Tuesday, 3 November 2026

మమ్మల్ని కాపీ కొట్టడంతప్ప మీకేం చేతనైంది

2
ఎన్డీఎకు సోనియా సూటి ప్రశ్న 
న్యూఢిల్లీ, ఆగస్టు 13 (జనంసాక్షి) : ‘మమ్మల్ని కాపీ కొట్టడంతప్ప మీకేం చేతనైంది’ అని ఎన్డీఎ ప్రభుత్వాన్ని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ సూటిగా ప్రశ్నించారు. కనిష్ట ప్రభుత్వం.. గరిష్ట పాలన పేరుతో మోడీ సర్కారు యూపీఏ పథకాలను కాపీ కొడుతోందని ఆమె మండిపడ్డారు. మోడీ సర్కారు యూపీఏ పథకాలనే అమలు చేస్తోందని ధ్వజమెత్తారు. తమ పథకాలను ఎన్డీయే సర్కారు అనుసరించడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. బుధవారం కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటరీ సమావేశంలో సోనియా ప్రసంగించారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేశంలో మత ఘర్షణలు పెరిగాయన్నారు. బీజేపీ విభజన రాజకీయాలపై కలిసికట్టుగా పోరాడదామని సూచించారు. విభేదాలు పక్కన పెట్టిన పార్టీలో అందరూ కలిసి పనిచేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. మత ఘర్షణలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని పార్టీ నేతలకు సూచించారు. ‘ఇది మనకు పరీక్షా సమయం. గతంలో ఎన్నడూ లేని రీతిలో లోక్‌సభలో అతితక్కువ సీట్లను గెలుచుకున్నామని’ తెలిపారు. బీజేపీ అనుసరిస్తున్న విభజన, మతతత్వ రాజకీయాలను ప్రతిఘటించాలని ఎంపీలకు పిలుపునిచ్చారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలతో పార్టీని తిరిగి పునర్జీవింపజేసుకోవాలని సోనియా అభిప్రాయపడ్డారు.’బీజేపీ అధికారం చేపట్టిన గత పది వారాల్లో దేశానికి ఒక్క కొత్త పథకాన్ని ప్రకటించలేదు. పైగా కారణాల్లేకుండా మనల్ని విమర్శిస్తున్నారు. విధాన నిర్ణయాలు లేకుండా పాలన కొనసాగిస్తున్నారని’ ధ్వజమెత్తారు. అయితే, యూపీఏ ప్రభుత్వ పథకాలను కొనసాగించడం స్వాగతిస్తున్నామని చెప్పారు. కాపీ కొట్టడం ద్వారా మన పథకాలను వారు కూడా స్వాగతిస్తున్నారని తెలిపారు. వారి వైఫల్యాలను కప్పిపుచ్చుకొనేందుకు కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం వంటి అంశాలపై కేంద్రం ఎందుకు స్పందించడం లేదని సోనియా నిలదీశారు. ‘దేశవ్యాప్తంగా ధరల మోత మోగుతోంది. సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యువత, కార్మికులు ఉపాధి లేక నిస్పృహలో కూరుకుపోతున్నారని’ ఆవేదన వ్యక్తంచేశారు. ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దకుండా ఇంకా ఎంత కాలం యూపీఏ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తారని మోడీ సర్కారును ప్రశ్నించారు. ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్‌పైనా కాంగ్రెస్‌ అధినేత్రి మండిపడ్డారు. కేంద్రం బడ్జెట్‌ ప్రవేశపెట్టి ఆమోదించుకుందని, ఆర్థిక వ్యవస్థలో ఎలాంటి మార్పు లేదని విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తాము ప్రవేశపెట్టిన పథకాలను తీవ్రంగా తప్పుబట్టిన బీజేపీ.. ఇప్పుడు చేస్తున్నదేమిటి? అని ప్రశ్నించారు. గూడ్స్‌ అండ్‌ సర్వీస్‌, చక్కెరపై సబ్సిడీ, రైలు, డీజిల్‌ చార్జీల పెంపు, ఇన్సూరెన్స్‌ రంగంలోకి ఎఫ్‌డీఐలు, ఆధార్‌ స్కీమ్‌ ఇతర యూపీఏ కీలక పథకాలకు ఇప్పుడు ప్రభుత్వం మద్దతు తెలుపుతోందన్నారు. 


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *