సంగారెడ్డి : తెలంగాణ పట్ల విషం చిమ్ముతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీతో ఎలా చేతులు కలిపారని అధికార తెరాస, కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించింది. తెలంగాణ రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు శనివారం మెదక్ జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో మీడియాతో మాట్లాడుతూ జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికల్లో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు జుగుప్సాకరమైన పొత్తులకు తెర లేపాయని విమర్శించారు. తెలంగాణపై విషం చిమ్ముతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఎలా చేతులు కలుపుతారని ప్రశ్నించారు. పదవుల కోసం కాంగ్రెస్ పార్టీతో చేతులు ఎందుకు కలపాల్సి వచ్చిందో చంద్రబాబు నాయుడు చెప్పాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు పిపిఏల రద్దు పేరిట తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.తెలంగాణ రాష్ట్రంలో తెరాస ఏకపక్షంగా జిల్లా పరిషత్ చైర్మన్ పదవులను గెలుచుకుందని హరీశ్ రావు అన్నారు. బంగారు తెలంగాణ కోసమే పలువురు నాయకులు తమ పార్టీలోకి వచ్చారని తెలిపారు. కాగా, తెలంగాణలోని వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, మహబూబ్నగర్, కరీంనగర్ జిల్లాల జడ్పీ ఛైర్మన్ పదవులను టిఆర్ఎస్ దక్కించుకోగా, నల్గొండ జడ్పీ ఛైర్మన్ పదవిని కాంగ్రెస్ దక్కించుకుంది. కోరం లేక కారణంగా రంగారెడ్డి జడ్పీ ఛైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. హైకోర్టు స్టే విధించడంతో ఖమ్మం జడ్పీ ఛైర్మన్ ఎన్నిక నిలిచిపోయింది.