Monday, 2 November 2026

కేరళాను తాకిన రుతుపవనాలు

rain

వారంలోపు రాష్ట్రానికి

తిరువనంతపురం/న్యూఢిల్లీ, జూన్‌ 6 (జనంసాక్షి) :

తొలకరి పులకరించింది. నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. ప్రస్తుతం కేరళపైకి పశ్చిమ దిశగా తేమతో కూడిన బలమైన గాలులు వీస్తున్నాయి. నిజానికి కేరళ, లక్షద్వీప్‌లలో రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నప్పటికీ.. వాటిని ప్రీమాన్‌సూన్‌ షవర్స్‌గానే భావిస్తున్నామని భారత వాతావరణ శాఖ గురువారం రాత్రి ప్రకటించింది. ఇవి నైరుతి రుతుపవనాలు కేరళను తాకిందీ లేనిదీ ప్రకటిస్తామని తెలిపారు. అయితే కొంత ఆలస్యంగా రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. నైరుతి రుతుపవనాలు భారత భూభాగంలోకి ప్రవేశించాయి. రుతుపవనాల ప్రభావం వల్ల కేరళ, తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో శుక్రవారం తొలకరి జల్లులు మొదలయ్యాయి. 24 గంటల్లో రుతుపవనాలు కేరళలో ప్రవేశిస్తాయని, అవి త్వరగా వ్యాపించడానికి అనుకూల వాతావరణం ఉందని వాతావరణ శాఖ అధికారులు గురువారమే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఒకటి రెండు రోజులు ఆలస్యంగా వచ్చిన రుతుపవనాలు నెమ్మదిగా వ్యాపిస్తాయని, జూన్‌ తొలి పక్షంలో ఇవి దేశంలో సగభాగాన్ని పూర్తిగా తాకక పోవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. ఎల్‌నినో ప్రభావం జూన్‌ మాసంలో కన్పించదని నేషనల్‌ వెదర్‌ ఫోర్‌కాస్టిింగ్‌ విభాగం అధిపతి బీపీ యాదవ్‌ అన్నారు. రాకను నిర్ధారించడానికి కనీసం 15 నుంచి 20 నాట్ల వేగంతో కూడిన గాలులతో, 48 గంటలపాటు విడవకుండా వర్షం కురవాలని వాతావరణ శాఖ డైరెక్టర్‌ జనరల్‌ ఎల్‌ఎస్‌ రాథోడ్‌ పేర్కొన్నారు. ఏదేమైనా శుక్రవారానికి రుతుపవనాలు కేరళను తాకి మరో రెండు మూడు రోజులపాటు ఆ రాష్ట్రపరిసరాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాగా.. దక్షిణ అరేబియా, మాల్దీవులు, కామెరూన్‌లలో పలు ప్రాంతాలు, తమిళనాడు, బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు కూడా రుతుపవనాలు విస్తరిస్తాయని వాతావరణ శాఖ వివరించింది. మరోవైపు దేశరాజధానిలో గత ఐదేళ్లలో ఎన్నడూ లేనంతగా గురువారం ఉష్ణోగ్రత 44.7 డిగ్రీల సెల్సియస్‌కు చేరింది. ఎండల మంటతో ప్రజలు అల్లాడుతున్నారు. దేశరాజధానిలో ఎండలు మండిపోతున్నాయి. ఈ సీజన్‌లోనే అత్యధికంగా 44.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. శుక్రవారం కూడా అదే పరిస్థితి కొనసాగనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. వేడిగాలులు, ఎండలకు భయపడి నగరవాసులు రోడ్డువిూదికి రావడానికి జంకుతున్నారు. పగలు 12-3 గంటల మధ్య రోడ్లన్నీ దాదాపు నిర్మానుష్యంగా కన్పిస్తున్నాయి. తప్పనిసరై బయటతిరిగేవారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక రాజస్థాన్‌ జైపూర్‌ లో కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *