
నిధులు, నియామకాలు, ఉద్యోగాలే మూలం
ఆప్షన్లు ఉండరాదు
కమల్‌నాథ్ కమిటీకి టీఎన్‌జీవో నివేదన
హైదరాబాద్, మే 9 (జనంసాక్షి) :
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఉద్యోగుల పంపిణీకి వారి స్థానికతే ఆధారం కావాలని టీఎన్‌జీవోస్ కేంద్ర అధ్యక్షుడు దేవిప్రసాద్ అన్నారు. శుక్రవారం టీఎన్‌జీవోస్ నాయకులు కమల్‌నాథన్ కమిటీతో భేటీ అయ్యారు. అనంతరం దేవిప్రసాద్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో నిధులు, నియామకాలు, ఉద్యోగాలే మూలమని అన్నారు. వాటి సాధన కోసమే ప్రత్యేక రాష్ట్ర పోరాటం మొదలైందని చెప్పారు. సీమాంధ్ర ఉద్యోగులకు ఆప్షన్లు ఇచ్చి వారిని ఇక్కడే కొనసాగించడం సరికాదని, ఉద్యోగులకు అసలు ఆప్షన్లు ఇవ్వాల్సిన అవసరమే లేదని కమల్‌నాథన్ కమిటీకి నివేదించామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఉనికిలోకి వచ్చే జూన్ రెండో తేదీ వరకు ఎలాంటి ప్రమోషన్లు, రిక్రూట్‌మెంట్లు చేపట్టవద్దని తాము కమిటీని కోరామన్నారు. ఉద్యోగుల బదిలీలు ఆపాలని కోరినట్లు చెప్పారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ స్ఫూర్తికి విరుద్ధంగా అక్రమ ఉద్యోగాలు పొందిన వారిని హైదరాబాద్‌లోనే కొనసాగింపజేసేందుకు సీమాంధ్ర పెత్తందారులు కుట్రలు చేస్తున్నారని తెలిపారు. వారి ఆటలు సాగనివ్వబోమని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో గ్రామ స్థాయి నుంచి సచివాలయ స్థాయి వరకు తెలంగాణ ఉద్యోగులే పనిచేయాలని అన్నారు.
స్థానికతే ఆధారం




