
ఆరోగ్య వర్సిటీగా మలుస్తాం
పేదలందరికీ ప్రభుత్వ వైద్యం
డెప్యూటీ సీఎం రాజయ్య
హైదరాబాద్, జూన్ 17 (జనంసాక్షి) :
రెండు రోజుల్లో బీబీ నగర్‌లోని నిమ్స్ వైద్య విజ్ఞాన సంస్థలో సేవలు ప్రారంభిస్తామని ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మం త్రి డాక్టర్ రాజయ్య అన్నారు. బీబీనగర్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో రాజయ్య మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహిం చారు. ఆస్ప త్రిలో రోగులకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. పలువురు
రోగులను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిమ్స్‌ను ఆరోగ్యవర్సిటీగా తీర్చిదిద్దుతామని అన్నారు. ఆరోగ్యానికి తాము ప్రథమ ప్రాథాన్యం ఇస్తామన్నారు. మరో రెండు నెలల్లో నిమ్స్ పూర్తిస్థాయికి తీసుకుని వస్తామన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో క్షేత్రస్థాయిలో జరిగే అవకతవకలపై, సమస్యలపై వైద్యుడిగా తనకు సమగ్రమైన అవగాహన ఉందని, ఆస్పత్రుల్లో ప్రతి విషయాన్ని క్షుణ్నంగా పరిశీలించి పరిష్కరిస్తానని ఆయన అన్నారు. అనంతరం నగరంలోని ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రి వైద్యుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సన్మానోత్సవానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు కేబినెట్‌లో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటారని అన్నారు. త్వరలో నిర్వహించబోయే బడ్జెట్ సమావేశాల్లో వైద్య రంగానికి పెద్దపీట వేస్తామన్నారు. సంక్షేమ పథకాలకు సంబంధించి రూ.లక్ష కోట్టు చేయాలనే సంకల్పంతో తమ ప్రభుత్వం ఉందన్నారు. సీమాంధ్రలో చాలా కేన్సర్ ఆస్పత్రులు ఉన్నాయని, తెలంగాణాలో మాత్రం ప్రభుత్వరంగంలో ఉన్న ఒకే ఒక్క కేన్సర్ ఆస్పత్రి ఎంఎన్‌జే అని తెలిపారు. ఈ ఆస్పత్రిని కాపాడుకుందామని పిలుపునిచ్చారు. ఇక్కడి ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం నాయకులు డాక్టర్ పి.రమేశ్, డాక్టర్ లాలూప్రసాద్ రాథోడ్, ఎంఎన్‌జే ఆస్పత్రి డైరెక్టర్ కన్నన్ టీఆర్‌ఎస్ నాయకుడు గజ్జెల నగేశ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైద్యులు, సిబ్బంది రాజయ్యను ఘనంగా సత్కరించారు.
రెండు రోజుల్లో బీబీ నగర్ నిమ్స్ సేవలు




