Tuesday, 3 November 2026

నేటి నుంచి ఏపీ అసెంబ్లీ

assembly
హైదరాబాద్‌, జూన్‌ 18 (జనంసాక్షి) :
విభజన అనంతరం ఆంధప్రదేశ్‌ తొలి శాసనసభ సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. వారం రోజులపాటు పరిమిత సంఖ్యలో సమావేశాలు జరుగనున్నాయి. ఇందుకు భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. పదేళ్ల తరవాత చంద్రబాబు నాయుడు సిఎంగా తొలి అసెంబ్లీలోకి అడుగుపెడుతున్నారు. వైకాపా నేత జగన్‌ ప్రతిపక్షనేతగా ప్రవేశిస్తున్నారు. ఇక బీజేపీతో కలసి తొలిసారిగా సంకీర్ణ ప్రభుత్వం కొలువుదీరింది. కాంగ్రెస్‌కు ఒక్క సభ్యుడు కూడా లేకుండా తొలి సమావేవాలు జరగడం మరో విశేషం. ఇన్ని విశేషాల మధ్య అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 175 మంది సభ్యులున్న కొత్త అసెంబ్లీగా ఆంధ్రప్రదేశ్‌ అవతరించింది. ఇక గెలిచిన తరవాత తంగిరాల ప్రభాకర్‌ మృతి చెందగా గెలుపునకు ముందే ఆళ్లగడ్డ నుంచి బరిలో ఉన్న శోభానాగిరెడ్డి మృతి చెందారు. హైదరాబాద్‌ పాత అసెంబ్లీ భవనం ఆంద్రపద్రేశ్‌కు కేటాయించారు. పాత అసెంబ్లీ హాల్‌లో ఆంధప్రదేశ్‌ అసెంబ్లీ కొలువు తీరనుండడంతో పోలీసులు భారీగా ఏర్పాట్లు చేశారు. 19న మొదటి రోజు ప్రమాణస్వీకారాలు, అనంతరం నందిగామ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకర్‌ మృతిపై సంతాప తీర్మానం ఉంటాయని శాసనసభవ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు వెల్లడించారు. 20న స్పీకర్‌ ఎన్నిక, 21న ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగం ఉంటుంది. 22న ఆదివారం సెలవు తరవాత 23, 24న గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతారని వివరించారు. ఆంధప్రదేశ్‌ శాసనమండలి సమావేశాలు ఈ నెల 23, 24 తేదీల్లో ఉంటాయని చెప్పారు. ప్రస్తుత సమావేశాలకు తాత్కాలిక ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ.. కొత్త స్పీకర్‌ బాధ్యతలు చేపట్టిన తరువాత శాశ్వత ప్రాతిపదికన భద్రతా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ సమావేశాల్లో సందర్శకులకు అవకాశం లేకుండా చేశారు. అలాగే మీడియాకు పరిమిత సంఖ్యలో పాస్‌లు జారీ చేశారు. పాత అసెంబ్లీ భవనంలో 300 మందికి పైగా సభ్యులు కూర్చునేందుకు ఏర్పాట్లు ఉన్నప్పటికీ సందర్శకుల గ్యాలరీలో చాలా తక్కువ మందికే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమావేశాలకు సందర్శకులను అనుమతించరాదని నిర్ణయించారు. తొలిరోజు ప్రొటెం స్పీకర్‌ ఎన్నిక తరవాత సభ్యుల ప్రమాణం జరుగుతంది. తరవాత మరునాడు స్పీకర్‌ ఎన్నిక జరుగనుంది. ఆంధప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రులు, ఎమ్మెల్యేలు గేట్‌-2 ద్వారా అసెంబ్లీలోకి ప్రవేశించేందుకు ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో టిడిపి శాసనసభాపక్ష కార్యాలయంగా ఉన్న భవనాన్ని ముఖ్యమంత్రి కార్యాలయంగా మార్చారు. ఆయన అక్కడి నుంచే సమావేశాలు నిర్వహించనున్న పాత అసెంబ్లీ భవనంలోకి వెళ్లేందుకు ప్రత్యేక మార్గాన్ని ఏర్పాటు చేశారు. మహాత్మాగాంధీ విగ్రహం వెనుకభాగంలో ఉండే పోర్టికో వైపుగా మంత్రులు, ఎమ్మెల్యేలు ఆ భవనంలోకి వెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. పాత డెప్యూటీ స్పీకర్‌ కార్యాలయం, పాత సీఎల్పీ కార్యాలయం వైపు ఉన్న ద్వారాలనూ సభ్యుల రాకకు వినియోగించనున్నారు. పాత ప్రభుత్వ చీఫ్‌విప్‌ కార్యాలయం నుంచి పాత అసెంబ్లీ కార్యదర్శి ఛాంబర్‌ మధ్య భాగంలో ఆంధప్రదేశ్‌ శాసనసభ ‘ఇన్నర్‌ లాబీ’ ఏర్పాటు చేశారు. సభ్యుల లాంజ్‌ను యథావిధిగా వినియోగించనున్నారు. సమావేశాల ఏర్పాట్లపై మంగళవారం అక్కడే కమిటీ హాలులో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఈమేరకు నిర్ణయించారు. అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ఆధ్వర్యంలో ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆంధప్రదేశ్‌ డీజీపీ జేవీ రాముడు, అసెంబ్లీ ఇన్‌ఛార్జి కార్యదర్శి కె.సత్యనారాయణరావు, శాంతిభద్రతల అదనపు డీజీ జితేందర్‌, హైదరాబాద్‌ నగర అదనపు కమిషనర్‌(కో ఆర్డినేషన్‌) అంజనీ కుమార్‌, ట్రాఫిక్‌ అదనపు కమిషనర్‌ సురేందర్‌బాబు, ఇతర ఉన్నతాధికారులు మల్లారెడ్డి, కమలాసన్‌రెడ్డి తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో 294 మంది ఎమ్మెల్యేలున్నపుడే వాహనాల పార్కింగ్‌కు ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో.. ప్రస్తుతం 175 మంది సభ్యులున్న ఆంధప్రదేశ్‌ శాసనసభ సమావేశాల సందర్భంగా పార్కింగ్‌కు ఎలాంటి ఇబ్బంది లేదని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. తెలంగాణ, ఆంధప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు ఒకేసారి నిర్వహించినప్పుడు మాత్రమే కొంత మేర ఇబ్బందులు ఉండొచ్చనే అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది. అలాంటప్పుడు ఏం చేయాలనేది కొత్త స్పీకర్‌ వచ్చాక నిర్ణయించాలని తేల్చారు. ప్రస్తుతానికి పెద్దగా ఇబ్బంది లేకున్నా రానున్న రోజుల్లో ఎలా అన్నది ఆలోచన చేస్తారు.
నేటి నుంచి ప్రారంభమయ్యే ఏపీ శాసనసభ సమావేశాలకు పూర్తిస్థాయి భద్రత తెలంగాణ పోలీసులదే కల్పించడం గమనార్హం. ఇందుకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ రాముడు తెలంగాణాకు చెందిన పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అసెంబ్లీ సమావేశాలు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నందున ఆ రాష్ట్ర పోలీసులే భద్రతా ఏర్పాట్లు చేస్తారని, అవసరమైతే తాము సహకరిస్తామని డీజీపీ పేర్కొన్నారు. 19 నుంచి ఐదు రోజులపాటు ఈ సమావేశాలు జరుగుతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *