Monday, 2 November 2026

కూరగాయల ధరలతో ఉక్కిరిబిక్కిరి

vejetablesహైదరాబాద్‌,ఆగస్ట్‌1: వర్షాభావ పరిస్థితుల కారణంగా కూరగాయాల సాగు సాగకపోవడంతో వాటి   ధరలు కొండెక్కి కూర్చున్నాయి. ప్రస్తుతం అడపాదడపా పడ్డ వర్షౄలకు కొత్తగా పంటలు చేతికి వచ్చే వరకు ఈ పరిస్థితి కొనసాగుతుందని రైతులు అంటున్నారు. సకాలంలో  వర్షాలు లేకపోవడం.. జిల్లాల్లో కూరగాయల సాగు విస్తీర్ణం పూర్తిగా తగ్గిపోవడంతో రైతుబజార్లకు కూరగాయలు రావడం లేదు. ధరలు ఆకాశన్నంటడంతో వినియోగదారులు బెంబేలెత్తి పోతున్నారు. ధరలను నియంత్రించాల్సిన అధికారులు శ్రద్ధ పెట్టకపోవడంతో కూరగాయల కొరతను సాకుగా చూపి దళారులు ధరలను పెంచేస్తున్నారు. వర్షాకాలంలో కూరగాయలు తక్కువకు లభించాల్సి ఉన్నా పంటలు లేకపోవడంతో ధరలు మండుతున్నాయి. ఉన్నకొద్ది పాటి ఉత్పత్తులకు రేట్లు పెంచడంతో  ధరలు బాగా పెరిగిపోయి వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా ఈ సీజన్‌లో గతంలో ఎన్నడూ లేని విధంగా టమాటా ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. వందకు కేజీకి దగ్గరలో టమాటా ధరలు చేరుకున్నాయి. కూరగాయల్లో టమాటను ఎక్కువ మంది వినియోగిస్తారు. అలాంటి టమాట ఒక్కోసారి రైతును రాజు చేస్తోంది. మరోసారి బికారిగా మార్చేస్తుంది. పలు ప్రాంతాల్లో ఉత్పత్తి ఎక్కువగా ఉంటే మార్కెట్‌లోకి కుప్పకుప్పలుగా టమాట వచ్చేస్తుంది. అప్పుడు కిలో రెండు రూపాయలకు అమ్మిన రోజులు ఉన్నాయి. తెంపడం గిట్టుబాటు కాక అలాగే వదిలేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు కిలో రూ.60-70 ఉంది. ఈ సమయంలో మాట పంట చేతిలో ఉన్న రైతులకు ఎక్కువ ధర వస్తుంది. ప్రస్తుతం 20కి పావు తక్కువగా అమ్మడం లేదు. మదనపల్లి తదితర ప్రాంతాల నుంచి ఇతర ప్రాంతాలకు టమాటను ఎగుమతి చేస్తారు. మిగిలిన కూరగాయలను ఎక్కడి రైతులు అక్కడే సవిూప పట్టణాల్లో అమ్ముతారు. ఒక్కో జిల్లాలో  మొత్తంలో రోజుకు 500 నుంచి వేయి టన్నుల కూరగాయలు అవసరమని అంచనా. అందులో టమాట వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఒక్కో రైతుబజారుకు రోజు 70-80 టన్నుల కూరగాయలు అమ్మకానికి వచ్చేవి. అలాంటిది ఇప్పుడు 50 టన్నులకు మించి రావడం లేదు. ఈ ఏడాది వర్షాలు సరిగా లేకపోవడంతో కూరగాయలు చేతికి రాలేదు. నీటి ఆధారంగా సాగు చేసే కొంత మంది రైతులు మాత్రమే కూరగాయలను మార్కెట్‌కు తీసుకువస్తున్నారు. టమాట వర్షాధారం కావడంతో సాగుపై తీవప్రభావం ఉంది. నారు పోసిన రైతులు నాట్లు పెట్టెందుకు వీలుగా వర్షాలు కురవకపోవడంతో నాట్లు వేయలేకపోయారు. వారం రోజుల కిందట వర్షం కురిసినా అప్పటికే నారు దశ పూర్తికావడంతో నాట్లు వేయలేదు. దీంతో రాబోయే రోజుల్లో టమాట ధర ఇంకా పెరిగే అవకాశం ఉంది.

బీరకాయ, కాకరకాయ, సోర, దొండ, చిక్కుడు, పొట్లకాయ తదితర వాటి ధర చుక్కలు చూపిస్తున్నాయి. కిలో రూ.60-80 మధ్యన ఉన్నాయి. కొన్ని కూరగాయలైతే అసలు మార్కెట్‌లో కనిపించే పరిస్థితి లేదు. ఇతర ప్రాంతాల నుంచి దళారులు తీసుకువస్తే వాటి ధర ఎక్కువే ఉంటుంది. సీజన్‌లో రైతులు తీసుకొచ్చిన సందర్భంలో కిలో 40లోపు ఉంటుంది. అలాంటిది ఈ సీజన్‌లో రెట్టింపు ధర ఉండటంతో వినియోగదారులు కొనుగోలు చేయలేని పరిస్థితి ఉంది. పచ్చి మిర్చి ధర మంట పుట్టిస్తోంది.  మిరప సాగు తక్కువగా ఉండడంతో ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. సాగు చేసే ఆయా ప్రాంతాల్లో దిగుబడులు తక్కువగా ఉంటే ధర పెరిగిపోతుంది. ఈ ఏడాది సీజన్‌లో వర్షాలు లేకపోవడంతో మిరప దిగుబడులు తగ్గిపోయాయి. దీంతో కిలో ధర 80కి చేరుకుంది. కొన్ని కూరగాయలైతే రైతుబజార్‌లో కనిపించడం లేదు. క్యారట్‌, సిమ్లమిర్చి, బీట్‌రూట్‌, తదితర కూరగాయలు అప్పుడప్పుడు కనిపిస్తున్నాయి. మార్కెట్‌కు వచ్చిన రోజు వాటి ధర కిలో రూ.70-80 మధ్యన ఉంటున్నాయి. దీంతో ఎక్కువ మంది అంతో ఇంతో తక్కువ ధర ఉన్న ఆలచంత, వంకాయ, ఆలు, బెండ తదితర కూరగాయలను ఎక్కువ కొనుగోలు చేస్తున్నారు. ఆకుకూరల ధరలు సైతం ఆకాశాన్నంటాయి. కట్ట ధర రూ.5 ఉంది. దీంతో ఒక్క కట్ట కొనుగోలుకే పరిమితమవుతున్నారు. ఇక మొన్నటి వరకు రూ.10 లోపు ఉన్న ఉల్లి ధర ఇప్పుడు రూ.30కి చేరుకుంది. మంచి రకం అయితే 40 వరకు అమ్ముతున్నారు. జిల్లాలో ఉల్లి సాగు కేవలం కొన్ని ప్రాంతాల్లో సాగవుతోంది. ఆయా రైతులు ఇంటి అవసరాలకు పోనూ స్థానికంగానే అమ్మేసుకుంటారు. దీంతో మహారాష్ట్రలోని నాగాపూర్‌, అకోల, హింగన్‌గాట్‌ తదితర మార్కెట్ల నుంచి దిగుమతి చేసుకుంటారు. కర్నూలు తదితర ప్రాంతాల నుంచి కూడా దిగుమతి అవుతోంది. దీంతో ధర నిర్ణయం దళారులపైనే ఆధారపడి ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *