అమెరికాలో ఘోరం
– తన నలుగురి పిల్లలతో పాటు
మరో ఇద్దరిని కాల్చి చంపిన ఉన్మాది
హ్యూస్టన్, జులై 10 (జనంసాక్షి): అమెరికా మరోసారి కాల్పుల మోతతో ఉలిక్కిపడింది.
కుటుంబ కలహాలతో విసుగు చెందిన ఓ వ్యక్తి ఉన్మాదిలా మారి ఆరుగురిని కాల్చి చంపాడు. ఇందులో నలుగురు చిన్నారులు అతడి పిల్లలే. టెక్సాస్ రాష్ట్రంలోని ఉత్తర హ్యూస్టన్ నగరం శివార్లలో బుధవారం మధ్యాహ్నం ఈ దారుణం జరిగింది. హత్యకు గురైన వారిలో 4, 14 ఏళ్ల ఇద్దరు బాలురు, 7, 9 ఏళ్ల ఇద్దరు బాలికలు, 33ఏళ్ల ఓ మహిళ, 39 ఏళ్ల మరో వ్యక్తి ఉన్నారు. ఉన్మాది కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన మరి కొందరు పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే రంగంలోకి దిగారు. ఇంతమందిని హత్య చేసిన ఉన్నాది పోలీసులనూ మూడు గంటల పాటు ముప్పు తిప్పలుపెట్టి చివరికి లొంగిపోయాడు. అయితే హంతకుడి వివరాలను పోలీసులు బయటకు వెల్లడించలేదు. భార్యాభర్తల మధ్య గొడవే ఇంతమంది హత్యకు దారితీసినట్లు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు.