Tuesday, 3 November 2026

నేడు సార్వత్రిక తుది సమరం


వారణాసి వైపే అందరి చూపు
440 కంపెనీల బలగాలతో భద్రత
న్యూఢిల్లీ, మే 11 (జనంసాక్షి) :
సార్వత్రిక ఎన్నికల సమరం తుది అంఖానికి చేరుకుంది. సోమవారం చివరి, తొమ్మిదో విడత ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసింది. మూడు రాష్ట్రాల్లోని 41 లోక్‌సభ స్థానాల్లో సోమవారం పోలింగ్‌ జరగనుంది. ఉత్తరప్రదేశ్‌లోని 18 లోక్‌సభ స్థానాలు, పశ్చిమబెంగాల్‌లోని 17 స్థానాలు, బీహార్‌లోని ఆరు స్థానాలలో పోలింగ్‌ జరుగుతుంది. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్‌ నిర్వహిస్తారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ, ఆమ్‌ ఆద్మీ పార్టీ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌, కాంగ్రెస్‌ నేత అజయ్‌రాయ్‌ సహా 42 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్న హిందువుల ఆధ్యాత్మిక క్షేత్రం వారణాసి స్థానంపైనే అందరి దృష్టి నెలకొంది. దేశం మొత్తం కాదు ప్రపంచంలోని వివిధ దేశాలు కూడా ఇప్పుడు వారణాసివైపే చూస్తున్నాయి. హిందువులు అత్యధికంగా నివసించే వారణాసిలో వారి ఓట్లపైనే బీజేపీ ఆశలు పెట్టుకుంది. ఈ లోక్‌సభ స్థానం పరిధిలో సుమారు మూడు లక్షల మంది మైనార్టీ ఓటర్లున్నారు. వీరి మద్దతు కాంగ్రెస్‌ అభ్యర్థి రాయ్‌కు దక్కుతుందా, ఆప్‌ కన్వీనర్‌ కేజ్రీవాల్‌కా అనేది చర్చనీయాంశంగా మారింది. నరేంద్రమోడీ ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వకున్నా వారణాసిలో రోడ్‌ షో నిర్వహించి నేరుగా ఎన్నికల సంఘంతోనే తలపడ్డారు.
తాను ఎవరికి లొంగననే భావన హిందువుల్లోకి తీసుకెళ్లడానికే మోడీ నిబంధనలు అతిక్రమించినట్టు స్పష్టమవుతోంది. మరోవైపు కేజ్రీవాల్‌ కొన్ని రోజులుగా వారణాసిలోనే మకాం వేసి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికల ప్రచారం ముగియడానికి ఒక్క రోజు ముందు కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు వారణాసిలో రోడ్‌ షో నిర్వహించి కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. మొత్తం 41 లోక్‌సభ స్థానాల్లో 606 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వీరి భవితవ్యాన్ని సుమారు తొమ్మిది కోట్ల మంది ఓటర్లు నిర్దేశించనున్నారు. తొమ్మిదో దశ పోలింగ్‌తో సుమారు 35 రోజుల పాటు జరిగిన సార్వత్రిక ఎన్నికల ప్రక్రియకు తెరపడనుంది. ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌లో మావోయిస్టుల హింసాత్మక ఘటనలు మినహా మొత్తమ్మీద ఎనిమిది దశల్లో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా సాగింది. ఎనిమిది దశల్లో సగటున 66 శాతం పోలింగ్‌ నమోదైంది. ఎక్కడైనా రీపోలింగ్‌ అవసరమైతే మంగళవారం నిర్వహిస్తారు. సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు 16న నిర్వహించనున్న విషయం తెలిసిందే. తుది విడత ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం 440 కంపెనీల కేంద్ర బలగాలను వినయోగిస్తోంది. ప్రముఖులు పోటీ పడుతున్న వారణాసిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *