(జనంసాక్షి):సామాన్యుల కష్టాలకు, కన్నీళ్లకు ప్రాణం పోసిన ఆ కుంచె మూగపోయింది. కేన్సర్ వ్యాధితో అలుపెరుగని పోరాటం చేసిన ఒక ప్రాణం అలిసిపోయింది. ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టులకు, కార్టూనిస్టులకు సుపరిచితుడైన కార్టూనిస్ట్ శేఖర్ కన్నుమూశారు. సోమవారం ఉదయం హైదరాబాద్‌లో ఆయన చివరిశ్వాస వదిలారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన భౌతికకాయాన్ని బోడుప్పల్ లోని ఈస్ట్ బాలాజీ హిల్స్‌లోని అయ్యప్ప ఆలయం సమీపంలోని ఆయన నివాసంలో ఉంచారు.
ప్రజాశక్తి, ఆంధ్రప్రభ, ఇండియన్ ఎక్స్ ప్రెస్, తర్వాత ఆంధ్రజ్యోతిలో గత 25 సంవత్సరాలుగా అవిశ్రాంతంగా పనిచేస్తూవచ్చిన కార్టూనిస్ట్ శేఖర్ తన వృత్తిగతమైన ప్రస్థానంలో 46వేలకు పైగా చిత్రాలు గీశారు. కంభాల పల్లి చంద్రశేఖర్ అనే సొంత పేరుకంటే కార్టూనిస్ట్ శేఖర్‌గానే సుపరిచితులైన ఆయన తన కార్టూన్లతో సామాన్యుల కష్టాలకు తన కుంచెతో ప్రాణం పోశారు.
నల్గొండ జిల్లా సూర్యాపేటలో ఓ సామాన్య కుటుంబంలో కంభాల పల్లి చంద్రశేఖర్ జన్మించారు. 1989లో ప్రజాశక్తిలో కార్టూనిస్టుగా తన కెరీర్‌ను ప్రారంభించారు. అటు తర్వాత ఆంధ్రప్రభ, ఇండియన్ ఎక్స్ ప్రెస్, తర్వాత ఆంధ్రజ్యోతిలో పనిచేశారు. కేన్సర్ వ్యాధిగ్రస్తుడై చికిత్స పొందుతున్న సమయంలోనూ ఇంట్లోనుంచే చిత్రాలు గీసి పంపిన పరమ నిబద్ధత శేఖర్ స్వంతం.
సామాన్యుడి జీవన చిత్రిక
ఆయన కుంచె నుంచి జాలువారిన బొమ్మ అందరినీ ఆలోచింపజేస్తుంది. తనదైన శైలిలో గీచిన పొలిటికల్ వ్యంగ్య చిత్రాలు సామాన్యుల బతుకు పోరాటాన్ని, డబ్బున్నోడి దుర్నీతిని కళ్లముందు సాక్షాత్కరింపజేస్తాయి. బడుగుజీవి కష్టాలకు, కన్నీళ్లకు తన కుంచెను అంకితం చేసిన శేఖర్‌కు పలు అవార్డులు కూడా వచ్చాయి. 2009లో రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు ఉత్తమ కార్టూనిస్టు అవార్డుతో సత్కరించింది. 2011లో అమెరికా ఆహ్వానంతో అక్కడ కూడా పర్యటించి, దక్షిణాదినుంచి తొలిసారి ఆహ్వానం పొందిన వ్యక్తిగా కూడా ఆయన రికార్డు సృష్టించారు.
కేన్సర్ చికిత్స
ఏడాది కాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతోన్న ఆయన ఇంటివద్ద నుంచే విధులు నిర్వహిస్తూ వచ్చారు. ఆరోగ్యం సహకరించకపోయినా, కార్టూన్లపై మక్కువతోనే గీస్తున్నానని చెప్పారు. కార్టూన్ల రంగంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నానని స్వయంగా తెలిపిన శేఖర్, ప్రముఖ రాజకీయ నేతలపై తాను గీసే చిత్రాలకు అభిమానులు మండిపడేవారని, కొందరు తన కార్యాలయంపైనా దాడులు చేశారని గతంలో చెప్పారు. అయితే తన కెరీర్లో ఎందరో వ్యక్తులు వెన్నుతట్టి ప్రోత్సహించారని, దీనిలో తన కుటుంబ పాత్ర మరువలేనిదని ఆయన అన్నారు. ఆరోగ్యం సహకరించకపోయినా, కార్టూన్లపై మక్కువతోనే చివరిక్షణం వరకూ చిత్రాలు గీస్తూవచ్చిన శేఖర్‌కు జర్నలిస్టు ప్రపంచం అంతిమ నివాళి పలుకుతోంది.
కార్టూన్ చిరంజీవి
ఆయనకు సుస్తీగా ఉన్నప్పుడు బాపూ గారు రాసిన ఒక లేఖలో ఆయనకు మరణం లేదని రాశారు. బాపుగారే స్వయంగా శేఖర్ వీరాభిమానిని అని ప్రకటించుకున్న తర్వాత కార్టూనిస్ట్ శేఖర్‌కి మరణం లేదు. 46 వేల కార్టూన్లలో తెలుగు కార్టూనిస్టు రంగాన్ని సుసంపన్నం చేసిన శేఖర్ మన తలపుల్లో, జ్ఞాపకాల్లో ఎప్పటికీ చిరంజీవిగానే ఉంటారు.
కార్టూనిస్ట్ శేఖర్ కుంచెకు రజతోత్సవ వేడుక
కార్టూనిస్టు శేఖర్ గౌరవార్థం తెలుగు పత్రికా రంగంలో శేఖర్ సహచరులు, మిత్రులు, అభిమానులు, అనేకానేకులు కలిసి ‘కార్టూనిస్ట్ శేఖర్ కుంచెకు రజతోత్సవం’ పేరుతో వేడుక జరుపుకున్నారు. మార్చి రెండు ఆదివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉదయం 11 గంటల నుంచి తెలుగు చిత్రకారులు, రచయితలు, కవులు, పాత్రికేయులు వెరసి శేఖర్ మిత్రులందరూ కలిసి ఆయన కుంచెకు రజతోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకున్నారు. సాహిత్య, సాంస్కృతిక, మీడియా రంగాలకు చెందిన పలువురు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కేన్సర్ వ్యాధితో తీవ్ర అనారోగ్యం బారినపడి జీవితంతో పోరాడుతున్న శేఖర్ కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కార్టూనిస్టులు అందరూ కలిసి ఒక రోజు శేఖర్‌తో గడిపారు.
ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టు, కవి కె.వి. కూర్మనాథ్, శేఖర్ రజతోత్సవ సందర్భానికి స్పందనగా రాసిన కవిత ‘ఒక వర్షం కురిసిన మధ్యాహ్నం’ ను ఆంధ్రప్రభ.కామ్ పాఠకుల కోసం మార్చి 3న అందించాము. కార్టూనిస్ట్ శేఖర్ సోమవారం ఉదయం (19-05-2014) కన్నుమూసిన సందర్భంగా ఆయన మిత్రుల జ్ఞాపకాలను మరోసారి కవిత రూపంలో చూడండి.





