విద్యకు అధిక ప్రాధాన్యం
పేదల సంక్షేమమే
లక్ష్యం
రాష్ట్రపతి ప్రసంగానికి మోడీ ధన్యవాదాలు
న్యూఢిల్లీ, జూన్ 11 (జనంసాక్షి) :
భారతదేశాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దుతానని, స్కామ్ ఇండియాగా పేరొందిన దేశాన్ని స్కిల్ ఇండియాగా మారుద్దామని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. దేశాభివృద్ధిలో యువత ప్రాధాన్యం ఎక్కువగా ఉండాలన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల మేరకు పేదలకు మేలు జరిగే నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంద న్నారు. ప్రభుత్వం ఉంది వారికోసమేనని అన్నా రు. ఎంతో సాహసంతో నూతన నిర్ణయాలు తీసుకోవాల్సిన తరుణం ఇది అని అన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని సమాధానం ఇచ్చారు. రాష్ట్రపతి ప్రసంగంలో పేర్కొన్న అన్ని కార్యక్ర మాల అమలుకు చిత్తశుద్ధితో కృషి చేస్తామని ప్రధాన మంత్రి నరేం ద్ర మోదీ తెలియజేశారు. లోక్‌సభలో తాను మొదటి సారి మాట్లా డుతున్నానని తప్పుగా మాట్లాడితే క్షమించాలని ఆయన పేర్కొన్నా రు. రాష్ట్రపతి ప్రసంగంపై అన్ని పార్టీల నేతల ప్రసంగాలు విన్నానని ఆయన తెలిపారు. రాష్ట్రపతి ప్రసంగం తమకు కేవలం సంప్రదా యం కాదని, స్ఫూర్తిమంత్రమని ప్రధాని
నరేంద్రమోడీ పేర్కొన్నారు. రాష్ట్రపతి తన ప్రసంగంలో చూపిన మార్గంలో చివరిదాకా కొనసాగుతామని ఆయన హావిూ ఇచ్చారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చలో భాగంగా లోక్‌సభలో మోడీ సమాధానం ఇచ్చారు. సభకు తాను కొత్తవాడినని తప్పులుంటే క్షమించాలని ఆయన పేర్కొన్నారు. సభలో ఎందరో అనుభవజ్ఞులున్నారని, ఖర్గే, ములాయం లాంటి ఎందరో సీనియర్ల ప్రసంగాలు విన్నానని ఆయన పేర్కొన్నారు. వారందిరి సలహాలు సూచనలతో అందరినీ కలుపుకుని ముందుకు వెళతానన్నారు. సభలో ఉన్న సీనియర్లంతా చర్చను శ్రద్ధగా ఆలకించారని ఆయన చెప్పారు. సుదీర్ఘకాలం తర్వాత సుస్థిర ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారని, అందుకు ప్రజలకు కృతజ్ఞుడిని అని ప్రధాన మోదీ సభలో పేర్కొన్నారు. ప్రజలు అప్పగించిన బాధ్యతను నెరవేర్చాల్సి ఉందన్నారు. భారతదేశం ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం…కానీ ఏనాడూ తన శక్తిసామర్ధ్యాలు ప్రపంచానికి తెలియజేయలేదన్నారు. అయితే ఇప్పుడు ఆ అవకాశం వచ్చిందని ప్రధాని మోదీ అన్నారు. ప్రభుత్వం పనిచేయాల్సింది కొద్ది మంది వ్యక్తుల కోసం కాదని, మెజార్టీ పేదల కోసం అని మోదీ పేర్కొన్నారు. పట్టాలు ఉంటే చాలదు.. నైపుణ్యాలు కూడా ఉండాలన్నారు. యువతకు డిగ్రీ పట్టాలే కాకుండా నైపుణ్యాలు కల్పిద్దామని చెప్పారు. పేదరికంపై పోరాడే మహత్తర ఆయుధం విద్య అని తెలిపారు. ఆ ఆయుధాన్ని మనం పేదలకు అందించాలని సూచించారు. గ్రామాల్లో సౌకర్యాలు మెరుగుపడినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. చిన్న చిన్న ప్రయోగాల ద్వారా దేశ పరిస్థితిని మార్చేయవచ్చు అని సూచించారు. శాటిలైట్ ప్రసారాల ద్వారా గ్రామాల్లో విద్యను అందించేందుకు కృషి చేస్తామన్నారు. దేశంలో ఏ వ్యక్తి ఆకలితో అలమటించరాదని ప్రధాని నరేంద్రమోడీ భావోద్వేగంగా అన్నారు. పెరిగిన ధరల కారణంగా దేశంలో ఎవరూ ఆకలితో ఉండరాదన్నారు. ధరలను తగ్గించి తీరుతామని స్పష్టం చేశారు. ధరలు తగ్గించడానికి చేయగలిగినంతా చేయాలన్నారు. సాంకేతికతను ఉపయోగిస్తే వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చవచ్చని చెప్పారు. వ్యవసాయంలో టెక్నాలజీని ప్రవేశపెడితే రైతులు లాభపడతారని పేర్కొన్నారు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను గ్రామాల్లో పెద్ద ఎత్తున నెలకొల్పాలని పిలుపునిచ్చారు. ప్రపంచం అంతటా ఇప్పుడు బయో ఫర్టిలైజర్ వినియోగం పెరిగిందన్నారు. ఈ ఉత్పత్తులకే గిరాకి ఉందన్నారు. మనదేశంలో సిక్కిం ఇందుకు ఆదర్శంగా ఉండబోతోందన్నారు. ఇక్కడ రైతులు కొండకోనల్లో ఎలాంటి ఎరువులు, పురుగుమందులు లేకుండా వ్యవసాయ ఉత్పత్తులను పండిస్తున్నారని అన్నారు. దేశం మొత్తానికి సిక్కిం ప్రేరణ కావాల్సి ఉందన్నారు. అలాగే ప్రభుత్వం కూడా అందుకు అనుగుణంగా పనిచేస్తుందన్నారు. స్వాతంత్య్ర ఉద్యమాన్ని మహాత్మాగాంధీ ప్రజల ఉద్యమంగా మలిచారని, ఆయన స్ఫూర్తితో ఇప్పుడు అభివృద్ధిని ప్రజల ఉద్యమంగా మారుద్దామని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. లోక్‌సభలో ప్రసంగిస్తున్న ఆయన స్వాతంత్య్ర పోరాటం నాడు మనం పుట్టనందున అందులో పాల్గొనలేకపోయామని, నేడు దేశసేవ కోసం జరిగే మరో ప్రజా ఉద్యమంలో అందరం పాల్గొందామన్నారు. మరో ఐదేళ్లలో మహాత్మాగాంధీ 150వ జయంతి జరుపుకోబోతున్నామని, నిష్కళంక భారత్‌ను నిర్మించి మహాత్ముడికి బహుమతిగా ఇద్దామని ప్రధాని పిలుపునిచ్చారు. 2022 నాటికి ప్రతి కుటుంబానికి సొంతింటి కల నెరవేరుద్దామన్నారు.నేడు దేశ సేవకోసం జరిగే నేటి మరో ప్రజా ఉద్యమంలో అందరం పాల్గొందామని ప్రధాని నరేంద్రమోడీ పిలుపునిచ్చారు. మహాత్ముడి స్ఫూర్తితో అభివృద్ధిని ప్రజల ఉద్యమంగా మారుద్దామని ఆయన పేర్కొన్నారు. మహిళల పట్ల గౌరవంగా వ్యవహరించాలని ప్రధాని నరేంద్రమోడీ సూచించారు. అత్యాచారాలపై సొంత విశ్లేషణ చేయొద్దని సూచనలు చేశారు. అభివద్ధిలో తమ తల్లి, చెల్లెల్ని భాగస్వాములు చేయాలంటే వారికి రక్షణ కల్పించాలన్నారు. మహిళల రక్షణ దేశ ప్రజలందరి బాధ్యత అని పేర్కొన్నారు. మహిళలపై హింసలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మహిళల గౌరవం, రక్షణకు అత్యంత ప్రాధాన్యమిస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. లోక్‌సభలో ప్రసంగిస్తూ ఆయన స్కామ్ ఇండియాగా పేరొందిన దేశాన్ని స్కిల్ ఇండియాగా మారుద్దామన్నారు. సైకిల్ మరమ్మత్తుచేసే వ్యక్తి కుమారుడు మళ్లీ అదే పని చేస్తున్నాడని, ఈ పరిస్థితి మారాలని ప్రధాని అన్నారు. ఎంతో సాహసంతో నూతన నిర్ణయాలు తీసుకోవాల్సిన తరుణం ఇదని ప్రధాని పేర్కొన్నారు. అత్యధిక యువత ఉన్న దేశంగా భారత్ అవతరించిందని, ఇంతటి యువశక్తి ప్రపంచంలో ఒక్క భారత్‌కే సొంతమని ఆయన అన్నారు. ఈ యువశక్తికి నైపుణ్యాలు అందించాల్సిన బాధ్యత నాయకుల విూద ఉందని ఆయన గుర్తుచేశారు. పేదలను పేదరికం నుంచి బయటకు తేవాల్సింది ప్రభుత్వమేనన్న ప్రధాని, పేదరికంపై పోరాడే మహత్తర ఆయుధం విద్య అని పేర్కొన్నారు. పేదప్రజలందరికీ విద్యను అందించాలని నరేంద్రమోడీ అన్నారు. పేదల సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ సదుపాయం కల్పించాలని, గ్రామాల్లో యువతకు ఉపాధి కల్పించాలన్నారు. పట్టణాల్లో ఉన్న సౌకర్యాలను గ్రామాలకు విస్తరించాలని ప్రధాని అభిప్రాయపడ్డారు. గ్రామాలకు 24 గంటలు విద్యుత్, విద్య, పరిశ్రమలు అందిస్తే ఎవరూ వలస వెళ్లరని ప్రధాని అన్నారు. సంపన్నుల పిల్లలకు ఏ సమస్యలు ఉండవన్న మోదీ పేదలు మాత్రం ప్రభుత్వం వైపే చూస్తారన్నారు. పేదలకు ప్రభుత్వమే అండగా నిలవాలని ఆయన తెలిపారు. పేదరికంపై పోరాడే ఏకైక ఆయుధం విద్య అని, పేదలందరికీ విద్యను అందించగలిగితే వారు ఎవరి మీదా ఆధారపడాల్సిన పని ఉండని ఆయన అన్నారు. గ్రామీణభారతాన్ని సమూలంగా మార్చడానికి రైతుల సంక్షేమానికి బృహత్తర కృషి జరగాలని పేర్కొన్నారు. గ్రామాలను ఆధునీకరిస్తేనే దేశాభివృద్ధి సాధ్యమని మోదీ వెల్లడించారు. వ్యవసాయం ఉత్పత్తుల మార్కెటింగ్‌కు ఐటీని ఉపయోగించుకోలేమా అని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నా…అధికార పక్షంలో ఉన్నా పేదలకు అన్నం పెట్టడమే మన లక్ష్యమని ఆయన అన్నారు. వ్యవసాయ రంగంలోకి ఆధునిక పరిజ్ఞానం తెస్తామని, రైతుల బతుకులను మార్చడం మనందరి బాధ్యత అని మోదీ తెలియజేశారు. చెరుకులో చక్కర శాతాన్ని పెంచగలిగినప్పుడు పప్పుధాన్యాల్లో ప్రొటీన్ల శాతాన్ని ఎందుకు పెంచలేమని ఆయన అన్నారు. మహిళా సాధికారతే తమ లక్ష్యమని మోదీ స్పష్టం చేశారు. ధరల పెరుగుదలను అరికడతామని, ధరల స్థిరీకరణ తమ లక్ష్యమని, ద్రవ్యోల్బణం నియంత్రిస్తామని ప్రధాని మోదీ లోక్‌సభలో పేర్కొన్నారు. ల్యాబ్‌లో జరుగున్నత ప్రయోగాలు భూమి వరకు చేరడం లేదన్నారు. మోడీ తన సుదీర్థ ప్రసంగంలో అన్ని అంశాలను స్పృషించారు. అందరినీ కలుపుకుని పోతానన్నారు. పెద్దల ఆలోచనలను స్వాగతిస్తానని చెప్పారు.





