
సిమ్లా, జూన్ 22 (జనంసాక్షి) :
బియాస్ నదిలో మరో నాలుగు మృతదేహాలు లభ్యమయ్యాయి. దీంతో ఇప్పటి వరకు లభ్యమైన మృతదేహాల సంఖ్య 17కు చేరుకుంది. మరో ఏడుగురి ఆచూకీ తెలియాల్సి ఉంది. మరోవైపు గల్లంతైన విద్యార్థుల మృతదేహాల కోసం ముమ్మరంగా గాలింపు కొనసాగుతోంది. ప్రమాదం జరిగిన తర్వాత మొదటి వారంలో రోజుల్లో కేవలం ఏడు మృతదేహాలు మాత్రమే లభ్యమవగా ఆదివారం ఒక్కరోజే నాలుగు మృతదేహాలు లభ్యమయ్యాయి. లభ్యమైన మృతదేహాలు హైదరాబాద్‌లోని నల్లకుంటకు చెందిన రుత్విక్, వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన పరమేశ్వర్, ఖమ్మం జిల్లాకు చెందిన కిరణ్, వరంగల్ నగరంలోని గిర్మాజీపేటకు చెందిన మిట్టపల్లి అఖిల్‌గా గుర్తించారు. వారి మృతదేహాలు సోమవారం ఉదయానికల్లా హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్నాయి. అక్కడి నుంచి వారి నివాసాలకు ప్రత్యేక వాహనాల్లో తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మరోవైపు శనివారం వరకు మండిలో సహాయక చర్యలను పర్యవేక్షించిన రవాణా శాఖ మంత్రి పి. మహేందర్‌రెడ్డి ఆదివారం హైదరాబాద్‌కు చేరుకున్నారు. అక్కడ చేపట్టిన సహాయక చర్యలపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావుకు ఆయన నివేదిక అందజేశారు. ప్రమాదానికి లార్జీ డ్యామ్ అధికారులతో పాటు వీఎన్‌ఆర్ విజ్ఞాన్ జ్యోతి కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యం కూడా కారణమని, ఆ కళాశాలపై చర్యలు తీసుకోవాలని మహేందర్‌రెడ్డి నివేదికలో పేర్కొన్నారు. మరోవైపు ప్రభుత్వం తరపున మండీలో సహాయక చర్యలను పర్యవేక్షించడానికి అటవీ శాఖ మంత్రి జోగు రామన్న ఆదివారం సిమ్లాకు చేరుకున్నారు. అక్కడి నుంచి మండికి సాయంత్రం చేరుకున్నారు.
బియాస్ నదిలో మరో నాలుగు మృతదేహాలు లభ్యం




