మార్గదర్శకాలు జారీ చేసేందుకు సమయం పట్టొచ్చు
కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డప్పుడు ఇలానే జరిగింది : సీఎస్ మహంతి
హైదరాబాద్, మే 28 (జనంసాక్షి)
ఉద్యోగుల బదలాయింపు తాత్కాలి కమేనని, ప్రస్తుత అవసరాల కోస మే తాత్కాలికంగా ఉద్యోగులను కే టాయించామని
ప్రభుత్వం ప్రకటించింది. పాలనకు అంతరాయం కలగకుండా ఉండేందుకే తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగుల కేటాయింపు జరిగిందని తెలిపింది. ప్రస్తుతం తాత్కాలికంగానే ఉద్యోగులను కేటాయించామని, రెండు రాష్ట్రాల ఆవిర్భావం తర్వాత పూర్తి స్థాయి నియామకాలు చేపడతామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి వెల్లడించారు. బుధవారం ఢిల్లీలోని కేంద్ర ¬ం మంత్రి కార్యాలయంలో కమలనాథన్ కమిటీ సమావేశమైంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు పలువురు ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్, ఇతర ఉన్నతాధికారులు, ఉద్యోగుల కేటాయింపు, మార్గదర్శకాలపై చర్చించారు. భేటీ ముగిసిన అనంతరం మహంతి మీడియాతో మాట్లాడారు. పాలనకు అంతరాయం కలగకుండా ఉండేందుకే తాత్కాలిక కేటాయింపులు జరిపినట్లు తెలిపారు. ప్రస్తుత అవసరాల కోసం తాత్కాలికంగా ఉద్యోగుల కేటాయింపు జరిగిందని చెప్పారు. జిల్లాల్లో ఎక్కడి వారు అక్కడే ఉంటారని, శాఖాధిపతుల కార్యాలయాల్లోని ఉద్యోగుల విభజన ఉంటుందని తెలిపారు. క్షేత్ర స్థాయిలోని కలెక్టర్లు, జేసీలు, అధికారులు వారి స్థానాల్లోనే ఉంటారన్నారు. శాఖాధిపతులు, ఉన్నతాధికారులకు మాత్రమే ఆర్డర్ టు వర్క్ ఉత్తర్వులు వర్తిస్తాయని చెప్పారు. ఉద్యోగుల కేటాయింపు మార్గదర్శకాలకు మరికొంత సమయం పడుతుందని వివరించారు. కేంద్రం నుంచి మార్గదర్శకాలు వెలువడ్డాకే నియామక ఉత్తర్వులు ఇవ్వనున్నట్లు వివరించనున్నారు.
ఉద్యోగ సంఘాలకు ఆహ్వానం
ఉద్యోగుల విభజనపై ఉన్న అభ్యంతరాలను పరిశీలించి, పరిష్కరించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి ఉద్యోగ సంఘాలతో సమావేశం కానున్నారు. ఉద్యోగుల విభజనలో వారి సహకారాన్ని అర్థించనున్నారు. ఈనెల 30న గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలతో సీఎస్ సమావేశం కానున్నారు. ఈ మేరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు చెందిన ఉద్యోగ సంఘాలకు ఆహ్వానం పంపారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇరు రాష్టాల్రకు ఉద్యోగుల కేటాయింపుపై అపోహలు తొలగించేందుకే ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగుల కేటాయింపు జరిగిందని వివరించనున్న మహంతి కేటాయింపులపై సహకరించాలని కోరనున్నారు. విభజన ప్రక్రియలో భాగంగా పాలన, ప్రస్తుత అవసరాల కోసం తాత్కాలికంగా ఉద్యోగుల కేటాయింపు చేపట్టినట్లు వివరించడంతో పాటు ఉద్యోగ సంఘాల అభిప్రాయాలను ఆయన సేకరించనున్నారు.





