Tuesday, 3 November 2026

ఆ రెండు ఆంధ్ర చానెళ్లను నిలిపివేశాం

three
తెలంగాణాలో నిలిచిపోయిన ప్రసారాలు
హైదరాబాద్‌, జూన్‌ 16 (జనంసాక్షి) :
తెలంగాణ శాసనసభ్యులను కించపరిచేలా కథనాలు ప్రసారం చేసిన టీవీ 9, ఏబీఎన్‌ – ఆంధ్రజ్యోతి చానెళ్ల ప్రసారాలను తెలంగాణ ప్రాంతంలో నిలిపివేసినట్లు ఎం ఎస్‌వోల సంఘం అధ్యక్షుడు సుభాష్‌రెడ్డి తెలిపారు. సోమవారం సికింద్రాబాద్‌లో
నిర్వహించిన ఎంఎస్‌వోల సమావేశంలో ఈమేరకు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. చానెళ్ల ప్రసారాలను బంద్‌ చేయాలని ఆయన ఆదివారమే ఎంఎస్‌వోలను ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అన్ని జిల్లాల బాధ్యులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. తెలంగాణ ప్రజలపై, ఉద్యమంపై ఇన్నాళ్లు విషం చిమ్మిన చానెళ్లు, తాజాగా శాసనసభ్యులను, శాసనసభ ప్రతిష్టను దిగజార్చేలా దారుణ వ్యాఖ్యానాలతో కథనాలు ప్రసారం చేశారు. ఈ నేపథ్యంలో ఆ రెండు చానెళ్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ శాసనసభ, శాసనమండలి స్పీకర్‌, చైర్మన్లను కోరాయి. ఈ నేపథ్యంలోనే ఎంఎస్‌వోలు ఈ నిర్ణయం తీసుకున్నారు. సుభాష్‌రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వాన్ని నెగిటివ్‌ కోణంలో చూపించడానికి ఆంధ్రజ్యోతి శథవిధాల ప్రయత్నిస్తోందని, పనిగట్టుకుని విషం చిమ్ముతుందని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు, ప్రజాప్రతినిధులను అవమానించి, వారి గౌరవానికి భంగం వాటిల్లేలా చేసే ఏ మీడియానైనా వదలబోమని ఎంఎస్‌వోలు తేల్చిచెప్పారు. క్షమాపణలు చెప్పినంత మాత్రాన తప్పును సరిదిద్దుకోలేరని, ఎవరేం చేస్తారులే అనే వైఖరితో ఎవరు ఇలాంటి చర్యలకు పాల్పడినా తాము చూస్తూ ఊరుకోబోమని ఆయన హెచ్చరించారు. భవిష్యత్‌లో ఏ ఛానెల్‌ అయినా తెలంగాణ భాషను, యాసను కించపరిచినా ఇదే గతి పడుతుందని పచ్చరించారు. ఆంధ్రా మీడియా తమ విధానాలను మార్చుకోవాలని ఎంఎస్‌వోలు సూచించారు. తెలంగాణ ప్రజల విధానాలు, సంస్కృతి గురించి చర్చా కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి అన్ని ఛానెళ్లను ఆహ్వానిస్తామని చెప్పారు. ఆంధ్రా మీడియా కుట్రలకు నిరసనగా ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి టీవీ9, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ఛానెళ్ల ప్రసారాలు నిలిపివేశామని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *