
రెండు రోజుల అధికార పర్యటనకు
భూటాన్ చేరుకున్న ప్రధాని
థింపూ, జూన్ 15 (జనంసాక్షి) :
భారత ప్రధాని నరేంద్రమోడీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి విదేశీ పర్యటనకు బయల్దేరి వెళ్లారు. ఆయన భూటాన్‌లో రెండు రోజుల పర్యటన కోసం ప్రత్యేక విమానంలో ఆదివారం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పయనమయ్యారు. ఆయనకు భూటాన్‌లోని పారో అంతర్జాతీయ విమానాశ్రయంలో భూటాన్ ప్రధాని షీరింగ్ తోగే ఘన స్వాగతం పలికారు. తోగేతో పాటు ఆయన మంత్రివర్గ సహచరులు, సీనియర్ అధికారులు మోడీకి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. మోడీతో పాటు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ శాఖ కార్యదర్శి సుజాతాసింగ్ భూటాన్‌లో పర్యటిస్తారు. రెండు రోజుల పర్యటనలో మోడీ భూటాన్ రాజు జిగ్మే ఖేసార్ నాంగ్యాల్ వాంగ్‌చుక్, ప్రధాని తోగేలతో సమావేశం కానున్నారు. హెజోలో నిర్మించి భూటాన్ సుప్రీం కోర్టు నూతన భవనాన్ని మోడీ ప్రారంభిస్తారు. భారత ప్రభుత్వం సమకూర్చిన నిధులతో ఈ భవణాన్ని నిర్మించారు. మోడీ గౌరవార్థం భూటాన్ ప్రధాని తోగే ఆయన రాజప్రసాదంలో విందు ఏర్పాటు చేశారు. భూటాన్ పార్లమెంట్ సమావేశాలనుద్దేశించి మోడీ ప్రసంగిస్తారు. సోమవారం భూటాన్-భారత సంయుక్తాధ్వర్యంలో నిర్మించే 600 మెగావాట్ల జల విద్యుత్ కేంద్ర నిర్మాణానికి ఖోలోంగుచు వద్ద మోడీ శంకుస్థాపన చేస్తారు. సట్లెజ్ నదిపై విద్యుత్ నిగమ్, డక్ గ్రీన్ పవర్ కార్పొరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ జల విద్యుత్ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం ఏడాది చివరికల్లా పూర్తవుందని అధికారులు చెప్తున్నారు. భూటాన్ రాజు, ప్రధాని మోడీ గౌరవార్థం సోమవారం ఆయన ప్రతినిధి బృందానికి విందు ఏర్పాటు చేశారు. అనంతరం మోడీతో పాటు భారత ప్రతినిధి బృందం న్యూఢిల్లీకి బయల్దేరి వస్తుంది.
భూటాన్‌లో మోడీకి ఘన స్వాగతం




