
62 తేదేపా, 17 వైకాపా, 13 చోట్ల హంగ్
హైదరాబాద్, మే12(జనంసాక్షి):
సీమాంధ్ర మున్సిపల్ ఎన్నికల్లో తెదేపా ఆధిక్యం సాధించింది. తమ పార్టీకి అఖండ విజయం చేకూర్చిన ప్రజలకు పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు ప్రజలు ఇచ్చిన తీర్పు చారిత్రకమని, అవినీతి పార్టీలకు ప్రజలు తగిన గుణ పాఠం చెప్పారన్నారు. తెలుగు ప్రజలు ఇచ్చిన ఈ తీ ర్పు చారిత్రకమైందిగా వర్ణిం చారు. తెలుగు ప్రజలు విజ్ఞతతో అవినీతిపరులకు గుణపాఠం చెబుతూ, అభివృద్ధి కోసం సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారన్నారు. పదేళ్లుగా కాంగ్రెస్, వైకాపా పాలనలో పట్టణ ప్రజలు పడిన బాధలు వర్ణానాతీతమని, అవినీతి, అక్రమాలు, ధరలు, దౌర్జన్యాలు ఈ పదేళ్ల కాలంలో
రాజ్యమేలాయన్నారు. వీటన్నింటినీ తరిమికొట్టి ప్రజలు ఎటువంటి ప్రలోభాలకూ లొంగకుండా తమ తీర్పును సుస్పష్టంగా టిడిపిని బలోపేతం చేసే విధంగా ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలకు, సానుభూతిపరులకు, నాయకులకు అభినందనలు తెలియజేశారు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు సీమాంధ్రలోని ప్రతి జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఆధిక్యత కనబర్చడం, కాంగ్రెస్, వైకాపాలను అనేక స్థానాల్లో ప్రతిపక్ష ¬దా కూడా దక్కకుండా చేయడం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమష్టి కృషి ఫలితామన్నారు. తెలుగుదేశం పార్టీ విధానాల పట్ల ప్రజలకున్న అపార నమ్మకానికి ఈ ఫలితాలు నిదర్శనమన్నారు. రాయలసీమలో కూడా తెలుగుదేశం పార్టీ విజయం సాధించిన తీరు ఆ పార్టీకి ఉత్తేజం ఇస్తుంది. ప్రత్యేకించి అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్, చిత్తూరు కార్పొరేషన్ లు టిడిపి కి కైవసం అవడమే కాకుండా, కడప జిల్లాలో బద్దేలు, జమ్మలమడుగు, మైదుకూరులలో టిడిపి సాధించిన విజయాలు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ కు గట్టి దెబ్బగానే భావించాలి. అలాగే అనంతపురం జిల్లా రాయదుర్గం, పుట్టపర్తి, తాడిపత్రి వంటి మున్సిపాల్టీలను టిడిపి కైవసం చేసుకుంది. రాయలసీమలో ఇంతవరకు ఎదురులేని రీతిలో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ కు ఫలితాలు వస్తుండగా, ఈ ఎదురుదెబ్బలు వారికి ఆందోళన కలిగించేవే. మరోవైపు తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందన్న సెంటిమెంటు కారణంగా తమకు అనుకూలమైన స్థానాలు రాలేదన్నారు. అయినా తెలంగాణలోని ప్రతి పురపాలక సంస్థలోనూ తమ వెన్నంటి ఉన్న ప్రజలకు, కార్యకర్తలకు అండగా ఉండి వారి పక్షాన పోరాడతామన్నారు. తెలంగాణ పునర్ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తామన్నారు. ప్రజలు తమపై చూపిన విశ్వాసానికి కట్టుబడి రాష్ట్ర అభివృద్థికి తోడ్పడతామన్నారు.
సీమాంధ్ర మున్సిపల్స్‌లో తెదేపా ఆధిక్యం




