
న్యూఢిల్లీ/హైదరాబాద్, మే 15 (జనంసాక్షి) :
గెలిచేది నేడే
దేశవ్యాప్తంగా కౌంటింగ్
మధ్యాహ్నానికే తుది ఫలితాలు
రాష్ట్రంలో ఏర్పాట్లు పకడ్బందీ : భన్వర్‌లాల్
తెలంగాణ ప్రజలు ఓట్లలో ఎవరికి అండగా నిలిచారు. తెలంగాణ తెచ్చినోళ్లకు పట్టం కట్టబోతున్నారా? తెలంగాణ ఇచ్చినోళ్లను గెలిపించబోతున్నారా? అనేది శుక్రవారం మధ్యాహ్నానికి తేలిపోనుంది. సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ (తెలంగాణ, సీమాంధ్ర), ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్ శాసనసభలకు ఎన్నికలు జరిగాయి. తొమ్మిది విడతల్లో జరిగిన ఎన్నికల్లో ఓటరు తీర్పు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లలో నిక్షిప్తమై ఉంది. ఈ గుట్టు శుక్రవారం వీడనుంది. మధ్యాహ్నానికల్లా ఫలితాలు కూడా వెలువడనున్నాయి. గతంలో ఎన్నడూ లేనంత ఉత్కంఠగా సాగిన ఈ ఎన్నికలు సరికొత్త చరిత్ర సృష్టించబోతున్నాయి. దేశవ్యాప్తంగా 543 లోక్‌సభ స్థానాలతోపాటు ఆంధప్రదేశ్, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్ అసెంబ్లీలకు జరిగిన ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు శుక్రవారం జరగనుంది. దశలవారీగా జరిగిన ఎన్నికలకు సంబంధించి ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్‌లలో గట్టి భద్రత మధ్య నిక్షిప్తం చేశారు. వీటిని శుక్రవారం ఉదయం తెరచి 7 గంటల నుంచి లెక్కించనున్నారు. ఈ ఎన్నికల్లో మోడీ నాయకత్వంలో ఎన్‌డీఏ గెలుస్తుందని సర్వేలు చెబుతుండగా వాటిని కాంగ్రెస్ కొట్టి పారేసింది. దీంతో మోడీ, కాంగ్రెస్, థర్డ్ ఫ్రంట్ ఎవరు అధికారంలోకి వస్తారో తేలనుంది. రాష్ట్రంలో టిడిపి,టిఆర్‌ఎస్, వైకాపా, కాంగ్రెస్ భవితవ్యం తేలనుంది. ఇదిలావుంటే రాష్ట్రానికి సంబంధించి సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లపై ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ హైదరాబాద్‌లో గురువారం ఉదయం సవిూక్ష సమావేశం నిర్వహించారు. మధ్యాహ్నం జిల్లా కలెక్టర్‌లు, ఎస్పీలతో భన్వర్‌లాల్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు. ఇవిఎంలలో నిక్షిప్తమై ఉన్న ఆయా పార్టీలకు చెందిన అభ్యర్థుల భవితవ్యం శుక్రవారం మధ్యాహ్నానికి తేలిపోనుంది. రాష్ట్రం అధికారికంగా రెండుగా విడిపోగా లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు రెండు దశల్లో తెలంగాణ జిల్లాలో ఏప్రిల్ 30న, సీమాంధ్ర జిల్లాల్లో మే 7న వేర్వేరుగా పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. జూన్ 2వ తేదీన తెలంగాణ, ఆంధప్రదేశ్‌గా రెండు రాష్ట్రాలు విడిపోతాయని తెలిసిన తరువాత విడిపోకముందే పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయనే దానిపై రాజకీయ పార్టీలతో పాటు.. ఆయా పార్టీల అధినేతలు, అభ్యర్థులు, ప్రజలంతా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఆ ఉత్కంఠకు శుక్రవారం ఉదయం 10 గంటల తరువాత తెరపడనుంది. ఉదయం 10 గంటల కల్లా ఏ పార్టీ అభ్యర్థులు మెజారిటీలో ఉన్నారనే విషయం వెల్లడికానుంది. ఇటు తెలంగాణ, అటు సీమాంధ్ర అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు మొత్తం 4,508 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకు 265 మంది, 119 అసెంబ్లీ స్థానాలకు 1,669 మంది అభర్థులు పోటీపడ్డారు. సీమాంధ్రలోని 25 లోక్‌సభ స్థానాలకు 333 మంది, 175 అసెంబ్లీ స్థానాలకు 2,241 మంది పోటీపడ్డారు. తెలంగాణలో 72 శాతం మంది ఓటర్లు, సీమాంధ్రలో 76.80 శాతం మంది ఓటర్లు పోలింగ్‌లో పాల్గొని రాజకీయ నేతల భవిష్యత్‌పై తీ ర్పు ఇచ్చారు. ఈ తీర్పు ఎలా ఉంటుందనేది ఇటు పార్టీలు, వాటి అభ్యర్థులతో పాటు.. అటు ప్రజల్లోనూ తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. గత మూడు రోజులుగా ఈ ఉత్కంఠ తారస్థాయికి చేరింది. ఇందుకు ప్రధాన కారణం.. సార్వత్రిక ఎన్నికల కన్నా ముందు జరిగిన మునిసిపల్, పంచాయతీరాజ్ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు వెలువడటమే. స్థానిక సంస్థల ఎన్నికల్లో సీమాంధ్రలో టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నువ్వా నేనా అనే తరహాలో నిలిచారు. తెలంగాణలో కూడా టీఆర్‌ఎస్, కాంగ్రెస్ నువ్వా నేనా తరహాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో నిలిచారు. దీంతో ఇప్పుడు అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయనేది రాష్ట్రమంతటా రెండు ప్రాంతాల్లోనూ ప్రధాన చర్చనీయాశంగా మారింది. ఈ ఉత్కంఠకు శుక్రవారం తెరపడనుంది. శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి ఓట్ల లెక్కింపుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. లోక్‌సభ స్థానాలతో పాటు ఆ పరిధిలోకి వచ్చే అసెంబ్లీ స్థానాలకు ఒకే ప్రాంతంలో ఓట్ల లెక్కింపుకు ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలోని 78 ప్రాంతాల్లో 168 కేంద్రాల్లో 437 హాళ్లలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఇందుకోసం 6,955 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్ వద్ద ఒక్కో సూక్ష్మ పరిశీలకుడిని నియమించనున్నారు. అలాగే అభ్యర్థుల ఏజెంట్లను కూడా అనుమతిస్తారు. పోలీసు భద్రత కలిగిన అభ్యర్థులను భద్రతా వలయంతో లెక్కింపు కేంద్రాల్లోకి వెళ్లనీయరు. ఫలితాల కోసం ప్రతి ఒక్కరూ కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. దేశ వ్యాప్తంగా ప్రతి ఒక్కరి దృష్టి బీజేపీపై ఉంటే.. తెలుగు ప్రజలు మాత్రం తెలంగాణపై దృష్టి కేంద్రీకరించారు. తెలంగాణలో ఎవరు సీఎం పీఠాన్ని కైవసం చేసుకుంటారనే అంశంపై ప్రాధాన్యత సంతరించుకుంది. ఏ పార్టీ నాయకులు చూసినా.. తామే అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎవరు అధికారంలోకి వస్తారో మరి కొన్ని గంటల్లో తేలనుంది. సర్వత్రా ఉత్కంఠకు మధ్యాహ్నం 12 గంటల కల్లా తెరపడనుంది. దేశ వ్యాప్తంగా 543 లోక్‌సభ స్థానాలకు ఫలితాలు వెల్లడి కానున్నాయి. తెలంగాణలో 17 ఎంపీ, 119 ఎమ్మెల్యే అభ్యర్థుల భవితవ్యం రేపు తేలనుంది. సీమాంధ్రలో 25 ఎంపీ, 175 అసెంబ్లీ స్థానాలకు ఫలితాలు తేలనున్నాయి. ఫలితాలపై బెట్టింగ్ పర్వం కొనసాగుతూనే ఉంది.
కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి: భన్వర్ లాల్
సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌కు అన్ని ఏర్పాటు పూర్తి చేశామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ తెలిపారు. శుక్రవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 78 ప్రాంతాల్లో 168 కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. 437 కౌంటింగ్ హాళ్లలో 6,955 కౌంటింగ్ టేబుల్స్ ఏర్పాటు చేశామన్నారు. 189 మంది పరిశీలకులను నియమించామని చెప్పారు. మల్కాజిగిరి పార్లమెంట్ స్థానానికి అత్యధికంగా 45 రౌండ్ల కౌంటింగ్ ఉంటుందన్నారు. అనకాపల్లి పార్లమెంట్ స్థానానికి 18 రౌండ్ల కౌంటింగ్ మాత్రమే ఉంటుందన్నారు. కూకట్‌పల్లి అసెంబ్లీకి 45, చార్మినార్ అసెంబ్లీకి 13 రౌండ్లు పాటు కౌంటింగ్ జరుగుతుందన్నారు. కౌంటింగ్ కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లు అనుమతించబోమని భన్వర్‌లాల్ స్పష్టం చేశారు.




