Tuesday, 3 November 2026

భారత్‌తో దోస్తానాకు నవాజ్‌ మొగ్గు


మోడీ ప్రమాణానికి రానున్న పాక్‌ ప్రధాని
న్యూఢిల్లీ/ఇస్లామాబాద్‌, మే 24 (జనంసాక్షి) :
భారత్‌తో దోస్తానాకు పాకిస్తాన్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ మొగ్గు చూపుతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయం సాధించి, బీజేపీ పార్లమెంటరీ పక్షనేతగా నరేంద్రమోడీ ఎన్నికైన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయోనని అంతా ఆందో ళన చెందుతున్న సమయంలో మోడీ పాక్‌కు స్నేహహస్తాన్ని చాచారు. ఆయన ఆహ్వానం మేరకు నవాజ్‌ షరీఫ్‌ మోడీ ప్రమాణ స్వీకారానికి సోమ వారం ఢిల్లీకి చేరుకోనున్నారు. రెండ్రోజుల పర్యట నలో ఆయన మోడీతో పాటు రాష్ట్రపతితోనూ సమా వేశమై చర్చించనున్నట్లు సమాచారం. ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమణ స్వీకారోత్సవానికి షరీఫ్‌ హాజరు కానున్నారని ఆయన
అధికార ప్రతినిధి శనివారం వెల్లడించారు. ఈనెల 26న జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సార్క్‌ దేశాల అధ్యక్షులను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. భారత్‌ వచ్చేందుకు అఫ్ఘానిస్తాన్‌, శ్రీలంక, నేపాల్‌, భూటాన్‌, మాల్దీవుల అధినేతలు వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేయగా పాక్‌ నుంచి తొలుత స్పందన రాలేదు. దీంతో షరీఫ్‌ రాకపై సందేహాలు నెలకొన్నాయి. ఎట్టకేలకు భారత్‌ ఆహ్వానంపై ఆయన సానుకూలంగా స్పందించారు. 26న జరిగే మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి షరీఫ్‌ హాజరు కానున్నట్లు ఆ దేశ ప్రధాని కార్యాలయం ధ్రువీకరించింది. ప్రధానితో పాటు విదేశాంగ మంత్రి సర్తాజ్‌ అజీజ్‌ కూడా రానున్నారు. 26న ప్రమాణ స్వీకారానికి హాజరుకానున్న షరీఫ్‌ 27న మోడీతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ద్వైపాక్షిక అంశాలపై ఇరువురు నేతలు చర్చించనున్నారు. కాగా షరీఫ్‌ రాకపై వివిధ పార్టీల నుంచి మిశ్రమ స్పందన లభించింది. భారత్‌ ఆహ్వానం మేరకు నవాజ్‌ షరీఫ్‌ రానుండడంపై బీజేపీ హర్షం వ్యక్తం చేసింది. మరోవైపు, కాంగ్రెస్‌ కూడా ఈ పరిణామాన్ని స్వాగతించింది. అయితే, పాక్‌తో ద్వైపాక్షిక సంబంధాలు వద్దని సూచించింది. నవాజ్‌ షరీఫ్‌ రానుండడం స్వాగతించదగిన విషయమని జమ్మూకాశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా అభిప్రాయపడ్డారు. భారత్‌కు షరీఫ్‌ రాక కొత్త అధ్యయానికి నాంది అని అన్నారు.
సార్క్‌ దేశాధినేతల కోసం హైదారబాద్‌ హౌజ్‌ ముస్తాబు
ప్రధానిగా నరేంద్రమోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవుతున్న సార్క్‌ దేశాల ప్రతినిధులకు విడిది ఇవ్వడానికి హైదరాబాద్‌ హౌస్‌ ముస్తాబవుతోంది. దీనిని ప్రత్యేకంగా అలంకరిస్తున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులకు మోడీ హైదరాబాద్‌ హౌస్‌లో విందు ఇస్తున్నారు. విదేశీ వ్యవహారాల శాఖ అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. 27వ తేదీన వివిధ దేశాల ప్రతినిధులతో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే విషయాన్ని కూడా వారితో మోడీ చర్చిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్న విందు కూడా అక్కడే జరుగుతుందని విదేశీ వ్యవహారాల శాఖ వర్గాలు సూచనప్రాయంగా తెలియజేశాయి. ఇదిలావుంటే ప్రమాణస్వీకారానికి పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ వస్తున్నట్లు సమాచారం. దీంతో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక అంశాలపై చర్చించే అవకాశాలు ఉన్నాయి.
రాజపక్సె, నవాజ్‌ల రాకపై మిత్రుల అలక
ఓ వైపు నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చురుకుగా సాగుతున్న తరుణంలో తమిళ నాడుకు చెందిన ఎండీఎంకే అధ్యక్షుడు వైగో మాత్రం తన పట్టు వీడడం లేదు. శ్రీలంక అధ్యక్షుడు మహీందా రాజపక్షే రావడాన్ని ఆయన నిరసిస్తున్నారు. ఇదే విషయాన్ని పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌ సింగ్‌కు చెప్పారు. బిజెపి మిత్రపక్షాలుగా ఉన్న వైగో, శివసేన నేత ఉద్దవ్‌ థాకరేలు నిరసనలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. పాక్‌ ప్రధానిని ఆహ్వానించడాన్ని శివసేన కూడా జీర్ణించుకోలేకపోతున్నది. ప్రధానిగా బాధ్యతలు చేపట్టకముందే బీజేపీ మిత్ర పక్షాల్లో లుకలుకలు మొదలయ్యాయని కాంగ్రెస్‌ నేతలు చంకలు గుద్దుకుంటున్నారు. మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి ముందు వైగో నిరసనలు తెలపడంపై బిజెపి కూడా అంగీకరించడం లేదు. ఇరుగుపొరుగు వారితో మనం స్నేహంగా ఉండాల్సిన సమయంలో ఇది సరికాదని రాజ్‌నాథ్‌ వైగోకు చెప్పారని సమాచారం. మోడీ తన ప్రమాణ స్వీకారానికి సార్క్‌ దేశాధినేతలను ఆహ్వానించడమే మిత్రపక్షాల ఆగ్రహానికి కారణమైంది. ముఖ్యంగా శ్రీలంక అధ్యక్షుడు రాజ్‌పక్సెను, పాకిస్థాన్‌ ప్రధాని నవాజ్‌ షరీప్లను పిలవడం రెండు పార్టీలకు సుతారమూ ఇష్టం లేదు.లంకతో తమిళులను అణచివేస్తున్న రాజపక్షేను ఆహ్వానించడమేంటంటూ ప్రశ్నించారు. ఢిల్లీలో మోడీ ప్రమాణ స్వీకారం సందర్భంగా నల్ల బ్యాడ్జీ ధరించి రాజపక్షేకు నిరసన తెలియజేస్తానని ప్రకటించారు. ఇక పాక్‌ పేరెత్తితేనే అంతెత్తున ఎగిరిపడే శివసేనకు నవాజ్‌ షరీఫ్‌ రాక మింగుడుపడటం లేదు. మోడీ సర్కార్‌ పాక్‌పై దూకుడుగా వ్యవహరిస్తుందని శివసేన చీఫ్‌ ఉద్దవ్‌ థాకరే ఎన్నికల ఫలితాల అనంతరం వ్యాఖ్యానించారు. పాక్‌తో క్రికెట్‌ నిషేధించాలన్నారు. అయితే షరీఫ్‌ రాకపై స్పందించేందుకు శివసేన నిరాకరించింది. మీ పార్టీ వైఖరేంటన్న ప్రశ్నకు మౌనమే సమాధానమైంది. పాక్‌ ప్రధాని రాకను అడ్డుకోవాలంటూ సరభ్‌ జిత్‌ సింగ్‌ సోదరి దల్బీర్‌ కౌర్‌ కూడా పిలుపునిచ్చారు. అయితే బీజేపీ మిత్రపక్షాలు రాజకీయ కారణాల వల్లే తమ అసంతృప్తిని వ్యక్తం చేశాయే తప్ప కాదు కూడదని చెప్పే సాహసం చేయలేదు. లంక, పాక్‌ అధినేతలకు ఆహ్మానం వద్దంటూ బీజేపీ, మోడీ ఎదుట డిమాండ్‌ చేయలేకపోయాయి. కారణమేంటంటే గతంలో మాదిరి బీజేపీని బెదిరించే పరిస్థితి లేకపోవడమే. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ పరిపూర్ణమైన మెజారిటీ సాధించిన సంగతి తెలిసిందే. మోడీ సునామీ ప్రభావంతో 282 ఎంపీ సీట్లు గెలుచుకుని చరిత్ర సృష్టించింది. దీంతో కేంద్ర ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు బీజేపీ మిత్రులపై ఆధారపడాల్సిన పరిస్థితి లేదు. మంత్రి పదవులు మొదలు ఇతరత్రా పనుల కోసం మిత్రులే మోడీ ప్రాపకం కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. ఈ కారణం వల్లే ఎన్డీయే మిత్రులు బెదిరింపులకు పోకుండా అసంతృప్తితో సరిపెట్టాయి. అయితే దీనిని ఆసరా చేసుకుని రాజకీయం చేయకూడదన్నది కూడా కాంగ్రెస్‌ పాలసీగా ఉన్నట్లు కనిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *