Tuesday, 3 November 2026

సత్యం కుంభకోణంపై విచారణ పూర్తి

jail
హైదరాబాద్‌, జూన్‌ 23 (జనంసాక్షి) :
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సత్యం కుంభకోణం కేసుపై సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణ ముగిసింది. తీర్పును రిజర్వ్‌ చేసిన న్యాయస్థానం.. తీర్పు ఎప్పుడు వెల్లడించేది ఈ నెల 26న ప్రకటించనున్నట్లు సోమవారం తెలిపింది. దాదాపు ఐదున్నర సంవత్సరాల విచారణ అనంతరం త్వరలో తీర్పు వెలువరిచనుంది. సత్యం కుంభకోణం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తప్పుడు పత్రాలతో వేలాది కోట్ల రూపాయలను పోగేసుకున్న సంస్థ.. చివరకు చేతులెత్తేసింది. రూ.14 వేల కోట్ల మేర మోసం చేశారని తేలింది. ప్రధాన నిందితుడైన బి.రామలింగరాజుతో పాటు మరి కొందరిని న్యాయస్థానం ఇప్పటికే దోషులుగా నిర్ధారించింది. బి.రామారాజు, మాజీ సీఎఫ్‌ఓ వడ్లమాని శ్రీనివాస్‌, ఆడిటర్స్‌ సుబ్రమణ్య గోపాలకృష్ణన్‌, టి.శ్రీనివాస్‌, బి.సూర్యనారాయణ రాజు, జి.రామకృష్ణ, వెంకటపతిరాజు, శ్రీశైలం, వీఎస్‌ ప్రభాకర్‌ గుప్తాలను నిందితులుగా చేర్చింది. 3,038 పత్రాలను పరిశీలించిన కోర్టు 216 మంది సాక్షులను విచారించింది. సుదీర్ఘ విచారణ అనంతరం కోర్టు తీర్పును రిజర్వ్‌ చేసింది. గత వారమే విచారణ ముగించిన న్యాయస్థానం తుది తీర్పు వెల్లడించేందుకు ఈ నెల 26న ముహూర్తం ఖరారు చేయనుంది. ప్రత్యేక న్యాయమూర్తి బీవీఎల్‌ఎన్‌ చక్రవర్తి తీర్పు వెలువరించనున్నారు. దేశంలోనే అతిపెద్ద కుంభకోణంగా సత్యం కుంభకోణం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తప్పుడు అకౌంట్లు, ఫోర్జరీ ధ్రువపత్రాలతో లాభాలు పొందుతున్నట్లు చూపిన రామలింగరాజు వేల కోట్ల రూపాయాలను వెనుకేసుకున్నారు. ఈ కుంభకోణం 7 జనవరి 2009న వెలుగులోకి వచ్చింది. కుంభకోణం వెలుగులోకి వచ్చిన రెండ్రోజులకు సీఐడీ అధికారులు రామలింగరాజు సోదరులు ఇద్దరిని అరెస్టు చేసింది. అదే సంవత్సరం ఫిబ్రవరిలో సీఐడీ నుంచి కేసును సీబీఐకి బదిలీ చేశారు. 2009 ఏప్రిల్‌, నవంబర్‌లలో, అలాగే 2010 జనవరిలో మూడు చార్జిషీట్లను సీబీఐ దాఖలు చేసింది. మోసం, నేరపూరిత కుట్ర, ఫోర్జరీ, నమ్మకద్రోహం తదితర పలు సెక్షన్ల కింద అభియోగాలు మోపింది. అలాగే, ఐటీ చట్టం కింద కూడా పలు అభియోగాలు నమోదయ్యాయి. తాను చేసిన జిమ్మిక్కులను విచారణ సందర్భంగా రాజు సీబీఐ ఎదుట వివరించారు. చివరకు నష్టాల్లో కూరుకుపోయిన సత్యం కంప్యూటర్స్‌ను టెక్‌ మహేంద్ర కొనుగోలు చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *