Tuesday, 3 November 2026

నల్లకోటీశ్వరుల జాబితా ఇవ్వండి

ubs
స్విస్‌ బ్యాంకుకు కేంద్రం లేఖ
న్యూఢిల్లీ, జూన్‌ 23 (జనంసాక్షి) :
నల్లధనంపై స్విట్టర్లాండ్‌ నుంచి ఎలాంటి సమాచారం రాలేదని కేంద్ర ప్రభుత్వం సోమవారం వెల్లడించింది. నల్లధనంపై వివరాలు ఇవ్వాలని స్విట్జర్లాండ్‌కు లేఖ రాస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరున్‌ జైట్లీ ప్రకటిం చారు. స్విస్‌ బ్యాంకుల్లో డబ్బు దాచిన వారి సమగ్ర వివరాలు, పూర్తి సమాచారం కావాలని లేఖలో కోర నున్నట్లు చెప్పారు. నల్లధనానికి సంబంధించి వివరాలు సేకరించామని, దాన్ని భారత్‌కు
అందజేసినట్లు స్విస్‌ ప్రభుత్వం వెల్లడించినట్లు ఆదివారం వార్తలొచ్చాయి. స్విస్‌ బ్యాంకుల్లో భారతీయులు దాచుకున్న డబ్బుకు సంబంధించిన వివరాలు సేకరించామని, దీన్ని భారత్‌తో పంచుకొంటామని పేరు చెప్పడానికి ఇష్టపడని స్విట్జర్లాండ్‌ ప్రభుత్వ అధికారులు వెల్లడించిన తర్వాతి రోజే… తమకు ఎలాంటి సమాచారం అందలేదని జైట్లీ తెలిపారు. తమ ప్రభుత్వానికి అధికారికంగా ఇప్పటివరూ ఎలాంటి సమాచారం రాలేదన్నారు. ‘స్విస్‌ అధికార వర్గాలు, భారత ప్రభుత్వం మధ్య పరస్పర సహకారం ఉంటేనే మంచి ఫలితాలు వస్తాయి. స్విస్‌ అధికారులు వెల్లడించిన సమాచారాన్ని తమకు ఇవ్వాలని ఈరోజు లేఖ రాశామని’ జైట్లీ చెప్పారు. అక్కడి బ్యాంకుల్లో భారతీయుల ఖాతాలకు చెందిన సమాచారాన్ని భారత్‌కు అందించేందుకు స్విస్‌ అధికారులు యోచిస్తున్నారని విూడియాలో రావడం తాను కూడా చూశానని జైట్లీ చెప్పారు. స్విస్‌ బ్యాంకుల్లో కోట్ల కొద్ది భారతీయుల నల్లధనం మూలుగుతోంది. పన్నులు ఎగవేసేందుకు, అక్రమ మార్గంలో సంపాదించిన డబ్బును గుట్టుగా విదేశాలకు తరలించేస్తున్నారు. భారతీయులకు చెందిన అక్రమ సంపాదనలో రెండింట్లో మూడో వంతు స్విట్జర్లాండ్‌లోని రెండు బ్యాంకుల్లో ఉంది. స్విట్జర్లాండ్‌ జాతీయ బ్యాంక్‌ (ఎస్‌ఎన్‌బీ) తాజా గణాంకాల ప్రకారం.. స్విస్‌ ఖాతాల్లో భారతీయుల సంపద 2013 కంటే ఈ ఏడాది 43 శాతం పెరిగిందని.. ఇది 14 వేల కోట్ల మేరకు ఉంటుందని వెల్లడైంది. ఇది భారతీయులతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు, ట్రస్టుల పేరిట ఉందని తేలింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *