
అట్టహాసంగా వేదిక
పదేళ్ల తర్వాత సీఎంగా బాబు
గుంటూరు, జూన్ 7 (జనంసాక్షి) :విభజన అనంతరం 13 జిల్లాలతో మిగిలిన తొలి ఆంధ్రప్రదేశ్ ము ఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ
అధినేత చంద్రబాబునాయుడు ఆదివారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇరు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్‌గా ఉన్న నరసింహన్ బాబుతో సాయంత్రం 7.27 గంటలకు ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఇందుకోసం గుంటూరు నాగార్జున యూనివర్సిటీ వద్ద వేదిక ఏర్పట్లు పూర్తయ్యాయి. దీనికోసం రాష్ట్రం నుంచే కాకుండా దేశం నుంచి పలువురు ప్రముఖులు, వీఐపీలు హాజరవుతున్నారు. అయితే టీడీపీ నేతలు ఎన్నో ఆశలు పెట్టుకున్నా ప్రధాని నరేంద్రమోడీ మాత్రం ఈ కార్యక్రమానికి హాజరురావడం లేదు. కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, నిర్మలా సీతారామన్‌లు ప్రమాణానికి హాజరవుతున్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్న సభాస్థలి పనులు పూర్తయ్యాయి. దాంతో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. ఐదు లక్షల మందికి పైగా హాజరయ్యే ఈ కార్యక్రమానికి ఆరు రోజుల వ్యవధిలోనే ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏర్పాట్లు చాలా బాగున్నాయని పార్టీ నాయకులు సంతృప్తి వ్యక్తం చేశారు. నాగార్జున విశ్వవిద్యాలయానికి ఎదురుగా ఉన్న 70 ఎకరాల స్థలంలో ఆదివారం చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. సమైక్య రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏర్పడిన కొత్త ప్రభుత్వం రాజధానికి వెలుపల తొలిసారిగా నిర్వహించనున్న కార్యక్రమానికి అట్టహాసంగా ఏర్పాట్లు చేసింది. సభ నిర్వహణకు ఒక రోజు ముందుగానే ఆయా శాఖలు పనులు పూర్తిచేసి సభాస్థలిని పోలీసులకు అప్పగించాయి. సభా ప్రాంగణం పోలీసుల నిఘాలో ఉంది. పదేళ్ల తర్వాత టీడీపీకి అధికారం రావడంతో పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేపట్టాయి.
మంత్రివర్గం కూర్పుపై బాబు కసరత్తు
ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేయనున్న టీడీపీ అధినేత చంద్రబాబు మంత్రి వర్గ కూర్పుపై బిజీబిజీగా ఉన్నారు. తనతో పాటు ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రుల వివరాలు ఆదివారం దయానికల్లా గవర్నర్‌కు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు నేతలు పేర్లను ఖరారుచేసినట్లు తెలుస్తోంది. మొదటి విడతలో భాగంగా చంద్రబాబుతో పాటు 17 మందిని మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తొలి విడతలో పార్టీ సీనియర్ నేత కర్నూలు జిల్లాకు చెందిన కేఈ కృష్ణమూర్తి పేరు దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. డెప్యూటీ సీఎం రేసులో కూడా కేఈ కృష్ణమూర్తి ఉన్నారు. అలాగే యనమల రామకృష్ణుడు పేరు కూడా తొలి జాబితాలోనే ఉంటుందని సమాచారం. ఇక అనంతపురం నుంచి కాల్వ శ్రీనివాసులు, పరిటా సునీత, చిత్తూరు నుంచి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, శంకర్‌యాదవ్, ప్రకాశం నుంచి శిద్దా రాఘవరావు, గుంటూరు కోడెల శివప్రసాదరావు, పత్తిపాటి పుల్లారావు, కృష్ణా నుంచి దేవినేని ఉమా, పశ్చిమగోదావరి నుంచి చింతమనేని ప్రభాకర్, పీతల సుజాత, తూర్పుగోదావరి నుంచి నిమ్మకాయల చినరాజప్పకు మంత్రి పదవులు ఖరారయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక విశాఖ నుంచి గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు, కడప నుంచి రాజంపేట ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ సతీష్ రెడ్డిలను తీసుకునే అవకాశం ఉంది. శ్రీకాకుళం జిల్లా నుంచి కళా వెంకట్రావు, అచ్చెన్నాయుడు, గౌతు శ్యాం సుందర్ శివాజీల్లో ఒకరు ఉంటారు. విజయనగరం జిల్లానుంచి పతివాడ నారాయణస్వామి ఉండే అవకాశాలున్నాయి. గుంటూరు జిల్లాలో పోటీ తీవ్రంగా ఉంది. కోడెల శివప్రసాద్, ప్రత్తిపాటి పుల్లారావు, ధూళిపాళ్ల నరేంద్ర, యరపతినేని శ్రీనివాసరావుల్లో ఒకరికి అవకాశం ఇవ్వొచ్చు. వేణుగోపాల్‌రెడ్డి, రావెళ్ల కిషోర్‌బాబు, శ్రవణ్‌కుమార్‌ల పేర్లూ పరిశీలనకు రావొచ్చు. ప్రకాశం జిల్లానుంచి శిద్దా రాఘవరావు తొలి విడతలో ఉండనున్నారు. దామచర్ల జనార్దన్ కూడా మంత్రి పదవి కోసం ప్రయత్నిస్తున్నారు. నెల్లూరు, కడప జిల్లాలనుంచి తొలి విడతలో ప్రాతినిధ్యం ఉండకపోవచ్చని తెలుస్తోంది.
రుణమాఫీపై తొలిసంతకం
ఇదిలావుంటే ప్రమాణం చేసిన వెంటనే ఎన్నికల్లో ఇచ్చిన హావిూ మేరకు మూడు ఫైళ్లపై సంతకాలు చేయనున్నట్లు సమాచారం. రుణమాఫీపై తొలి సంతకం, బెల్టుషాపుల రద్దుపై మలి సంతకం, ఎన్టీఆర్ సుజల పథకం కింద అన్ని గ్రామాలకు తాగునీరు ఇచ్చే ఫైలుపై మూడో సంతకం చేస్తానని ఆయన తన పాదయాత్ర సమయంలోనే ప్రకటించారు. దానికి అనుగుణంగా ఇప్పుడు ప్రమాణస్వీకారం చేసే వేదికపైనే ఈ మూడు సంతకాలు చేయనున్నారని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. రుణమాఫీలో రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ రెంటినీ అమలుచేస్తానని సంతకం చేయనున్నారు. తర్వాత రుణమాఫీకి సంబంధించి విధి విధానాల రూపకల్పన కోసం ఒక కమిటీని నియమించే అవకాశాలున్నాయి. ఈ కమిటీ నివేదిక ప్రకారం మార్గదర్శకాలు రూపొందించి రుణమాఫీని అమలుచేస్తారు.
వర్షం వచ్చినా తట్టుకునేలా వేదిక ఏర్పాట్లు
వర్షం వచ్చినా ఆటంకం లేకుండా ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్యులు, ఇతర ప్రముఖులు ఆశీనులయ్యే ప్రాంతంలో రెయిన్ ప్రూఫ్ షామియానాలను ఏర్పాటు చేసారు. గాలి దుమారం వచ్చినా తట్టుకునేలా ఏర్పాట్లు చేశారు. అలాగే ఫల్డ్లైట్లు ఏర్పాటు చేశారు. దీంతో ఎక్కడి నుంచయినా వేదిక కనిపించేలా చేస్తున్నారు. 50 వేల మందికి ఈ షామియానాల కింద కుర్చీలు వేశారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఆయా రాష్ట్రాలకు చెందిన ప్రాంతీయ, జాతీయ పార్టీల నేతలు, పారిశ్రామిక వేత్తలు, పద్మశ్రీ అవార్డు గ్రహీతలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, పార్టీలో ప్రధాన పదవుల్లో ఉన్న వారికి పాసులు మంజూరు చేసాన్నారు. ప్రముఖుల గ్యాలరీల్లో కూలర్ల సౌకర్యాన్ని కల్పించారు. వేదికను ప్రమాణ స్వీకారాలు, ప్రసంగాలు, తొలి సంతకాలు ఇలా మూడు కార్యక్రమాల కోసం మూడు విభాగాలు చేశారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ముఖ్యమంత్రులు తదితరులు ప్రధాన వేదిక పైనే కూర్చుంటారు. ప్రమాణ స్వీకార వేదికపై చంద్రబాబుతో పాటు గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఉంటారు. మంత్రులు ప్రమాణ స్వీకారం కాగానే కిందకు వచ్చి కేటాయించిన గ్యాలరీలో కూర్చుంటారు. సభాస్థలిలో ప్రజలకు మజ్జిగ ప్యాకెట్లు, తాగునీరు అందించడానికి గ్యాలరీకి ఒక అధికారి, నలుగురు సిబ్బంది చొప్పున పని చేస్తారు. ప్రముఖులకు వసతుల కల్పనకు కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన 50 మంది శాఖాధిపతులను కేటాయించారు. అతిధుల సమాచారం కోసం విజయవాడ, గుంటూరులోని కలెక్టర్ క్యాంప్ కార్యాలయాల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు. ఐదారుగురు ముఖ్యమంత్రులు, ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు, 15 మంది కేంద్ర మంత్రులు, పది మంది న్యాయమూర్తులు, ప్రాంతీయ, జాతీయ పార్టీలకు ఏడెనిమిది మంది ముఖ్య నేతలు తరలి రానున్నారు. గన్నవరం విమానశ్రయంలో దిగింది మొదలుకుని సభాస్థలికి వచ్చి తిరిగి వెళ్లే వరకు వీరి భద్రతకు సంబంధించి అనుక్షణం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డీఐజీలు రామకృష్ణ, యోగానంద్ ఆయా జిల్లాల ఎస్పీలకు ఆదేశాలిస్తారు. మొత్తం 10 వేల మంది పోలీసులు బందోబస్తు చేపట్టనున్నారు. బందోబస్తు పర్యవేక్షణను సీనియర్ ఐపీఎస్ అధికారి గౌతం సవాంగ్ ఆధ్వర్యంలో ఐదుగురు డీఐజీలు, ఒక ఐజీ, 10 మంది ఎస్పీలు, 50 మంది డీఎస్పీలు చేపడతారు. బాంబు స్క్వాడ్ బృందాలు సభాస్థలికి చేరుకుని మొత్తం జ్లలెడ పడుతున్నాయి. ప్రధాన వేదికకు పుష్పాలంకరణ, విద్యుత్తు అలంకరణతో అదనపు సొబగులు అమర్చారు. ప్రజలను అలరించడానికి పార్టీ సాంస్కృతిక బృందాలతో పాటు పలువురు సినీతారలు హాజరవుతారు.
నేడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాబు ప్రమాణం మోడీ డుమ్మా




