Monday, 2 November 2026

హామీలు నెరవేర్చండి

ponnala

టీ పీసీసీ చీఫ్‌ పొన్నాల

హైదరాబాద్‌, జూన్‌ 6 (జనంసాక్షి) :

తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ హామీలను విశ్వసించారని, ఇప్పుడు వాటిని నెరవేర్చాల్సిన బాధ్యత కేసీఆర్‌పైనే ఉందని తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. రైతులకు రుణమాఫీపై ఇచ్చిన వాగ్దానం నెరవేర్చాల్సిందేనని ఆయన కోరారు. రైతులు అధైర్యపడవద్దని వారి తరఫున తాము పోరాడతామని తెలిపారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి కచ్చితంగా రూ.లక్ష లోపు రుణాలు మాఫీ చేయిస్తామన్నారు. పొన్నాల శుక్రవారం గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ అదికార ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భవిష్యత్‌ కార్యాచరణతో పాటు ఇతర అంశాలపై చర్చించారు. అధికార పార్టీని ఎలా ఎదుర్కోవాలనే అంశంపైనే ప్రధానంగా దృష్టి సారించినట్లు సమాచారం. రుణమాఫీపై టీఆర్‌ఎస్‌ మాట తప్పిన అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు తెలిసింది. టీ పీసీసీలో ఉన్న ఆంధ్ర అధికార ప్రతినిధులను తొలగించాలని ఈ సందర్భంగా పలువురు పొన్నాలను కోరారు. అనంతరం పొన్నాల గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఆత్మహత్యలకు పాల్పడవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. కేసీఆర్‌ ఇచ్చిన హామీలను ప్రజలు నమ్మారని అందుకే ఆ పార్టీకి ఓట్లేసి గెలిపించారన్నారు. ఇచ్చిన హామీలన్నింటినీ కేసీఆర్‌ అమలు చేయాలని, రుణమాఫీపై రైతులకు ఇచ్చిన మాటను కేసీఆర్‌ నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేశారు. రైతు రుణాలను మాఫీ చేస్తామని 2012 నుంచే ఆయన ప్రజలకు హావిూ ఇచ్చారని గుర్తు చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలోనూ ఈ అంశాన్ని చేర్చారని తెలిపారు. దీంతో రుణమాఫీపై రైతులు ఆశ పడ్డారని.. అధికారంలోకి వచ్చాక రుణమాఫీ ఒక్క ఏడాది అని ప్రకటించడంతో వారిలో ఆందోళన నెలకొందన్నారు. రైతుల పరిస్థితిని కేసీఆర్‌ అర్థం చేసుకోవాలని కోరారు. ఇచ్చిన హామీలు నెరవేర్చే బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ రైతులకు అండగా ఉంటుందని, రుణమాఫీ కోసం ప్రభుత్వంపై అన్ని విధాలుగా ఒత్తిడి తెస్తామన్నారు. గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులందరి రుణాలను మాఫీ చేసిందని గుర్తు చేసిన పొన్నాల బంగారు తెలంగాణకు తెలంగాణకు బాటలు వేసింది కాంగ్రెస్‌ పార్టీయేనని చెప్పారు. తమది ప్రజల పక్షమేనని తెలిపారు. రైతులెవరూ అధైర్య పడి, ఆందోళనకు గురై ఆత్మహత్యలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా ఎవరైనా ప్రజల పక్షాన ఉండాల్సిందేనన్నారు. ఇతరులను నిందించి కారణాలు వెతకటం సరికాదని పొన్నాల వ్యాఖ్యానించారు. తెలంగాణ అభివృద్ధిపై అధికారపక్షం తమను సంప్రదిస్తే సలహాలు ఇస్తామని తెలిపారు. కానీ ఉచిత సలహాలు ఇవ్వమని స్పష్టం చేశారు. అసెంబ్లీలో ఎలా వ్యవహరించాలో త్వరలోనే నిర్ణయిస్తామని చెప్పారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టే ప్రజోపయోగ కార్యక్రమాలకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. హామీలు నెరవేర్చేందుకు ప్రభుత్వానికి సహకరిస్తామని అదే సమయంలో ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై పోరాడతామన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *