Monday, 2 November 2026

పోలవరం ఓ ముసుగు

harish

సహజ వనరుల దోపిడీకి కుట్ర

టీడీపీ, బీజేపీ ఎందుకు మాట్లాడటం లేదు : హరీశ్‌

హైదరాబాద్‌, మే 29 (జనంసాక్షి) :పోలవరం ము సుగులో తెలంగాణాలోని అటవీ సంపద, సహజ వన రులను దోచుకునేందుకు సీమాంధ్రులు కుట్ర చేస్తున్నా రని టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత హరీశ్‌రావు ఆరోపించారు. గురువారం ఆయన తెలంగాణ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. పోలవరం ముంపు

గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపేందుకు సీమాంధ్రులు కుట్రలు చేస్తున్నారని, గతంలోనే తెలంగాణ ముఖ్య నేతలను టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ కలిసినా ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం ముంపు గ్రామాలను సీమాంధ్రలో కలపడం కుట్రపూరితమేనని అన్నారు. దీనివల్ల 460 మెగావాట్ల విద్యుదుత్పత్తి అయ్యే లోయర్‌ పీలేరు విద్యుత్‌ ప్రాజెక్టు సీమాంధ్రకు వెళుతుందన్నారు. ఏడు మండలాలకు చెందిన ప్రజలు తాము తెలంగాణాలోనే ఉంటామని, సీమాంధ్రలో కలవబోమంటూ ఎంత మొత్తుకున్నా కేంద్రం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడాన్ని ఆయన తీవ్రంగా నిరసించారు. ఈ ముంపు గ్రామాలను సీమాంధ్రలో కలపడంవల్ల అక్కడ లభించే విలువైన కలప, అటవీ సంపద, భూగర్భ గనులు అన్ని సీమాంధ్రకు పోతాయని అన్నారు. దీనివల్ల తెలంగాణాకు తీరని ద్రోహం చేశారన్నారు. అబద్ధాలు, అభూతకల్పనలను ప్రచారంచేసి తెలంగాణ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారని ఆయన ఆరోపించారు. ఏడు మండలాలను సీమాంధ్రలో కలుపుతూ కేంద్రం అధికారంలోకి వచ్చిన మూడు రోజుల్లోనే ఆర్డినెన్స్‌ తీసుకురావడం వెనక చంద్రబాబు, వెంకయ్యనాయుడు కుట్ర లేదా అని ప్రశ్నించారు. కేవలం తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేందుకే సీమాంధ్ర నాయకులంతా కలిసి ఈ విధంగా చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. పూటకో మాటమార్చి రాజకీయ లబ్ధి పొందేందుకే టిడిపి ప్రయత్నిస్తోందని, తమ పార్టీ మాత్రం చెప్పిన మాటకు కట్టుబడి మడమ తిప్పకుండా ప్రయత్నం చేస్తోందన్నారు. తెలంగాణాకు తీరని అన్యాయం జరుగుతుంటే తెలంగాణాలోని టిడిపి, కాంగ్రెస్‌ నాయకులు ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. రాజ్యాంగ విరుద్ధంగా కేంద్రం ఆర్డినెన్స్‌ తెస్తుంటే అందుకు చంద్రబాబు సహకరిస్తుంటే తెలంగాణ టిడిపి నేతలు ఎందుకు ప్రశ్నించడం లేదని ఆయన నిలదీశారు. బాబు మోచేతి నీళ్లు తాగి బతుకుతారా, ప్రజల పక్షాన నిలబడతారో టిటిడిపి నేతలు తేల్చుకోవాలన్నారు. తెలంగాణపై ప్రేమ ఉంటే బిజెపి నేతలు కేంద్రంపై ఒత్తిడితెచ్చి ఆర్డినెన్స్‌ను అడ్డుకోవాలని, బిజెపి జాతీయ నాయకత్వాన్ని గుర్తించాలని హరీష్‌రావు డిమాండ్‌ చేశారు. గురువారం టిఆర్‌ఎస్‌ పిలుపు మేరకు తెలంగాణ బంద్‌ సంపూర్ణమైందని, ఈ బంద్‌కు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరున హరీష్‌రావు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *