ముంపు ప్రాంతాలను సీమాంధ్రలో కలిపినకేంద్రం
న్యూఢిల్లీ, మే 28 (జనంసాక్షి) :
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల ముంపుకు గురయ్యే ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను సీమాంధ్రలో కలుపుతూ కేంద్ర ప్రభుత్వం గోప్యంగా ఆర్డినెన్స్ జారీ చేసింది. పోలవరం ముంపు ప్రాంతాలైన ఏడు మండలాలను ఆంధప్రదేశ్‌లో కలుపుతూ ఆర్డినెన్స్ బుధవారం సాయంత్రం జారీ అయింది. మంగళవారం నాడు నిర్వహించిన కేబినెట్ భేటీలోనే దీనిని ఆమోదించి వెంటనే రాష్ట్రపతికి పంపారు. దీనిపై రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. ఆర్డినెన్స్ జారీకి మంగళవారం జరిగిన బేటీలోనే కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ఆర్డినెన్స్ ద్వారా ఖమ్మం జిల్లాలోని
చింతూరు, భద్రాచలం, కూనవరం, కుక్కునూరు, వేలేరుపాడు, బూర్కంపాడు, వరరామచంద్రాపురం మండలాలు సీమాంధ్రలో కలవనున్నాయి. నరేంద్రమోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజైన మంగళవారం తొలి కేబినెట్ జరిగింది. ఇందులో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. అందులో పొలవరం ప్రాజెక్టు కింద ఉన్నటువంటి ముంపు ప్రాంతాలను సీమాంధ్రలో కలపడం… ఆ విషయం బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. అయితే కేసీఆర్ దీనిని ముందే పసిగట్టి ఆర్డినెన్స్‌పై ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం సాయంత్రం కేంద్రమంత్రి
రవిశంకర్ ప్రసాద్ విలేకరుల సమావేశంలో కూడా ఈ విషయం వెల్లడించలేదు. అయితే మంగళవారమే ఆర్డినెన్స్‌ను రాష్ట్రపతికి పంపారు. దీనిపై ప్రణబముఖర్జీ బుధవారం ఆమోద ముద్ర వేయడం విశేషం. రాష్ట్రానికి సంబంధించి మరో నిర్ణయం కూడా కేబినెట్ తీసుకుంది. ఇప్పటి వరకు గవర్నర్ పాలనలో ఉన్న సీమాంధ్ర జూన్ రెండు నుంచి తొలగనుంది. అయితే రెండు రాష్ట్రాలకు కూడా గవర్నర్‌గా నరసింహన్ వ్యవహరించనున్నట్లు కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీనికి రాష్ట్రపతి ఆమోదం తెలిపారు.





