
చెరో రూ.25 లక్షలు, ఐదెకరాల భూమి
అభినందించిన శాసనసభ
జాతీయ, తెలంగాణ జెండాలను ఎవరెస్టుపై ఎగురవేసినందుకు అభినందించిన కేసీఆర్
హైదరాబాద్, జూన్ 14 (జనంసాక్షి) :
ఎవరెస్టు శిఖరంపై తెలంగాణ ఖ్యాతిని చాట ిన గురుకుల విద్యాసంస్థల విద్యార్థులకు నజ రానా పంట పండింది. అత్యంత పిన్న వయ స్సులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి తెలంగాణ జాతి గౌరవాన్ని
ప్రపంచానికి చాటిన మాలవత్ పూర్ణ, ఆనంద్‌కుమార్‌లను శాసనసభ అభినందనలు తెలిపింది. ఈ మేరకు శనివారం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఆమోదించింది. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన పిన్న వయస్కులు పూర్ణ, ఆనంద్‌లను అభినందిస్తూ కేసీఆర్ తీర్మానం ప్రతిపాదించారు. వారిద్దరూ దేశ ప్రతిష్టను ఇనుమడింపజేశారని కొనియాడారు. ఎవరెస్ట్ శిఖరంపై జాతీయ జెండా, తెలంగాణ జెండాలను ఎగురవేసి సరికొత్త చరిత్ర సృష్టించారని ప్రశంసించారు. ప్రాణాలకు తెగించి సాహసయాత్ర చేపట్టిన ఆ ఇద్దరినీ అభినందించారు. సాహస విద్యార్థులకు కేసీఆర్ రూ.25 లక్షల చొప్పున పారితోషికం ప్రకటించారు. నిరుపేద కుటుంబానికి చెందిన వారిద్దరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. వారి కుటుంబాలకు చెరో ఐదెకరాలు వ్యవసాయ భూమితో పాటు బోరు బావులు తవ్వుకొనేందుకు, అలాగే ఏడాది పాటు వ్యవసాయం చేసేందుకు ఆర్థిక సాయాన్ని పెట్టుబడిగా అందించనున్నట్లు తెలిపారు. అలాగే, వారి వారి గ్రామాల్లో తమ ఇంట్లో మూడు అదనపు గదులు నిర్మించుకొనేందుకు ఆర్తిక సాయం చేస్తామని చెప్పారు. పూర్ణ, ఆనంద్‌లకు శిక్షణ ఇచ్చిన, వ్యక్తిగత స్థాయిలో ఎవరెస్ట్ శిఖరం అధిరోహించిన నల్లగొండ వాసి శేఖర్‌బాబుకు కూడా రూ.25 లక్షల పారితోషికం ఇవ్వనున్నట్లు తెలిపారు.
ఎవరెస్టు వీరులకు నజరానా పంట




