Monday, 2 November 2026

ఆరోపణలకు కట్టుబడ్డ : కేజ్రీవాల్‌

kezreeval

అభియోగాలు నమోదు చేసిన కోర్టు

న్యూఢిల్లీ, జూన్‌ 6 (జనంసాక్షి) :

బీజేపీ మాజీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీపై తాను చేసిన అవినీతి ఆరోపణలకు కట్టుబడ్డానని ఆమ్‌ ఆద్మీ పార్టీ కన్వీనర్‌, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో గడ్కరీ దాఖలు చేసిన పరువునష్టం కేసులో కేజ్రీవాల్‌పై కోర్టు అభియోగాలు నమోదు చేసింది. సెక్షన్లు 499, 500 కింద ఆయనపై అభియోగాలు నమోదు చేసిన న్యాయస్థానం వ్యక్తిగత హాజరునుంచి మినహాయింపునిచ్చింది. తదుపరి విచారణను ఆగస్టు 2కు వాయిదా వేసింది. కేజ్రీవాల్‌పై అభియోగాలు రుజువైతే ఆయనకు గరిష్టంగా రెండేళ్ల వరకు జైలుశిక్ష పడే అవకాశం ఉంది. పరువునష్టం కేసు విచారణ సందర్భంగా కేజ్రీవాల్‌ శుక్రవారం ఢిల్లీ హైకోర్టుకు హాజరయ్యారు. పిటిషనర్‌, కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కారీ కూడా కోర్టుకు వచ్చారు. ఈ సందర్భంగా సమస్యను చర్చించి పరిష్కరించుకోవాలని న్యాయస్థానం ఇరువురికి సూచించింది. ఇద్దరూ రాజకీయ నాయకులు కాబట్టి పరస్పరం చర్చించుకొని సమస్యను సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవాలని కేజ్రీవాల్‌కు సూచించింది. ఇరువురు నేతలు తమ విలువైన సమయాన్ని మరింత ఉపయోగకరమైన రీతిలో వినియోగించి ప్రజలకు ఆదర్శంగా నిలవాలని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే కేజ్రీవాల్‌ తనకు క్షమాపణ చెప్పనవరసం లేదని తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొంటే సరిపోతుందని గడ్కారీ తెలిపారు. అయితే, కేజ్రీవాల్‌ మాత్రం తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొనేందుకు ససేమిరా అన్నారు. తన వ్యాఖ్యలపై వెనక్కు తగ్గేది లేదని విచారణను కొనసాగించాలని కోరారు. దీంతో కోర్టు అభియోగాలు నమోదు చేసింది. విచారణను ఆగస్టుకు వాయిదా వేసింది. అవినీతిపరుల జాబితాలో తన పేరు చేర్చడంపై నితిన్‌ గడ్కారీ కేజ్రీవాల్‌పై పరువునష్టం కేసు వేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో కేజ్రీవాల్‌ ఇటీవల జైలుకు కూడా వెళ్లారు. అనంతరం బెయిల్‌పై విడుదలయ్యారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *