Tuesday, 3 November 2026

చార్జీల వడ్డనపై మిన్నంటిన నిరసనలు

train
భరించక తప్పదన్న సర్కారు
న్యూఢిల్లీ, జూన్‌ 21 (జనంసాక్షి) :
రైల్వే చార్జీల పెంపుపై దేశవ్యాప్తంగా తీవ్ర స్థా యిలో నిరసనలు వ్యక్తమయ్యాయి. గతంలో ఎన్నడూ లేని రీతిలో భారీగా చార్జీలు పెం చడం పై ప్రజలు, పార్టీల నుంచి విమర్శలు వెల్లు వెత్తు తున్నాయి. ఎన్డీయే
భాగస్వామ్య పక్షాలతో పాటు విపక్షాలు కూడా పెంచిన చార్జీలను ఉపసంహరించాలని డిమాండ్‌ చేశాయి. అయితే, చార్జీల పెంపును ప్రభుత్వం సమర్థించుకుంది. పదేళ్లలో అస్తవ్యస్తంగా మారిన రైల్వేను పటిష్టం చేసేందుకు చార్జీలు పెంపు తప్పదని పేర్కొంది. రైల్వే చార్జీల పెంపును నిరసిస్తూ కాంగ్రెస్‌ పార్టీ ఢిల్లీలో భారీ ఆందోళన చేపట్టింది. పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వ నిర్ణయంపై నిరసన వ్యక్తం చేశారు. తక్షణమే చార్జీలు తగ్గించాలని డిమాండ్‌ చేశారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్‌కేనన్లు ఉపయోగించారు. మరోవైపు, లోక్‌సభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే ప్రభుత్వంపై మండిపడ్డారు. మంచి రోజులు తెస్తామని అధికారంలోకి వచ్చిన బీజేపీ తెస్తామన్న మంచి రోజులు ఇవేనా? అని ప్రశ్నించారు. ప్రజలను మభ్యపెట్టి అధికారం చేపట్టిన బీజేపీ నేతలు వారిపై పెనుభారం మోపారని విమర్శించారు. డీఎంకే, అన్నాడీఎంకేలతో పాటు బీజేపీ మిత్రపక్షాలైన డీఎండీకే, ఎండీఏకే కూడా రైలు చార్జీల పెంపును తీవ్రంగా తప్పుబట్టాయి. తక్షణమే పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించాలని డిమాండ్‌ చేశాయి. యూపీఏ ప్రభుత్వ తప్పుడు విధానాలను బీజేపీ ప్రభుత్వం కొనసాగిస్తోందని డీఎంకే అధినేత కరుణానిధి నిప్పులు చెరిగారు. కీలక అంశాలపై కాంగ్రెస్‌, బీజేపీకి పెద్ద తేడా లేదని విమర్శించారు. బీజేపీ అధికారంలోకి రాగానే డీజిల్‌ ధర పెంచారని, తాజాగా రైల్వే చార్జీలు పెంచారని మండిపడ్డారు. ‘గత ప్రభుత్వ తప్పుడు విధానాలను సరిచేస్తామని అధికారంలోకి వచ్చిన బీజేపీ.. హుటాహుటిన 14.2 శాతం మేర రైల్వే చార్జీలు పెంచి పేద, మధ్య తరగతిపై పెనుభారం మోపిందని’ ధ్వజమెత్తారు. యూపీఏ తప్పుడు ఆర్థిక విధానాల వల్ల ఇంధన, నిత్యావసర ధరలు పెరిగిపోయాయని డీఎండీకే చీఫ్‌ విజయ్‌కాంత్‌ అన్నారు. రైల్వే చార్జీలు పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని కేంద్రం తక్షణమే వెనక్కు తీసుకోవాలని ఆయన కోరారు. ఎండీఎంకే అధినేత వైకో కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టారు.
ఇదిలా ఉంటే, రైల్వే చార్జీల పెంపును ప్రభుత్వం సమర్థించుకుంది. చార్జీలు పెంచాలన్న గత ప్రభుత్వ నిర్ణయాన్నే తాము అమలు చేస్తున్నామని పేర్కొంది. కష్టమైన నిర్ణయం అయినప్పటికీ రైల్వే మంత్రి సరైన నిర్ణయం తీసుకున్నారని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ వ్యాఖ్యానించారు. చార్జీల పెంపును సమర్థిస్తూ.. ప్రపంచ రైల్వేల స్థాయికి భారత రైల్వే ఎదగాలా.. వద్దా? అన్నది దేశం నిర్ణయించాల్సిన సమయమన్నారు. ప్రజలకు మెరుగైన ప్రయాణం అందించేందుకోసం రైల్వే చార్జీలు పెంచాల్సి వచ్చిందని మరో మంత్రి ప్రకాశ్‌ జగదేకర్‌ తెలిపారు. ‘రైల్వేలో వసతులు దారుణంగా ఉన్నాయి. మంచి వసతులు, భద్రత కావాలని ప్రయాణికులు కోరుకుంటున్నారు. అందుకనుగుణంగానే ప్రజలకు భద్రత, మంచి సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతోనే నిర్ణయం తీసుకున్నాం. భద్రత లేకుంటే రవాణా వ్యవస్థ స్తంభించిపోతుందని’ ఆయన తెలిపారు. పదేళ్ల పాటు అస్తవ్యస్తమైన రైల్వేను పునరుద్ధరించేందుకే చార్జీల పెంపు నిర్ణయమని చెప్పారు. అయినా చార్జీలు పెంచాలన్న నిర్ణయం గత ప్రభుత్వానిదని,, దాన్నే తాము అమలు చేశామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *