలంగాణలో జరిగిన తొలి ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయావకాశాలపై చర్చించారు. అనంతరం ఎంపీ పొన్నం ప్రభాకర్‌ మీడియాతో మాట్లాడారు. స్థానికత ఆధారంగానే ఉద్యోగుల పంపకాలు జరగాలని డిమాండ్‌ చేశారు. స్థానికత ప్రామాణికంగానే ఉద్యోగులను విభజించాలని, లేకుంటే తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. నిధులు, నీళ్లు, నియామకాల్లో జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమం ప్రారంభమైందని గుర్తు చేశారు. మళ్లీ సీమాంధ్ర ఉద్యోగులను ఇక్కడే కొనసాగిస్తే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. ఉద్యోగుల పంపకాల్లో పారదర్శకత పాటించాలని కోరారు. రెండు రాష్ట్రాలకు ప్రభుత్వ కార్యాలయాలు వేర్వేరుగా ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రస్తుత సచివాలయాన్ని తెలంగాణకు ఇచ్చేసి, ఆంధ్రప్రదేశ్‌కు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రాన్ని కేటాయించాలని పొన్నం సూచించారు. ఒకే చోట రెండు రాష్ట్రాలకు భవనాలు కేటాయిస్తే ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉంటుందని తెలిపారు. ఇక విద్యుత్‌ కేటాయింపుల్లో తెలంగాణ అవసరాలకు అనుగుణంగా విద్యుత్‌ను కేటాయించాలని పొన్నం డిమాండ్‌ చేశారు. తెలంగాణలో వ్యవసాయం పూర్తిగా బోరుబావులపైనే ఆధారపడి ఉందని, దాన్ని దృష్టిలో ఉంచుకొని తెలంగాణకు ఎక్కువగా విద్యుత్‌ కేటాయించాలన్నారు. అలాగే, వీలైనంత త్వరగా ఇక్కడ 4 వేల మెగావాట్ల విద్యుత్‌ కేంద్ర ఏర్పాటుకు చొరవ చూపాలని కోరారు. అకాల వర్షాల వల్ల తెలంగాణ రైతులు తీవ్రంగా నష్టపోయారని పొన్నం ఆవేదన వ్యక్తం చేశారు. వేల క్వింటాళ్ల ధాన్యం తడిసిపోయిందని, పసుపు, నువ్వు, సజ్జ పంటలతో పాటు మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ఈ నేపథ్యంలో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని గవర్నర్‌ నరసింహన్‌కు విజ్ఞప్తి చేయనున్నట్లు చెప్పారు. తెలంగాణకు న్యాయం చేయాలని, ఉద్యోగాలు, భవనాల కేటాయింపుల్లో పారదర్శకత పాటించాలని గవర్నర్‌ను, కేంద్ర ప్రభుత్వాన్ని కోరతామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *