
ఆగస్టులోగా నివేదిక : రతన్‌రాయ్
హైదరాబాద్, మే 11 (జనంసాక్షి) :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త రాజధాని ఎంపిక కసరత్తును శివరామకృష్ణన్ కమిటీ వేగవంతం చేసింది. ఏపీ రాజధానికి సంబంధించి ఆగస్టు నెలాఖరులోపు కేంద్రానికి నివేదిక సమర్పిస్తామని శివరామకృష్ణన్ కమిటీ తెలిపింది. రాజమండ్రి పర్యటన ముగించుకున్న కమిటీ ఆదివారం విజయవాడ బయలుదేరింది. ఈ సందర్భంగా కమిటీ సభ్యుడు రతన్‌రాయ్ విలేకరులతో మాట్లాడుతూ, కొత్త రాజధాని ఏర్పాటుపై ఆగస్టు నెలలోపు కేంద్రానికి నివేదిక ఇస్తామని అన్నారు. విశాఖ, రాజమండ్రి రాజధానికి అనువైన ప్రదేశాలని అన్నారు. జిల్లా అధికారులతో కమిటీ సమావేశమై నివేదికలు సేకరించినట్లు చెప్పారు. తమ అజెండాలోని అన్ని ప్రాంతాలను హోంమంత్రిత్వశాఖ పేర్కొన్న ప్రమాణాల నేపథ్యంలో క్షుణ్ణంగా పరిశీలించి నివేదిక రూపొందిస్తామని అన్నారు. కమిటీని కలిసి తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. అనారోగ్యంవల్ల శివరామకృష్ణన్ రాలేకపోయారని అన్నారు. ఇది నిపుణుల కమిటీ మాత్రమేనని, సలహాలు మాత్రమే నివేదిక రూపంలో అందజేస్తామని వారు తెలిపారు. అయితే తాము సమర్పించేది టెక్నికల్ నివేదిక మాత్రమేనని, రాజధాని ఎంపిక తమ పనికాదని ఆయన స్పష్టం చేశారు. పాలనా సౌలభ్యం, అధికార వికేంద్రీకరణ, వనరుల అభ్యతను పరిశీలిస్తున్నామని చెప్పారు. రాజధానికి అనువైన ప్రదేశాలు సీమాంధ్రలో చాలా ఉన్నాయని, వాటిపై తామిచ్చే నివేదిక ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. అంతకు ముందు రాజానగరాన్ని కమిటీ సభ్యులు పర్యటించారు. వీరితో పాటు టిడిపి నేత మురళీమోహన్‌తో పాటు పలువురు రాజకీయ నాయకులు, స్వచ్చంద సంస్థలు ప్రతినిధులు కమిటీ సభ్యులను వినతిపత్రాలను అందజేశారు.
ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానికి కసరత్తు




