
సీఈసీ సంపత్
న్యూఢిల్లీ, మే 10 (జనంసాక్షి) :
వారణాసి విషయంలో అన్ని నిర్ణయాలు సమష్టిగానే తీసుకున్నామని కేంద్ర ఎన్నికల కమిషనర్ సంపత్ తెలిపారు. రిటర్నింగ్ అధికారి ప్రంజాల్ యాదవ్ చర్య సరైందేనన్నారు. ఆయన తెలిపిన వివరాల మేరకు, సూచనల ఆధారంగా అక్కడ మోడీ ర్యాలీకి అనుమతించలేదన్నారు. నిర్ణయాల విషయంలో ఈసీ నిష్పక్షపాతంగానే వ్యవహరించిందని స్పష్టం చేశారు. లోతుగా చర్చించిన తరవాతనే సమష్టిగా నిర్ణయం తీసుకున్నామని అన్నారు. జిల్లా అధికారుల నివేదికను పట్టించుకోకుండా ఉండలేమని సంపత్ అన్నారు. ఇదిలావుంటే కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి కేంద్ర ఎన్నికల సంఘం క్లీన్‌చిట్ ఇచ్చింది. అమేథీలో రాహుల్ కోడ్ ఉల్లంఘనకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపై ఎలాంటి ఆధారాలు లేవని సీఈసీ సంపత్ కొట్టిపారేశారు. ఇదిలావుంటే వారణాసితో సహా దేశంలో తుదిదశ పోలింగ్‌కు 10న సాయంత్రం ప్రచారం ముగిసింది. ప్రచార నిమిత్తం వారణాసిలో ఉంటున్న సీనియర్ రాజకీయనాయకులు, వారి కుటుంబసభ్యులు సహా ఇక్కడ ఓటరు కాని వారందరూ శనివారం సాయంత్రం 6 గంటల లోపు వెళ్లిపోవాలని జిల్లా ఎన్నికల అధికారులు తెలిపారు. భాజపా ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీకి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజీవ్రాల్‌కు మద్దతుగా వారణాసిలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నేతలు ఉన్నందున బయటి వారందరినీ ఈసీ పంపిచే ఏర్పాట్లు చేస్తోంది. వారణాసిలోని ¬టళ్లు, అతిథిగృహాల్లో తనిఖీలు నిర్వహించి ఓటరు కాని వారిని గుర్తించి ఇక్కడి నుంచి పంపిస్తామని అధికారులు వెల్లడించారు. కేజీవ్రాల్ కుటుంబసభ్యులు, భాజపా సీనియర్ నేతలు అరుణ్‌జైట్లీ, అమిత్‌షా, తదితర నేతలు సహా ఇక్కడ ఓటు హక్కు లేనివారు ఎవరైనా వెళ్లిపోవాలని ఈసీ ఆదేశించింది. సాయంత్రం 6 గంటలకు ప్రచారం ముగిసిన తర్వాత వారణాసి అంతటా తనిఖీలు చేపట్టారు.
వారణాసి నిర్ణయం సమష్టి నిర్ణయమే




