Tuesday, 3 November 2026

వీరాభిమానికి పిలిచి ఉద్యోగమిచ్చిన ధోనీ

ధోనీ ముంబై: భారత క్రికెట్ సారథి మహేంద్ర సింగ్ ఓ అభిమానికి అండగా నిలిచాడు. అన్నీ కోల్పోయిన ఓ అభిమానికి ధోనీ పిలిచి మరీ ఉద్యోగం ఇచ్చాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సహరాన్‌పూర్‌కు చెందిన రవీంద్ర కుమార్ సైనీకి ధోనీ అంటే పిచ్చి అభిమానం. ప్రతి ఏడాది ధోనీ జన్మదినం రోజు అతను గ్రాండ్‌గా పార్టీలిస్తాడు. 2009లో ధోనీ జన్మదినం సందర్భంగా ఏకంగా రూ.50 వేలు ఖర్చుపెట్టాడు. తాను కూడబెట్టిన రూ.20 వేలకు తోడు భూమిని తాకట్టు పెట్టి మరో రూ.30 వేలు కలిపి 250 మంది అతిథులను ఆహ్వానించి ఆడంబరంగా వేడుకలు నిర్వహించాడు. ఈ ఖర్చులు చూసిన అతని కుటుంబం సైనీని పట్టించుకోవడం మానేసిందట. తనకున్న ఆడియో సీడీల షాపునూ అమ్మేశాడు. చివరికి 2010లో ధోనీ స్వస్థలం రాంచీకి వచ్చేశాడు. అక్కడే రోడ్డు పక్కన హోటళ్ళలో పని చేస్తూ పొట్టపోసుకోసాగాడు. అయినా, ప్రతి సంవత్సరం తన అభిమాన క్రికెటర్ బర్త్ డే వేడుకలు నిర్వహించడం మాత్రం మానలేదు. చివరికి అతడి అభిమానాన్ని గుర్తించిన ధోనీ తన 32వ జన్మదినం సందర్భంగా అతడికి ఉద్యోగమివ్వాలని నిర్ణయించాడు. శనివారం సైనీకి ఫోన్ చేసి రాంచీలోని తన ఫాంహౌస్‌లో పనిలో చేరాలని చెప్పాడట. దీంతో, సైనీ ఆనందానికి అవదులు లేకుండా పోయింది. తన అభిమాన క్రికెటర్ కోసం జీతం తీసుకోకుండా పని చేయడానికైనా సిద్ధంగా ఉన్నానని సైనీ చెబుతున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *