
గంగమ్మకు హారతి శ్రీభావి ప్రధానికి ఘనస్వాగతం
న్యూఢిల్లీ, మే 17 (జనంసాక్షి) :
కార్యకర్తల కృషి వల్లే కమలం వికసించిందని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ అన్నారు. పార్టీ శ్రేణులందరికీ మోడీ కృతజ్ఞతలు తెలిపారు. శనివారం ఢిల్లీలో నిర్వహించిన పార్లమెంటరీ బోర్డు సమావేశంలో పాల్గొనేందుకు హస్తినకు వచ్చిన ఆయనకు పార్టీ కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి నిర్వహించిన విజయోత్సవ ర్యాలీ అనంతరం పార్టీ కార్యాలయం వద్ద మోడీ కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు. ఈ విజయం మోడీ ఒక్కడిది కాదని లక్షలాది మంది కార్యకర్తలదని తెలిపారు. ఈ విజయం ఒక్క మోడీకే కట్టబెట్టడం సరికాదని లక్షలాది కార్యకర్తల సమష్టి కృషి కారణంగానే ఈ ఫలితం సాధ్యమైందన్నారు. 1952 నుంచి కష్టపడుతున్న నాలుగైదు తరాల వారందరికీ ఈ విజయం అంకితమని చెప్పారు. ‘ఈ విజయం 125 కోట్ల మంది భారతీయులందరిదీ. అలాగే, 1952 నుంచి పార్టీ కోసం త్యాగాలు చేసిన వారిది కూడా. గత 25 ఏళ్ల కాలంలో కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రంలో వేల మంది పార్టీ కార్యకర్తలు హత్యకు గురయ్యారని’ పేర్కొన్నారు. విజయం చేకూర్చిన అందరికీ మోడీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయం లక్షలాది మంది కార్యకర్తల విజమయమని పేర్కొన్నారు. కార్యకర్తల కృషి వల్లే కమలం వికసించిందని మోడీ వ్యాఖ్యానించారు. ఢిల్లీ మనది కాదని అందరూ అనేవారని, అయితే ఇప్పుడు ఢిల్లీ మనదే అని రుజువయ్యిందన్నారు. భాజపా జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్, మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ, ప్రకాశ్‌జవదేకర్
ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత తొలిసారి ఢిల్లీకి వచ్చిన నరేంద్ర మోడీకి పార్టీ కార్యకర్తలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. ప్రధాని పీఠం అధిష్టించనున్న నరేంద్ర మోడీ శనివారం ఉదయం అహ్మదాబాద్ నుంచి ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. ఢిల్లీ చేరుకున్న ఆయనకు పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్, నితిన్ గడ్కరీ తదితరులు మోడీని అభినందించారు. ఢిల్లీ విమానాశ్రయం నుంచి పార్టీ కేంద్ర కార్యాలయం వరకు భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించాయి. బీజేపీ శ్రేణులతో పాటు ఢిల్లీ ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు. హర్ హర్ మోడీ.. ఘర్ ఘర్ మోడీ అంటూ నినాదాలతో ¬రెత్తించారు. భారీ ర్యాలీతో పార్టీ కార్యాలయానికి చేరుకున్న మోడీకి పార్టీ ముఖ్య నాయకులు స్వాగతం పలికారు. ఎల్కే అద్వానీ, సుష్మాస్వరాజ్, మురళీమనోహర్ జోషి, వెంకయ్యనాయుడు, ప్రకాశ్ జగదేకర్ తదితరులు మోడీని అభినందించారు. మోడీ రాకతో ఢిల్లీలో సందడి నెలకొంది.
పార్లమెంటరీ పార్టీ నేతగా 20న మోడీ ఎన్నిక : రాజ్‌నాథ్
ఈ నెల 20న పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో పార్టీ నేతగా నరేంద్రమోడీని ఎన్నుకుంటామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ తెలిపారు. మోడీ శనివారం ఢిల్లీకి వచ్చాక తొలిసారిగా పార్లమెంటరీ బోర్డు సమావేశమయ్యింది. అదే రోజుల గుజరాత్ సిఎం ఎవరన్నది కూడా పార్లమెంటరీ బోర్డు నిర్ణయిస్తుందన్నారు. ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే తేదీని నిర్ణయిస్తామని అన్నారు. దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. మోడీ రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇదిలావుంటే మోడీని నాయకుడిగా ఎన్నుకోవడంలో ఎలాంటి విబేదాలు లేవన్నారు. ఆయన మాత్రమే పార్టీని ముందుకు తీసుకుని వచ్చారని అన్నారు. స్వాతంత్యం తర్వాత అఖండ మెజార్టీ సాధించిన కాంగ్రెసేతర పార్టీ భాజపా అని రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. భాజపా పార్లమెంటరీ బోర్డు సమావేశం అనంతరం మోడీ, అద్వానీతో కలిసి రాజనాథ్ విూడియాతో సమావేశంలో మాట్లాడారు. దేశవ్యాప్తంగా భాజపాను గెలిపించినందకు పార్లమెంటరీ బోర్డు మోడీని అభినందించినట్లు చెప్పారు. భారతీయులందరికీ భాజపా తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈనెల 20న భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశం ఉంటుందని, అదేరోజు పార్లమెంటరీ బోర్డు ప్రధాని అభ్యర్థిని లాంఛనంగా ప్రకటిస్తుందని చెప్పారు. ఇక మోడీ సిఎంగా రాజీనమా చేస్తే గుజరాత్ ముఖ్యమంత్రి ఎవరన్నది చర్చిస్తామని అన్నారు.




