
బొగ్గు గనిలో పేలుడు.. 200 మంది మృతి
ఇస్తాంబుల్, మే 14 (జనంసాక్షి) :
టర్కీలో ఘోరం జరిగింది. అక్కడి ఒక బొగ్గుగనిలో సంభవించిన పేలుడులో 200 మంది కార్మికులు మృతి చెందగా, 80 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మరో 200 మంది బొగ్గుగనిలో చిక్కుపోయారు. బుధవారం బొగ్గుగనిలో షిఫ్టులు మారుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఇస్తాంబుల్ పట్టణానికి 250 కిలోమీటర్ల దూరంలో గల సోమా ప్రాంతంలోని బొగ్గుగనుల్లో ఈ ప్రమాదం సంభవించింది. కార్బన్ మోనాక్సైడ్ విషపూరితం కావడంతో పేలుడు సంభవించిందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. దీనికి తోడు విద్యుత్ సరఫరా యూనిట్‌లోనూ మంటలు చెలరేగడంతో ప్రమాదం మరింత తీవ్రమైందని అధికారులు తెలిపారు. పేలుడు సంభవించిన సమయంలో 787 మంది కార్మికులు గనిలో విధులు నిర్వరిస్తున్నారని అన్నారు. గనిలో చిక్కుకున్న వారికోసం సహాయక చర్యలు చేపట్టినట్టు టర్కీ మంత్రి సామేర్ యూజిట్ తెలిపారు. 363 మంది ప్రమాదం నుంచి బయటపడ్డారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. టర్కీ చరిత్రలో ఇది అత్యంత దారుణమైన సంఘటన అని బొగ్గుగని ప్రమాదమని అధికారులు తెలిపారు.




