
అసెంబ్లీ ప్రాంగణాలపై స్పీకర్ల మధ్య చర్చ
హైదరాబాద్, జూన్ 26 (జనంసాక్షి) :ఉమ్మడి రాష్ట్రం రెండుగా విడిపో యిన నేపథ్యంలో రెండు రాష్ట్రాల శాసనసభలు ఒకే చోట ఉండటం మంచిది కాదని ఇరు రాష్ట్రాల స్పీకర్లు అభిప్రాయపడ్డారు. ఆంధప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అసెంబ్లీలు ఒకే ప్రాంగణంలో ఉండడం సరికాదని తెలంగాణ శాసన సభాపతి మధుసూదనాచారి అన్నారు. ఒకేచోట ఉంటే సమావేశాల నిర్వహణ ఇబ్బందికరంగా ఉండగలదని ఆయన పేర్కొన్నారు. శాసనసభ కమిటీ హాలులో గురువారం రెండు రాష్ట్రాల సభాపతులు సమావేశమయ్యారు. బ్జడెట్ సమావేశాలకు ముందే దీనిపై నిర్ణయం తీసుకోవాలని సభాపతులు అభిప్రాయపడినట్లు సమాచారం. అయితే ప్రస్తుత జూబ్లీ హాలులో ఉన్న తెలంగాణ మండలిని పాత అసెంబ్లీకి మార్చి మొత్తం జూబ్లీహాలును ఆంద్రప్రదేశ్ అసెంబ్లీకి కేటాయించే ప్రతిపాదనను మధుసూధనాచారి చేశారని సమాచారం. దీనికి ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కోడెల కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. జులై మొదటి వారంలో మరోసారి భేటీ కావాలని సభాపతులు నిర్ణయించారు. తెలంగాణ, ఆంధప్రదేశ్ రాష్ట్రాల స్పీకర్ల మధ్య అసెంబ్లీలో జరిగిన భేటీలో పలు అంశాలను చర్చించారు. భేటీలో అధికారిక భవనాల విభజన తదితర అంశాలపై స్పీకర్లు చర్చించారు. ఒకే ప్రాంగణంలో రెండు అసెంబ్లీలు ఉంటే ఇబ్బందులు తలెత్తుతాయని తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారి అన్నారు. ఏపీ అసెంబ్లీ జూబ్లీహాల్‌లో ఉంటే మంచిదన్నారు. ఈ ప్రతిపాదనపై ఏపీ స్పీకర్ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. భవనాల విభజనపై మరోసారి భేటీకావాలని ఇరువురు స్పీకర్లు నిర్ణయించారు.
మీది.. మాదీ వేరుంటేనే మంచిది




