రెండో మహిళా స్పీకర్‌గా చరిత్ర
న్యూఢిల్లీ, జూన్ 6 (జనంసాక్షి) :
లోక్‌సభ స్పీకర్‌గా సుమిత్రా మహాజన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రెండో మహిళా స్పీకర్‌గా ఆమె రికార్డులకెక్కారు. ఎనిమిది సార్లు ఇండోర్ లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందిన ఆమెకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. వాజపేయి హయాంలో మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా పని చేశారు. విశేష రాజకీయ అనుభవం, వివాదరహితురాలిగా పేరొందిన సుమిత్రకు విపక్షాలన్నీ మద్దతు తెలపడంతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్ పదవి కోసం గురువారం మధ్యాహ్నంలోగా నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉండగా కేవలం సుమిత్రా మహాజన్ పేరుకు మాత్రమే ప్రతిపాదనలు వచ్చాయి. ఆమె పేరును బలపరుస్తూ 19 నామినేషన్లు దాఖలు కావడంతో ఆమె ఎన్నిక లాంఛనప్రాయమే అయింది. 72 సంవత్సరల సుమిత్ర మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నియోజకవర్గం నుంచి వరుసగా ఎనిమిది సార్లు ఎన్నికైన పార్లమెంటేరియన్‌గా రికార్డు సృష్టించారు. తాజాగా రెండో మహిళా స్పీకర్‌గా ఎన్నికై మరో రికార్డును తన సొంతం చేసుకున్నారు. గత సభాపతిగా వ్యవహరించిన విూరాకుమార్ తొలి మహిళా స్పీకర్‌గా రికార్డులకెక్కాకరు. మృదు స్వభావి అయిన, ప్రేమతో ‘తాయి’ (మరాఠీలో పెద్ద సోదరి)గా పిలుచుకొనే ఆమెకు దాదాపు అన్ని పార్టీల్లోనూ స్నేహితులు, అభిమానులు ఉన్నారు. న్యాయశాస్త్రంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఆమెకు విశేష రాజకీయ అనుభవం ఉంది. మచ్చలేని రాజకీయ చరిత ఆమె సొంతం. 1943 ఏప్రిల్ 12న మధ్యప్రదేశ్‌లోని రత్నగిరిలో జన్మించారు. తన 39వ ఏటా 1965లో రాజకీయాల్లోకి వచ్చిన ఆమె 1982లో కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్‌గా పని చేసిన మహాజన్ 1989లో ఇండోర్ నుంచి తొలిసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. అప్పటి నుంచి 2014 వరకు వరుసగా ఎనిమిది సార్లు విజయం సాధించారు. వాజ్‌పేయి క్యాబినెట్‌లో 1999 నుంచి 2004 వరకూ సుమిత్ర మహాజన్ సహాయ మంత్రిగా పని చేశారు.శుక్రవారం ఉదయం లోక్‌సభ సమావేశం కాగానే నూతన సభ్యుల ప్రమాణ స్వీకారం చేపట్టారు. అనంతరం ప్రొటెం స్పీకర్ కమల్‌నాథ్ స్పీకర్ ఎన్నిక నిర్వహించారు. 16వ లోక్‌సభ స్పీకర్‌గా సుమిత్రా మహాజన్ పేరును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతిపాదిస్తూ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ ప్రతిపాదనను ¬ం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, ఎల్‌కే అద్వానీ, సుష్మాస్వరాజ్, రాంవిలాస్ పాశ్వాన్, దేవెగౌడతో సహా వివిధ పార్టీల సభ్యులు బలపరిచారు. దీంతో సుమిత్రా మహాజన్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్ కమల్‌నాథ్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ స్వయంగా ఆమె కూర్చున్న చోటకు వెళ్లి అభినందనలు తెలిపారు. అనంతరం ఆమెను సాదరంగా సభాపతి స్థానం వద్దకు ఆహ్వానించారు. కమల్‌నాథ్ ఆమెను స్వాగతించి అక్కడి నుంచి నిష్కమ్రించారు. అనంతరం బాధ్యతలు స్వీకరించిన సుమిత్రను ప్రధాని మోడీ, అద్వానీ, వెంకయ్యనాయుడు, మల్లికార్జున్ ఖర్గే, ములాయంసింగ్ యాదవ్, సుదీప్ బంధోపాధ్యాయ, అనంత్ గీతే, తంబిదురై, జితేందర్‌రెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి తదితరులు అభినందించారు. స్పీకర్‌గా ఎన్నికైన సుమిత్రా మహజన్‌కు మోడీ అభినందనలు తెలిపారు. స్పీకర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు సభ్యులందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. సుమిత్ర పేరులోనే అందరితోనూ స్నేహభావంతో నడుచుకొనే వ్యక్తి అన్న అర్థం ఉందని పేరుకు తగ్గట్టే ఆమె వ్యవహరిస్తారన్నారు. ‘మహాజనులు’ నడిచిన బాటలో నడవాలని పెద్దలు చెబుతారని, ఇప్పుడు స్పీకరుగా సుమిత్రా మహాజన్ అందరికీ ఆదర్శప్రాయమైన మార్గంలో నడుస్తూ సభ్యులకు మంచి దారి చూపుతారని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన వారికి ఆయన దిశానిర్దేశం చేశారు. 16వ లోక్‌సభకు 316 మంది కొత్తగా లోక్‌సభకు ఎన్నికయ్యారని.. వారంతా సమస్యలపై అవగాహనతో సభకు రావాలని సూచించారు. అనవసర విషయాలను చర్చించొద్దని కోరారు. సుమత్ర నేతృత్వంలో లోక్‌సభ సజావుగా సాగుతుందని ఆకాంక్షించారు. అనంతరం కాంగ్రెస్ సభాపక్ష మంత్రి మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ సభాపతికి కృతజ్ఞతలు తెలిపారు. పెద్దా చిన్నా పార్టీలనే తేడా లేకుండా అందరినీ కలుపుకొని వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి చెందిన టీఆర్‌ఎస్ ఎంపీ జితేందర్‌రెడ్డి, అసదుద్దీన్ ఒవైసీ తదితరులు కూడా స్పీకర్‌కు అభినందనలు తెలిపారు. తమ ప్రాంత సమస్యలను సభలో లేవనెత్తేందుకు అవకాశం ఇవ్వాలని జితేందర్‌రెడ్డి కోరారు.
తనను లోక్‌సభ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు స్పీకర్ సుమిత్రా మహాజన్ సభ్యులకు అభినందనలు తెలిపారు. ఆమె శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సభలోని ఎంపీలకు సుమిత్రా మహాజన్ ధన్యవాదాలు తెలిపారు. తన బాధ్యతలు నిబద్ధతతో నిర్వర్తిస్తానని సుమిత్రా చెప్పారు. దేశ సమగ్రాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కషి చేయాలన్నారు. అర్థవంతమైన చర్చ జరిగేందుకు సభ్యులు సహకరించాలని కోరారు. దేశంలోని ఎందరో మనల్ని ఇక్కడికి పంపారని వారి సమస్యలపై అందరం చిత్తశుద్దితో కృషి చేద్దామన్నారు. తను రాగద్వేషాలకు, పార్టీలకు అతీతంగా వ్యవహరిస్తానని అన్నారు.





