
ఇవే ఫలితాలు వస్తాయి
టీఆర్‌ఎస్‌కు థర్డ్ ప్లస్
టీపీసీసీ చీఫ్ పొన్నాల ధీమా
హైదరాబాద్, మే 12 (జనంసాక్షి):
రాష్ట్రంలో అధికారం మాదే.. శాసన సభ, లోక్‌సభ ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలు పునరావృతమవుతాయని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్‌ను ప్రజలు ఆదరించారని తెలిపారు. సోమవారం గాంధీభవన్‌లో పొన్నాల మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించామని, క్లీన్‌స్వీప్ చేస్తామన్న పార్టీకి మూడో స్థానం దక్కిందని పరోక్షంగా టీఆర్‌ఎస్‌ను విమర్శించారు. తెలంగాణ ఇవ్వడం లేదని మిగతా పార్టీలతో పొత్తు పెట్టుకున్న నేపథ్యం ఉన్న ఆ పార్టీ పరిస్థితి ఏమైందని ప్రశ్నించారు. పట్టణ ఓటర్లు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని, ఈ తీర్పు తెలంగాణ ప్రజల మనోభావాలకు అద్దం పడుతోందన్నారు. కార్యకర్తల పట్టుదల వల్లే తాము గెలిచామని పునరుద్ఘటించారు. తామేదో ప్రచారం చేయలేదని, క్యాంపెయినర్లు లేదని అనేక రకాలుగా కాంగ్రెస్‌పై ఎన్నో అపవాదులు వేశారని విమర్శించారు. తమ పార్టీ వ్యవస్థ గ్రామగ్రామాన పటిష్టంగా ఉందని, మా స్టార్ క్యాంపెయినర్ సాధారణ కార్యకర్తలే అని అన్నారు. కార్యకర్తల పట్టుదల, పార్టీ మీద ఉన్న విశ్వాసం వల్లే విజయం సాధించగలిగామని పేర్కొన్నారు. గతంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లోనూ, ఇప్పుడు వెలువడిన ఫలితాల్లో పూర్తి మెజార్టీతో విజయం సాధించామని గుర్తుచేశారు. ఇప్పటివరకు 23 మున్సిపాల్టీలు గెలుచుకున్నామని, 8 స్థానాల్లో ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకొని అధికారం చేపట్టే అవకాశం ఉందన్నారు. మిత్రపక్షాలు, అవగాహన ఉన్న పక్షాలతో నిజామాబాద్, రామగుండం కార్పొరేషన్లలో అధికారం మాదేనని తెలిపారు.
టీఆర్‌ఎస్‌పై మండిపాటు..
చాలా గొప్పగా చెప్పుకొన్న పార్టీ తెలంగాణలో మూడో స్థానంలో ఉందని పొన్నాల ఎద్దేవా చేశారు. కేవలం ఆ పార్టీ ఐదు మున్సిపాల్టీలకే పరిమితమైందన్నారు. ప్రజలు తమపై ఆదరాభిమానాలతో ఉన్నారని, కాంగ్రెస్‌తోనే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలవుతాయని నమ్ముతున్నారని చెప్పారు. గత పదేళ్లలో మేం చేసిన అభివృద్ధితో మహిళలు, యువకులు, గిరిజనులు, రైతులు కాంగ్రెస్‌ను ఆదరించారని చెప్పారు. నూటికి నూరు స్థానాలు దక్కించుకుంటామని మేము ఎప్పుడూ చెప్పలేదని విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు బదులిచ్చారు. అలా చెప్పిన వారి పరిస్థితి ఏమైందో ప్రస్తుత ఫలితాలు చూస్తే తెలుస్తుందన్నారు. ఫలితాలు వేరేలా ఉన్నా బాధ్యత తనదేనని ముందే చెప్పానని పొన్నాల ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఎన్ని సీట్లు వస్తాయని నేను చెప్పను కానీ, మేం సొంతంగా అధికారంలోకి వస్తున్నామని మరో ప్రశ్నకు పొన్నాల బదులిచ్చారు.
రాష్ట్రంలో అధికారం మాదే




